దేశంలో ‘రాబందులు’ పడ్డాయి!

Sharing is Caring...

సుదర్శన్ టి …………………………………… 

Outrageous exploitation……………………………………………………..లక్నో కాన్పూర్ మధ్యలో ఓ పారిశ్రామిక టౌన్ ఉంది పేరు Unnao, టౌను శివార్లలో పారే నది ఈ వర్షాలకు కాస్త నిండింది, అలా నిండగానే చాలా శవాలు నదిలో కొట్టుకు రావడం మొదలయ్యింది. అవన్నీ కోవిడ్ వల్ల చనిపోయిన వ్యక్తుల శవాలు. నార్త్ లో హిందువులు శవాన్ని దహనం మాత్రమే చేస్తారు కానీ గత నెల వరకూ 500 రూపాయలు ఉన్న కట్టెల ధర ఇప్పుడు 2000 రూపాయలు పలుకుతోంది. ఇదే ఆ మొదటి రాబందు. దహన సంస్కారాలు నిర్వహించే పురోహితుడు, సామగ్రి, ఆయా వ్యక్తుల కూలీ కలిపి ఒక శవాన్ని తగులబెట్టడానికి 10 వేల రూపాయల ఖర్చు వస్తుంది. అంత స్థోమత లేక నది ఒడ్డునే ఓ 3 అడుగుల గొయ్యితీసి శవాన్ని కప్పేశారు. ఆ శవాలే ఇలా నదిలో కొట్టుకొచ్చాయి.

కరోనా కేసులు పెరగ్గానే హాస్పిటళ్లలో అడ్వాన్స్ కట్టి బెడ్లు రిజర్వ్ చేసుకుని ఆ తర్వాత పేషంట్ అవసరాన్ని బట్టి బ్లాకులో బెడ్లు అమ్ముకున్న బ్రోకర్ రాబందులు ఎన్నో… హాస్పిటల్ స్టాఫ్ గా ఉద్యోగం చేస్తూ మందులకు లేని కొరత సృష్టించి, పేషంట్ బంధువులను బెంబేలెత్తించి వందల రూపాయల మెడిసిన్ వేల రూపాయలకు అమ్ముకున్న రాబందులు కొన్ని. పేషంటును హాస్పిటల్ కు తరలించడం కంటే శవాన్ని శ్మశానానికి తరలించడానికి వేలల్లో వసూలు చేసిన అంబులెన్సులు ఎన్నో.

10 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్ 90 వేలకు అమ్మడం ఒక ఎత్తయితే, తల్లికోసం ఆక్సిజన్ సిలిండర్ కోసం వెదకుతున్న కూతుర్ని సిలిండర్ కావాలంటే తనతో ఓ రాత్రి గడపాలని చెప్పిన ఆక్సిజన్ ప్లాంట్ యజమాని కూడా ఈ రాబంధుల్లో ఒకడు. ఆక్సిజన్ సిలిండర్ పేరుతో ఖాళీ సిలిండర్లు సప్లై చేసి వేలు వసూలు చేసి పేషంట్లను మోసం చేసి పట్టుబడ్డ రాబందులు కూడా ఉన్నాయి.ఇక పనికిరాని రెమిడిస్విర్, ప్లాస్మా థెరపీ పేరుతో వేలు/లక్షలు వసూలు చేసిన హాస్పిటల్ రాబందులు ఎన్నో మనకు తెలుసు.జర్నీల కోసం తప్పుడు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు ఇచ్చి అమాయక ప్రయాణీకులకు కరోనా సోకేందుకు కారణమైన ల్యాబ్ రాబందులను మనమే చూసుంటాము.

ప్రతి నగరంలో, ప్రతి టౌనులో, పల్లెల్లో దాడిచేసి శవాల గుట్టలమీద విందారగించిన రాబందులన్నీ ఈ పవిత్రభూమి నుండి పుట్టినవే. ఈ ప్రస్థానం ఎలా మొదలయ్యిందో చూద్దాం. డాక్టర్లు, నిపుణులు చెప్పిన రెండవ వేవ్ ను పెడచెవినపెట్టి ఏ మాత్రం ఏర్పాట్లు చెయ్యని ప్రభుత్వాలతో ఇది మొదలయ్యింది. ఇక్కడ కేంద్రం ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తమ ప్రజల బాగోగుల బాధ్యత ఉంది. నివారణ చర్యలు ఏమాత్రమూ చేపట్టలేదు. కేంద్రం కోవిడ్ నియంత్రణకు కావాల్సిన వనరుల సరఫరాకు సంబంధించిన కోఆర్డినేటెడ్ వెబ్సైట్ ప్రారంభించడంలో విఫలమైనది. అధికారులు విదేశాల నుండి వచ్చిన సహాయ సామగ్రి, వ్యాక్సిన్లు విమానాశ్రయం నుండి వెంటనే క్లియర్ చేయడంలో అలసత్వం చూపారు.

సెంట్రల్ ల్యాబొరేటరీ స్పుత్నిక్ టీకాల సేఫ్టీ టెస్టులు ప్రారంభించడంలో బాగా ఆలస్యం చేసింది. రాష్ట్రాలకు ఆక్సిజన్ అందలేదు, రాష్ట్రాలు కూడా తమకు కావలసినంత ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడంలో విఫలమయ్యారు. పీఎం కేర్స్ ఫండ్ తో కొన్న చాలా ఆక్సిజన్ ఎక్విప్మెంట్లు పనిచేయలేదు. రెమిడిసివిర్, ప్లాస్మా థెరపీ మీదున్న అజ్ఞానం కాస్తా బ్లాక్ మార్కెటింగ్ చేసుకోడానికి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వాలు విఫలమయ్యాయి కానీ ఆ వైఫల్యాన్ని సొమ్ము చేసుకోవడంలో మన దేశ రాబందులు ఏ మాత్రం విఫలమవ్వలేదు.ఇన్ని రాబందుల మధ్య అక్కడక్కడా మంచి వారు కూడా లేకపోలేదు. వాళ్లంతా తలో చేయి వేసి బాధితులకు సహాయ పడుతున్నారు. 
(వీళ్ళను, చచ్చాక మాత్రమే పీక్కుతినే రాబందులతో పోల్చినందుకు రాబందులకు క్షమాపణలతో….)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!