సాయుధ పోరాటంలో బలైన కుటుంబాలకు నీరాజనం!

Sharing is Caring...

Priyadarshini Krishna —————————-
ఈ మధ్య రిలీజైన రజాకార్ సినిమా గురించి రాయమని ఇఫ్పటికే చాలామంది మిత్రులు అడిగారు. ఆ చిత్ర దర్శకుడు స్వయంగా నా మిత్రుడు కొలీగ్ అయిన మూలాన రాయడానికి ఆలోచించాను.
ఒక మంచి సినిమా గురించి రాయడం వల్ల దానిని పదిమంది చూసే అవకాశం వుంటుంది.
అందరికీ ముందుగా చెప్పదల్చుకున్నది ఏంటంటే…. ఇది ప్రాపగాండా సినిమా కాదు.

చాలామంది మేథావులు దీనికి కాషాయ రంగు పులిమారు. ఈ చిత్ర నిర్మాత గూడూరి నారాయణ రెడ్డి గారు బీజేపి నాయకుడు కావడం ఒక కారణమైతే, ఆయన చాలా చోట్ల హిందుత్వం గురించి కాశీం రజ్వీ హిందువులపై చేసిన అరాచకాల గురించి గొంతు చించుకోడమే కారణం.
అవన్నీ పక్కన పెట్టి సినిమా గురించి మాట్లాడుకుందాం….

ఒక దర్శకుడు తన తొలి సినిమా(debut) జనాకర్షకంగా ముఖ్యంగా యువతను ఆకర్షించేదిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ యాటా సత్యనారాయణ ఈ సబ్జెక్టును ఎంచుకుని తాను వైవిధ్య తను కోరుకుంటునట్లు స్పష్టం చేసాడు. చరిత్ర .. చారిత్రక ఘట్టాలతో చిత్రీకరించే పీరియడ్ చిత్రాలను హాండిల్‌ చెయ్యడం చాలా కష్టం. ముఖ్యంగా రీసర్చ్ విషయంలో మేకింగ్ విషయంలో ఏమాత్రం తడబడినా మొత్తం సినిమా గాడితప్పే ప్రమాదం ఉంది.

పాతకాలం నాటి జాగ్రఫీ తెరపై సృష్టించాలంటే VFX తప్పనిసరి. అది అధిక ఖర్చుతో కూడుకున్నది. అనుకున్న ఏఫెక్ట్ తెరపై కనపడే వరకూ డబ్బులు పోస్తూ పోవాలి. ఈ విషయంలో నిర్మాతకి జేజేలు. ఖర్చుకు వెనకాడలేదు. వందలమంది జూనియర్‌ ఆర్టిస్టులతో, అడుగడుగునా VFX తో మేకింగ్ కి సపోర్ట్ చేసారు.

ఈ పాటికే కథ మీ అందరికీ తెలుసు. ఎప్పటిలాగే కథను నేను చర్చించను. అది కథకుని ఇష్టం. కథనాన్ని – స్క్రీన్‌ప్లేని, ఇతర టెక్నికాల్టీస్ ని రాస్తాను. కథ : భారత దేశం స్వాతంత్యం పొందిన అనంతరం హైద్రాబాదును భారత్‌లో విలీనం చెయ్యడానికి విముఖత చూపిన నిజాం, పాలన ఇతర కీలక బాధ్యతలు కాశీం రజ్వీ కి అప్పగిస్తాడు. అతడి అకృత్యాలతో వేసారిన ప్రజలు సాయుధ పోరాటాలు ఎలాచేసింది భారత్‌లో ఎలా విలీనమైనది అనేది కథ.

కథనం: చాలా మట్టుకు పీరియడ్ మూవీస్, బయోగ్రఫీలు స్క్రీన్‌ప్లే ఒక టెంప్లేట్ లో సాగుతాయి. ప్రస్తుత కాలానికి చెందిన ఒక వ్యక్తి తాలూకూ గతాన్ని ప్రేక్షకులకి చెప్పడం అనేది బాగా పాప్యులర్ స్టైల్. కానీ ఈ సినిమా డైరెక్టర్ POV లో సాగడమే కాకుండా antagonist ప్రతినాయకుడు/ విలన్ ని ప్రధాన పాత్రలో చూపిస్తూ నడిపిన సినిమా.

