డైరెక్ట‌ర్ల‌కి,ర‌చ‌యిత‌ల‌కి ‘షోలే’ ఒక పెద్ద బాల‌శిక్ష‌!

Sharing is Caring...

Gr.Maharshi……………………………………..

షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే , ఆ సినిమా ఆప‌రేట‌ర్ కూడా అన్ని సార్లు చూసి వుండ‌డు. నా పాలిట అదో డ్ర‌గ్‌. ఇప్ప‌టికీ నిద్ర రాక‌పోతే చూస్తూ నిద్ర‌పోతాను. ఏముంది దాంట్లో. జ‌స్ట్ క్రైం థ్రిల్ల‌ర్‌. బందిపోట్లు మీద వ‌చ్చిన ఎన్నో సినిమాల‌కి కాపీ.

సెవెన్ స‌మురాయ్‌, ఫైవ్ మాన్ ఆర్మీ, మేరాగావ్ మేరా దేశ్‌, ఖోటే సిక్కే ఇవ‌న్నీ క‌లిస్తేనే షోలే క‌దా. నిజ‌మే. జ‌స్ట్ కాపీ అయితే షోలే ఎపుడో గాలికి పోయేది. ఆ సినిమాలో అంతు చిక్క‌ని ఫిల‌సాఫిక‌ల్ జ‌ర్నీ వుంది. స‌లీం -జావేద్ ర‌చ‌న‌లోని గొప్ప‌త‌నం అది. అంత గొప్ప‌గా మ‌ళ్లీ వాళ్లు కూడా రాయ‌లేక‌పోయారు. ప‌ల్ప్ రాసి విడిపోయారు.

క‌థ‌లు రాసుకోవ‌డంలో ప‌ల్టీలు కొట్టే అనేక మంది డైరెక్ట‌ర్ల‌కి, ర‌చ‌యిత‌ల‌కి షోలే ఒక పెద్ద బాల‌శిక్ష‌.
1.రైలుతో ప్రారంభ‌మైన సినిమా రైలుతోనే ముగుస్తుంది. జీవితం ఒక ప్ర‌యాణం 2.ప్రాణ స్నేహితుడితో ఆనందంగా రైలు దిగిన ధ‌ర్మేంద్ర చివ‌రికి స్నేహితుడు లేకుండా, కొత్త స్నేహితురాలితో తిరిగి వెళ్తాడు. ప్ర‌యాణంలో మ‌న‌తో ఉన్న వాళ్లు దిగిపోతారు. కొత్త వాళ్లు క‌లుస్తారు. మ‌నం కూడా దిగిపోతాం. రైల్లో వుంటే దిగే స్టేష‌న్ తెలుసు. జీవితంలో స్టేష‌న్ ఎక్క‌డుందో తెలియ‌దు.

3.ప్ర‌పంచంలో అత్యంత భారం ఏమంటే కొడుకు శ‌వ‌పేటిక‌ని భుజాల మీద తండ్రి మోయ‌డం. ఈ డైలాగ్ రాయాలంటే చాలా తెలియాలి. ఈ సీన్‌లో ఎకె.హంగ‌ల్ సాబ్ Expression గొప్ప‌ది. లోప‌ల ఏదో పిండేస్తుంది. చిన్న‌ప్పుడు అర్థం కాలేదు. పెద్ద‌య్యాక కొంత మంది తండ్రులు బిడ్డ‌ల్ని పోగొట్టుకుంటూ వుంటే ఈ డైలాగ్ గుర్తొచ్చేది. భుజాల మీద మోసిన పిల్ల‌ల్ని , భుజాల మీద మోసే క‌ష్టం ఎవ‌రికీ రాకూడ‌దు.

