Infinite mysteries……………………………………………………………
చంద్రుడిపై, అంగారకుడిపై ఇళ్లు కట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నారు. ఐడియా బాగానే ఉన్నప్పటికీ ఆ ప్రాంతం నివాసయోగ్యమా కాదా అన్నది ఇంకా తేలలేదు.
కానీ ఇళ్లు కట్టుకోవడమెలాగన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై, అంగారకుడిపై ఉన్న మట్టితోనే గట్టి ఇటుకలను, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని గుర్తించారు. ధూళి రూపంలో ఉండే చంద్రుడి పైన ఉన్న మట్టిని తీసుకొచ్చి శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు.
ఆ ప్రయోగాలన్నీ ఆ మట్టిలోని రసాయనాలు భూమిపై ఉండే మట్టికి భిన్నంగా ఉన్నాయని తేల్చాయి.
చంద్రుడు, అంగారకుడిపై మట్టికి ఉప్పు నీళ్లు కలిపి ఇటుకలు, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రణజే ఘోష్ ఆమధ్య ప్రకటించారు.
ఇప్పటి వరకు అంగారక గ్రహం పై ఎన్నోపరిశోధనలు జరిగాయి. ఇప్పటికి జరుగుతున్నాయి. రెడ్ ప్లానెట్ను అధ్యయనం చేయడానికి 40 కి పైగా అంతరిక్ష నౌకలను పంపారు. వీటిలో సగానికి పైగా విఫలమయ్యాయి. కొన్ని అంతరిక్షం లోకి పోయాయి. మరికొన్నిఆ గ్రహం ఉపరితలంపై కూలిపోయాయి.
పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం రెడ్ ప్లానెట్‌పై బిలియన్ల ఏళ్ల క్రితం సమృద్ధిగా నీరు ఉండేదని. సరస్సులు, మహాసముద్రాలు కూడా ఉన్నాయని కానీ కాల క్రమేణా ఆ నీరంత మాయమై పోయిందని భావిస్తున్నారు. ఆ నీరు ఏటు పోయిందన్న దానిపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు మార్స్‌పై గురుత్వాకర్షణ తగ్గడంతో అంతరిక్షం లోకి నీరు పోయిండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
కాగా అంగారక గ్రహం వాతావరణంలో కార్బన్‌డై యాక్సైడ్ తగ్గిపోవడం మూలంగా పొడిగా ఎడారిలా మారిందని గతంలో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ గ్రహం వాతావరణంపై కొత్తగా అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే అంగారక గ్రహంపై వెచ్చదనంతోపాటు తడి కూడా ఉండేదని… అది క్రమంగా చల్లగా, పొడిగా మారిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం అంగారక గ్రహం మీద ఒక రాతి కొండ కింద లోపలికి వెళ్ళడానికి వీలుగా తలుపులాంటి నిర్మాణం(డోర్‌వే) ఉన్నట్లుగా కనిపించే ఫోటో ఒకటి వైరల్ అయింది. ఆ ద్వారం అంగారక గ్రహం మీద ఉన్న మనుష్యులు లోపలికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిందే అని ప్రచారం జరిగింది. ఈ విషయం పై నాసా వివరణ ఇవ్వలేదు. ఫోటో చూస్తే అది తలుపు లాంటి నిర్మాణమే అనిపిస్తుంది.
కానీ సహజ సిద్ధంగా ఏర్పడిన ‘రాక్ ఫార్మేషన్’ అనే వాదన కూడా వినిపించింది. అలాగే ఇది ఏలియన్లు నిర్మించిందేంటూ ప్రచారం కూడా మొదలైంది. మార్స్ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం ఇప్పటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను బలంగా సమర్థించింది.
అది ఏలియన్ల పనేనంటూ వాదించడం మొదలుపెట్టారు కొందరు. చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని పరిశోధకులు తేల్చారు. ఇలాంటి నిర్మాణాలు మరిన్ని బయటపడితే కానీ అసలు అక్కడ ఏముందో అర్ధం కాదు. మొత్తం మీద చూస్తే అంగారక గ్రహం రహస్యాల మయం అనిపిస్తుంది. ఏలియన్స్ కానీ జీవులు కానీ ఉన్నాయా లేవా? అనేది పరిశోధనలు పూర్తయితే తేలదు. అందుకు ఎంత కాలం పడుతుందో ?