కాశీం అనేవాడు ఒక ప్రైవేట్ ఆర్మీతో ఇస్లాం పేరిట చేసే అకృత్యాలు నైజాం రాజ్యమంతా ఎలా ప్రబలిందో, ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎలా విలవిల్లాడుతున్నారో ఒక్కో ఎపిసోడ్ రూపంలో గుదిగుచ్చారు.

ఒక కథను ప్రాథమిక థ్రెడ్ లాగా కాకుండా…వివిధ సంఘటనలు దురాగతాలను ఒక్కో సీన్‌లాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతీ భాగంలో ఒక్కో కొత్త పాత్ర ప్రవేశించి కాశీం కి ఎదురు తిరిగి అసువులు బాయడం, తద్వారా కాశీం ని తుదముట్టించడం సామాన్య ప్రజలవల్ల కానిదని చెప్పడం బాగుంది. కానీ ప్రతి ఎపిసోడ్ లో వచ్చే ప్రధాన పాత్రలను మనం గుర్తుపట్టే వీలు గానీ గుర్తుంచుకునే వీలు గానీ లేకుండాపోయింది. నిజాం, కాశీం తప్ప ఎవరూ గుర్తుండరు.

కానీ ప్రతీ ఎపిసోడ్ అప్పటి అకృత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపుతూ వెన్నులో వణుకు పుట్టేలా చిత్రీకరించారు. ఇప్పటి తరానికి ఇలాంటి డిటేలింగ్ చాలా అవసరం. మన పూర్వీకులు ఎన్నెన్ని ఘోరాలు సహించి బలిదానాలు ఇస్తేనే మనకు ఈ స్వేచ్చా వాయువులు వచ్చాయో తెలియాలి.

డైలాగ్స్:
స్వాతంత్య్ర కాలపు కథకావడం వల్ల అప్పటి తెలుగు, తెలంగాణ ఇప్పటిలా కాకుండా ఇంకొంత స్వచ్ఛంగా చిక్కగా వుంటుంది. దానినే ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించారు. ప్రతి పాత్ర ప్రేక్షకునిలో అస్థిత్వాన్ని మేల్కొల్పి, ప్రతీకార వాంఛని రగల్చేదిగా వున్నప్పుడే తెరపై పాత్రలతో మమేకమౌతాడు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. కొన్ని కొన్ని డైలాగులు బాగున్నాయి, కొన్ని ఇదివరకే వచ్చిన సినిమాల్లో విన్నట్లుగా ఉన్నాయి.

తెలంగాణ పల్లె పదాల విషయానికొస్తే కొంత చూసీచూడనట్లు వ్యవహరించినట్లుగా వుంది.  తెలంగాణ యాస పేలవంగావుంది. ఆంధ్ర డబ్బింగ్ ఇంచార్జ్ ఆంధ్రడబ్బిగ్ ఆర్టిస్టులచేత చెప్పించినట్లే అనిపించింది. మన భాషాయాసా అనే భావన కలగలేదు. యాటా ఎంతో శ్రద్ధపెట్టాల్సింది.

ఆర్ట్ & సెట్ డిజైన్స్ …
నిజాంకాలపు తెలంగాణా వెనకబాటుతనం కళ్ళకు కట్టారు. బురుజులూ గడీలు పల్లెలు వ్యాయామశాలలు ఉన్నంతలో చాలా కన్విన్సింగ్ గానే తయారుచేసారు. అప్పటి ఎడ్లబళ్ళు, పొలాలు .. కల్లాలతోబాటూ పల్లె బాటలు, పల్లెలు బాగున్నాయి. చాలాచోట్ల VFX సహాయం తీసుకున్నారు. పల్లెల సీన్స్ లైటింగ్ కి రేన్‌ఇఫెక్ట్ కి అనుకూలంగా డిసైన్ చేసుకున్నారు. వైడ్ షాట్స్ ఏరియల్ షాట్స్ చూపించి నాచురల్ ఫీల్ ని తెచ్చారు.