4.జీవితం అంతా బాగుంది, బాగుంటుంద‌ని అనుకుంటున్న‌ప్పుడు దెబ్బ కొడుతుంది. పెళ్లి చేసుకుని, కాసింత పొలం కొనుక్కుని బ‌తుకుదామ‌నుకున్న అమితాబ్ అర్ధాంత‌రంగా చ‌నిపోతాడు. 5.ఎందుకీ ప‌నిరాని వాళ్లు కూడా కొన్నిసార్లు ప‌నికొస్తారు. చెల్ల‌ని నాణెం రెండు వైపులా చెల్ల‌ద‌ని జైల‌ర్ అంటే (ఫ‌స్ట్ సీన్‌) నాణేనికి , మ‌నిషికి తేడా వుంటుంద‌ని స‌మాధానం. డ‌బ్బు కోసం ప‌ని చేసే కిరాయి రౌడీల్లా హీరోలు క‌నిపించినా వాళ్ల లోప‌ల మ‌నిషి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా వుంటాయి.

షోలేని అనుక‌రిస్తూ ఎన్ని సినిమాలు వ‌చ్చినా తుస్సుమ‌న‌డానికి కార‌ణం ఈ తేడాని, క్యారెక్ట‌ర్‌ని రైటింగ్‌లో ప‌ట్టుకోలేక‌పోవ‌డం. రైటింగ్‌లో లేనిది టేకింగ్‌లో రాదు.చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కోత‌ల రాయుల్ని చూస్తే అస్రాని, జ‌గ్‌దీప్ గుర్తుకొస్తారు. ప‌ని రాక‌పోయినా పై హోదాల్లో ఎక్కువ‌గా వుంటారు వీళ్లు.

న‌వ్వించి, న‌వ్వించి కాల్చే అంజాద్‌ఖాన్‌కి లేటెస్ట్ వెర్ష‌న్ నేటి రాజ‌కీయ నాయ‌కులు. కాక‌పోతే వీళ్లు చంప‌రు. కొండ చిలువ‌లా కొంచెం కొంచెం మింగుతారు. దాని పొట్ట‌లో జీర్ణం అవుతున్న‌ప్పుడు కూడా మ‌నం బ‌తికే వుంటాం. అదో విషాదం.సంతోషంగా వుండే జ‌య‌, గంభీర దుక్క న‌దిలా మారిపోతుంది. అమితాబ్ మౌత్ ఆర్గాన్ వినిపిస్తుండ‌గా దీపాల ముందు జ‌య‌. ఈ సీన్ ఎన్ని వంద‌ల సార్లు చూసినా … అదో మార్మిక లోకం.

హేమ గౌర‌వం కాపాడ్డానికి గుర్రం తీసే ప‌రుగు , బ‌ర్మ‌న్ వినిపించే త‌బ‌లా శ‌బ్దం ఇంకా వెంటాడుతూనే వున్నాయి. చివ‌రగా నా అభిమాన డ్యాన్స‌ర్ హెలెన్ మెహ‌బూబా పాట. భార‌త‌దేశాన్ని ఒక ఊపు ఊపిన పాట‌. 85 ఏళ్ల‌లో కూడా హెలెన్ క‌ళ్ల‌లోని క‌ళ , న‌వ్వుకి మించిన జీవ‌న సారం వుంటుందా? ఆమె డ్యాన్స్‌ని మాత్ర‌మే ప్రేమించింది. ప‌ద్మ‌శ్రీ‌తో స‌హా అన్నీ అవే వ‌చ్చాయి.

షోలే వ‌చ్చి 49 ఏళ్లైంది. తొలి ప్రేక్ష‌కుల‌తో స‌హా అంద‌రూ పెద్దాళ్లు అయిపోయారు. చాలా మంది పోయారు. సినిమా మాత్రం ఇంకా య‌వ్వ‌నంగానే వుంది.


(197 వ్యాసాల బుక్ మార్నింగ్ షో కావలసిన వారు నవోదయ బుక్ హౌస్ కాచిగూడ, అక్షర బుక్స్ జూబిలీ హిల్స్, విశాలాంధ్ర మధుర నగర్ లో పొందవచ్చు.9000226618, లేదా +916304880031 నంబర్ కి 450 రూపాయలు ఫోన్ పే చేస్తే పోస్ట్ ఖర్చు పెట్టుకుని పంపుతారు. అడ్రస్ WhatsApp లో పంపండి.)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!