ఫ్లాప్ సినిమా లేని హీరో ఉన్నారా ?

Sharing is Caring...

Flops and hits…………………..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే హిట్ అవుతుంటాయి. ఇంకొన్ని సూపర్ హిట్ అవుతాయి. మరి కొన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తాయి. ఆమధ్య కరోనా కారణంగా థియేటర్లకు జనాలు రాలేదు కానీ అంతకు ముందు జనాలు సినిమాలు బాగానే చూసేవారు.

కొంచెం బాగున్నా ఆదరించేవారు. అసలు ఏమాత్రం బాగాలేని సినిమాలు ఫ్లాప్‌ అయ్యేవి. సినిమాలు ఎవరు తీసిన హిట్ అవ్వాలనే లక్ష్యంతోనే తీస్తారు. అయితే ఒక్కోసారి పెద్ద హీరోలు నటించిన  .. పేరు గాంచిన ప్రఖ్యాత దర్శకులు తీసిన సినిమాలు కూడా అంచనాలు అందుకోలేవు. కొన్ని యావరేజ్ గా ఆడతాయి. కొన్ని సినిమాలు మరీ ఘోరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిలపడతాయి.

ప్లాప్ సినిమాల్లో నటించిన హీరోల జాబితాలో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ ,శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు ల నుంచి  ఇప్పటి తరం హీరోల వరకు ఎందరో ఉన్నారు. సినిమా విజయాల కోసం కష్టపడే హీరోలు ..దర్శకులు మనకు చాలా మంది ఉన్నారు. వారి ప్రయత్నలోపం లేకపోయినప్పటికీ  కొన్నిసార్లు కొన్ని సినిమాలు విజయం సాధించలేక పోతుంటాయి. ఆసక్తికరమైన కథ .. కథనం లేకపోవడం, నిర్మాణ విలువలు లోపించడం వంటి మరెన్నో కారణాల వల్ల ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో సినిమాలు విఫలమవుతాయి.

ఒకప్పటి అగ్ర హీరో ఎన్టీరామారావు సినిమాల్లో కూడా ప్లాప్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. కాడెద్దులు ఎకరం నేల సినిమా ఒకే రోజు ఆడిందని అంటారు. సింహం నవ్వింది కూడా అట్టర్ ప్లాప్ .. అక్కినేని పరిస్థితి కూడా అంతే .. రాజా రమేష్, రంగేళి రాజా, మహాకవి క్షేత్రయ్య వంటి సినిమాలు ఉన్నాయి. ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున కెరీర్ లో చాలా ప్లాప్స్ చూశారు. కెప్టెన్ నాగార్జున ,అరణ్యకాండ, విజయ్ తదితర సినిమాలున్నాయి.

అలాగే హీరో చిరంజీవి సినిమాల్లో అంజి .. మృగరాజు , బిగ్ బాస్ , స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, లంకేశ్వరుడు వంటివి ప్లాప్ కేటగిరిలోనివే. ఇక కృష్ణ నటించిన చిత్రాల్లో తాళి బొట్టు,గాజుల కృష్ణయ్య, వింత కాపురం లాంటివి ప్లాప్ అయ్యాయి. శోభన్ బాబు నటించిన విజృంభణ,జాకీ వంటి చిత్రాలు ఎన్నో  ప్లాప్ అయ్యాయి. బాలకృష్ణ నటించిన డిస్కో కింగ్, కత్తుల కొండయ్య,గాండీవం కూడా ప్లాప్ అయిన చిత్రాలే. పవన్ కళ్యాణ్ నటించిన  అజ్ఞాత వాసి,పంజా, తీన్మార్, పులి వంటి కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

మహేష్ బాబు బ్రహ్మోత్సవం, ఆగడు, ఖలేజా, అతిది, సైనికుడు వంటి సినిమాలు నిరాదరణ పొందాయి. ప్రభాస్ సినిమాల్లో ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, మున్నా, చక్రం, రాఘవేంద్ర వంటి కొన్ని సినిమాలు  ఫ్లాప్‌గా నిలిచాయి. జూనియర్ ఎన్టీఆర్ రభస, రామయ్య వస్తావయ్యా, దమ్ము, శక్తి, నరసింహుడు, నా అల్లుడు, నాగ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. రామ్ చరణ్ నటించిన తుఫాన్ , ఆరెంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

టాలీవుడ్ లో మరెందరో హీరోలు ఉన్నారు. వారి జాబితాల్లో కూడా హిట్స్ , ప్లాప్స్ ఉన్నాయి. ఆ హీరోల సినిమాలు ప్లాప్ అయినపుడు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేసిన ఉదాహరణలు లేవు. ఇటీవల మోహన్ బాబు నటించిన సినిమా “సన్ అఫ్ ఇండియా” విషయంలో మాత్రం తీవ్ర స్థాయిలో ఆయనను నెటిజన్లు ట్రోల్ చేశారు. మోహన్ బాబు కూడా గతంలో ఎన్నో హిట్స్ ఇచ్చారు. అలాగే కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. పాపం మోహన్ బాబుకి ఇదొక కొత్త అనుభవం. ముందు ముందు ఇతర హీరోలకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయేమో చెప్పలేం.

—KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!