సినిమాటోగ్రఫీ :
రమేష్ రెడ్డి కెమెరావర్క్ బాగుంది. ఈ సినిమాకి కథనం ఎలా ముఖ్యమో సినిమాటోగ్రఫీ కూడా ఆయువుపట్టు. అవసరమైనచోట ప్రతీ డిటేయ్‌లింగ్ మిస్సవలేదు. కాశీం కౄరత్వం ఎలివేట్ చేసినా కూడా దాని ఎండ్ ఫీలింగ్ బాధ దుఃఖం మూడ్ కి తగనట్లుగా లైటింగ్, కెమెరా మూవ్‌మెంట్స్ ని చేర్చి రక్తికట్టించారు. ఎక్కడ వైడ్ కావాలో .. ఎక్కడ టైట్ క్లోస్ కావాలో బాగా తెలిసిన కెమెరామాన్‌ ఉండటం ఏ సినిమాకైనా ముఖ్యం. దీనిని యాటా తన కెమెరామన్ ద్వారా సాధించాడు.

మ్యూజిక్/ బ్యాగ్రౌండ్ స్కోర్:
గొప్పగా లేకపోయినా కథ నడుస్తున్నంత సేపూ రక్తి కట్టించింది. తెలంగాణ జానపద సంగీతం ఛాయలు లేవు, సినిమాటిక్ మోత ఉంది. తెలంగాణ గుండెచప్పుడు జానపద నేపథ్యసంగీతాన్ని ఇముడ్చుకోడానికి ఎంతో ఆస్కారమున్నా ఏమాత్రం ఆ నేటివ్ ఛాయలు వినిపించలేదు. బతుకమ్మ పాటలో కొంతమేరకే తెలంగాణ పల్లెదనం వినిపించింది. ఓవరాల్‌గా సంగీత దర్శకుడు బీమ్స్ బాగానే చేసాడు. వందశాతం ఇవ్వగల అతను ఎందుకనో పొదుపువ హించాడు. సింగర్స్ శంకర్‌మహదేవన్‌ని, కైలాశ్ ఖేర్‌ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు.

లిరిక్స్:
పోరాట గాథల సినిమాలకు లిరిక్స్ కూడా చాలా ముఖ్యం. సీన్స్ లో చూపించలేని కొన్ని ఎపిసోడ్స్ పాటల్లో కవర్ చెయ్యొచ్చు. అలాగే ప్రేక్షకుల్లో భావుకతని ఆర్థ్రతని నింపెయ్యొచ్చు. సరిగ్గా ఈ స్కీంనే దర్శకుడు యాటా ఉపయోగించుకున్నాడు. నినాదాలతో ప్రజల్లో పోరాటపటి మని రగిలించే పాట పోతుగడ్డ పాట , నిజాం పేరుమీద రజాకార్ల అకృత్యాలు చూపించే ఎపిసోడైన బైరాన్ పల్లిలో మహిళలు బతుకమ్మ పాట భారతిభారతి ఉయ్యాలో చాలా బాగా కుదిరింది.

అది ఇప్పటికే జనరంజకం అయింది. ఒక్కో ఊరిలో ఒక్కో పౌరుడు ఎలా పిడికిలిపట్టి తిరుగుబాటు చేసాడో ప్రాణం గడ్డిపోసఅనుకో పాటలో చక్కగా ఇమిడ్చారు. స్త్రీలు పిల్లలుసైతం తమవంతు సాయం ఎలాచేసారో ఈ పాటలో స్పష్టం చేసారు. పాటలను సుద్దాల అశోక్‌తేజ, కాసర్ల శ్యాం చాలా బాగా రాసారు…

హై పాయింట్స్:
ఈ సినిమాలో అడుగడుగునా హై పాయింట్సే… ఇంటర్‌వెల్ బ్లాక్ మాత్రం రోమాంచకం…. ఇలాంటి సీన్లు కన్విన్సింగ్ గా తియ్యాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఏమాత్రం మోతాదు మించినా తమిళం లాగా అనిపిస్తుంది. ప్రతీ ఎపిసోడ్లో హై ఎమోషల్/ పీక్ పాయింట్ వుండేలా శ్రద్ధతీసుకున్వారు.

