Bharadwaja Rangavajhala ….
ఒకే పాటను ఇద్దరు కలిసి రాసిన సందర్భాలు తక్కువ. తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం రెండు,మూడు సందర్భాలున్నాయి. వాటిలో ఇదొకటి. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్…ఈ పాట డెబ్బై దశకం చివరల్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది.
అప్పటికే ఫిఫ్టీస్ క్రాస్ చేసేసిన ఆత్రేయ, ఎమ్మెస్ విశ్వనాథన్ లు ఆ పాట సృష్టి కర్తలు. ఆమధ్య విడుదలై హిట్టు కొట్టిన “భలే భలే మగాడివోయ్” సినిమా ప్రారంభంలోనూ ఈ ఇద్దరు ప్రముఖులకూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటకు సంబంధించి చాలా మందికి తెలియని రహస్యం ఒకటుంది.
సుమారు మూడున్నర దశాబ్దాలుగా ఆ పాట ఆత్రేయ పేరుతో చలామణీలో ఉంది. అయితే ఆ పాట పూర్తిగా ఆత్రేయ రచన కాదు. మరి మిగిలింది ఎవరు రాశారు? అనేగా మీ సందేహం. ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
మరో చరిత్ర బాలచందర్ నేరుగా తెలుగులో తీసిన చిత్రం. ఆయన మిగిలిన చిత్రాలన్నీ బైలింగ్వల్స్. సాధారణంగా తమిళంలో కణ్ణదాసన్ తో రాయించుకోవడం బాలచందర్ అలవాటు. ఆ సినిమాలను తెలుగు చేసేప్పుడు ఆత్రేయ నేరుగా కణ్ణదాసన్ ఏం రాశారో చూసి అదే ధోరణిలో కొనసాగిపోయేవారు.
మరో చరిత్ర కు ఆ సౌలభ్యం లేదు. అన్ని పాటలూ ఆయనే రాశారు. అయితే “భలే భలే మగాడివోయ్ “పాట దగ్గర ఓ సమస్య ఎదురైంది. బాలచందర్ ఈ పాటను తెలుగు, ఇంగ్లీషుల్లో నడపాలనుకున్నారు.
ఆత్రేయ తెలుగు రాస్తాను. ఇంగ్లీషు పోయిట్రీ నాతో కాదనేశారు. బాలచందర్ ఓకే మీరు తెలుగు రాసేయండనేశారు. ఈ పాటలో హీరోయిన్ తెలుగు పాడుతుంది. హీరో ఇంగ్లీషు పాడతాడు.కమిట్ అయిన మేరకు ఆత్రేయ హీరోయిన్ పాడే సాహిత్యం లో పల్లవి రడీ చేశారు.
“భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్”…భలే ఉందే అనుకున్నారు బాలచందర్. ఇప్పుడు హీరో పాడాల్సిన ఇంగ్లీష్ సాహిత్యం ఎవరితో రాయించాలనే సమస్య ఎదురయ్యింది. అప్పుడు తట్టిన పేరు రాండార్ గై.
ఎవరీ రాండార్ గై….ఆయనో జర్నలిస్టు. హిందూ పత్రికలో సినిమాల మీద పరిశోధనాత్మక కథనాలు రాసేవారు. బ్లాస్ట్ ఫ్రం ద ఫాస్ట్ అంటూ ఆయన రాసిన పరిశోధనాత్మక కథనాలు సంచలనం రేపాయి. హిందూలోనే కాదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ , స్క్రీన్ పత్రికల్లోనూ గై వ్యాసాలు అచ్చయ్యేవి.రాండార్ గై ని అప్రోచ్ అయ్యారు బాలచందర్.
ఆత్రేయ కు ధీటుగా ఇంగ్లీష్ పోయిట్రీ రాయమని కోరారు. ఆయన సరే అన్నారు.” ఐ డోంట్ నో వాట్ యుసే బట్ ఐ హావ్ సోమచ్ టు సే”… అన్నారు. తెలియంది ఒక భాషే దట్స్ లౌ లాంగ్వేజ్ ఐ సే అంటూ ఆత్రేయ, రాండార్ గై ఇద్దరూ కలసి చరణాలు కంప్లీట్ చేశారు.
రాండార్ గై అనేది ఆయన కలం పేరు. అసలు పేరు మాడభూషి రంగదొరై.విద్యా పరంగా న్యాయవాది. ప్రవృత్తి రీత్యా జర్నలిస్టు, కళాకారుడు.మద్రాసు యూనివర్సిటీ నుంచీ న్యాయవాద పట్టా తీసుకున్న రాండార్ గై కొద్ది కాలం మాత్రమే ప్రాక్టీసు చేశారు. 1976లో ఇక రచనా రంగానికే అంకితం అవ్వాలని నిర్ణయించారు.
అమెరికన్ ఫిల్మ్ డైరక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫ్రాంక్ రస్సెల్ కాప్రా మీద గై రాసిన వ్యాసాన్ని యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్ మేషన్ సెంటర్ కొనుగోలు చేయడం విశేషం. అది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. సముద్ర పత్రిక వారు ఆయనకు జ్ఞాన సముద్ర పురస్కారం ఇచ్చి గౌరవించారు.
బి.ఎన్.రెడ్డి మోనోగ్రాఫ్ కూడా రాశారు. తమిళ సినిమా చరిత్ర కు సంబంధించి మాత్రమే కాదు…ప్రపంచ సినిమా చరిత్ర కు సంబంధించి సాదికారమైన సమాచారం రాండార్ దగ్గర లభ్యం అవుతుంది. భలే భలే మగాడివోయ్ పాట మాత్రమే కాదు… ఆ తర్వాత కూడా బాలచందర్ సినిమాల్లో అడపాదడపా వినిపించిన ఆంగ్ల గీత ఖండికల రచనలో రాండార్ గై పాత్ర ఉంది.
విచిత్రంగా ఆయా పాటల తెలుగు అనువాదాలు ఆత్రేయే చేయడం విశేషం. అంటే తమిళ సాహిత్యం వరకే ఆత్రేయ తెలుగు చేసేవారు. రాండార్ గై ఆంగ్ల సాహిత్యం రెండు చోట్లా ఒకటే ఉండేది. భారతదేశంలోనే తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఇంగ్లీషులోకి డబ్ చేసి విడుదల చేశారు. డబ్బింగు డైలాగులు రాండార్ గైనే రాశారు. సినిమా పేరు ట్రెజర్ హంట్.