VFX: పీరియడ్/ వార్ డ్రామాలు తియ్యాలంటే VFX తప్పనిసరి. ఈ సినిమాకి కూడా దానిని జాగ్రత్తగా, అర్థవంతంగా ఉపయోగించుకున్నారు. వార్ టాంక్‌లు మొదలుకుని హైదరాబాద్ నగర వీధులు, కింగ్ కోఠి, చార్మినార్ అబీడ్స్, కోఠి పాలెస్, మక్కామసీదు వంటివి చాలాబాగా చూపించారు.
నిర్మానుష్యమైన రోడ్లు, కూడళ్లు , పాతకాలం భవంతులు, పాతకాలం టాంక్‌బండ్ వగైరాలను బాగా ఉపయోగించారు.పటేల్ బేగంపేట విమానాశ్రయంలో నిజాంను కలవడం వంటి హిస్టారిక్ మూమెంట్స్ కూడా చక్కగా చిత్రీకరించారు.

నటన:
ఇక నటులు వారి నటన కూడా చాలావరకు సహజంగానేవుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు కాశీంరజ్వీ గా చేసిన రాజ్ అర్జున్ కి చాలా మంచి ఫ్యూచర్ వుంది. చాలా కష్టపడ్డాడు.
మిగతావారైన తేజ్ సపూరు – పటేల్‌, మకరంధ్ దేశ్పాండే – నిజాం మీర్ ఉస్మాన్‌, ప్రేమ- అంతవ్వ, ఇంద్రజ- చాకలి ఐలవ్వ , వేదిక – శాంతవ్వ, అనసూయ- పోచవ్వ …న్యాయం చేసారు. చిన్న పాత్రలు డైలాగ్ లేని పాత్రధారులు కూడా చాలా నిబద్ధతతో కన్విన్సింగ్ గా నటించారు.
పటేల్, నెహ్రూ, శాస్త్రీజీ, నిజాం వంటి పాత్రలు చేసిన నటులు కూడా చాలా బాగా నప్పారు.

మైనస్:
ఇన్ని హై ఎమోషనల్ పాయింట్స్ ఉన్నాకూడా ఎక్కడో ఆర్థ్రత లోపించింది. కళ్ళు చెమర్చినా పేగుమెలి పెట్టి గొంతులో తడారిపోయేలా చెయ్యలేకపోయింది. తెరపైన కళ్ళముందు కథ రన్‌ అవుతుంది నటనకు డైలాగులకు ఉత్సాహమొస్తుంది. కానీ కావలసిన డీప్ఎమోషన్ కొరవడింది. ఇదే ఈ మధ్యవస్తున్న చాలా సినిమాల్లో ఉండే లోపం.

మై వ్యూ:
టేక్నికల్ గా ఎలా ఉన్నా ఇప్పటి జనరేషన్ కి ఇలాంటి సినిమాలు చూపించాల్సిన అవసరం చాలా ఉంది. గడచిన తరాలు ఎన్నేన్ని అగచాట్లు పడ్డారు, ఎన్నెన్ని అకృత్యాలను ఎదుర్కొన్నారు, ఎన్నెన్ని ప్రాణత్యాగాలు చేసారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

హిందుత్వ వాదం, రైట్‌వింగ్ సినిమా అని రంగు పులిమే మేథావులు కాశీం రజ్వీ అతని రజాకారులు తెలంగాణ ప్రజల మీద జరిపిన అరాచకాలను మర్చిపోయారన్నమాట. కాశీం బలవంతంగా ముస్లీం మత మార్పిడులను వీరంతా పాస్ చేస్తున్నారన్నమాట. మతమార్పిడి, హిందువుల ఆవేదన పక్కన పెడితే రజాకారుల అకృత్యాలు ఆడవారి మానప్రాణాలను నలిపేసిన కథనాలను వీరు నయనేర్పుగా మర్చిపోయి మరిపించ చేయాలనుకుంటున్నారు.

దీనివల్ల చరిత్రలోని అత్యంత అమానుషమైన రక్తపు మరకలున్న పేజీని తగల బెట్టాలనుకుంటున్నారు….ఈ సినిమా హిందువుల ఆక్రందన మాత్రమే కాదు, సాయుధ పోరాటంలో అంతమైపోయిన ఎన్నో కుటుంబాలకు నీరాజనం.ఈ సినిమా హిందుత్వవాదాన్ని రగిల్చే ప్రాపగాండా అని ఓట్ల రాజకీయాలు చేసే కుహనావాదులా చెప్పేది…!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!