‘ఎన్టీఆర్ ‘ను ఆట పట్టించిన నటి !

Sharing is Caring...

మొదట్లో అతి నాజూకుగా, నవ మన్మథుడు లాగా ఉండే ఎన్టీఆర్ చూస్తూ చూస్తూండగానే లావెక్కడంతో భానుమతి ఆయన్ని ఎదురుగా కాకున్నా, ఆయన లేనప్పుడు ‘ మా బండబ్బాయి ఇంకా దిగలేదా? ‘, ‘ మా మొద్దబ్బాయి ఇంకా రాలేదా? ‘ అనే వారట సరదాగా. ఈ వ్యాఖ్యల గురించి ఎవరెవరో ఎన్టీఆర్ వద్ద అంటే ఆయన నవ్వేసి ఊరుకునేవారట.  అది ఎన్టీఆర్ గొప్ప మనసుకు తార్కాణం.

ఎంతో చనువుంటే తప్ప  చిన్నా పెద్దా అందరినీ ‘మీరు’ అనే సంబోధించేవారాయన. తన సంతానాన్ని, మనవలను కూడా ఎన్టీఆర్ ‘ మీరు’ అనటం కొంత వింతగా అనిపిస్తుంది. కానీ అది ఆయన సంస్కారం. పట్టుదలతో అలవరచుకున్న జీవన విధానం. సాధారణంగానే   స్త్రీల పట్ల గౌరవంగా ఉండే ఎన్టీఆర్ భానుమతి పట్ల మరింత గౌరవభావంతో ఉండేవారు. ‘అగ్గి రాముడు’, ‘మల్లీశ్వరి’,  ‘ తెనాలి రామకృష్ణ’, ‘ తోడు- నీడ’ వంటి పలు విజయవంతమైన చిత్రాలలో భానుమతి ఎన్టీఆర్ ల జంట అభిమానులను అలరించింది.

‘చండీరాణి’, ‘వివాహ బంధం’ వంటి తాను నిర్మించిన చిత్రాలలో ఆమె ఎన్టీఆర్ కి పాత్రలు ఇస్తే, ఎన్టీఆర్ తాను నిర్మించిన ‘తాతమ్మ కల’  చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్ర ఇచ్చారు. ‘ సమ్రాట్ అశోక’ చిత్రంలో కూడా ఆమెను వృద్ధ మాతగా నటింపజేశారు.  

భానుమతిని ఎన్టీఆర్ ప్రత్యక్షంగా గౌరవించటమే కాదు , పరోక్షంగా కూడా ఆమెను గురించి చెబుతూ  ‘ ఆమె కేవలం నటీమణే కాదు ; సంగీత సాహిత్యాలలో విదుషీమణి ‘ అనేవారట గౌరవ భావంతో. భానుమతి మాత్రం ఎన్టీఆర్ పట్ల వృత్తి వైరం కలగలసిన ఈర్ష్యాసూయలు చూపేవారని అంటారు. 

ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి, ముఖ్యమంత్రి అయ్యాక ఇక ఆమె ఎన్టీఆర్ ని తీవ్రంగా దుయ్యబడుతూ పరోక్ష విమర్శలు చేసేవారు. ‘ అసలు ఈ మొద్దబ్బాయికి రాజకీయాలెందుకుట ?’ అని తరచు అందరి ఎదుటా అనేవారట ఆమె.

కరణం మునసబుల వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండే  గ్రామ సహాయకులను  నియమించి, మండల వ్యవస్థ ఏర్పరచి పాలనను వికేంద్రీకరించిన ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా  ప్రజాస్వామ్య వాదులందరి ఆదరాభిమానాలు చూరగొన్నప్పటికీ, ఒక కరణం కుమార్తెగా భానుమతి ఆ సంస్కరణను తీవ్రంగా వ్యతిరేకించారు.

భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య  కరణం గా చేసారని అంటారు. అప్పట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా నిర్మించిన ‘మండలాధీశుడు’ చిత్రంలో స్క్రిప్టు కి మించి వెటకారపు వ్యాఖ్యలు చేసి ఆమె ఎన్టీఆర్ పట్ల, టీడీపీ  ప్రభుత్వం పట్ల తన కసిని తీర్చుకున్నారని అనేవారు.

‘ అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి ‘అనే సుమతీ శతకకారుడు బద్దెన ఇచ్చిన సందేశాన్ని ఒంట పట్టించుకున్న ఎన్టీఆర్  మాత్రం భానుమతి పట్ల ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష వ్యాఖ్యలు చేయకుండా ఆమె పై చివరి వరకూ గౌరవభావంతో ఉండటం చెప్పుకోదగ్గ  విశేషం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకవర్గ సభ్యురాలిగానూ ఆమెను నియమించి గౌరవించటం గొప్ప విషయం.

ఏయన్నార్ తోనూ భానుమతికి ఆత్మీయ అనుబంధం ఉండేది. ‘బాటసారి’, ‘చక్రపాణి’, ‘ తెనాలి రామకృష్ణ’,  ‘గృహలక్ష్మి’, ‘ అంతస్తులు’ వంటి వారిరువురూ కలిసి నటించిన చిత్రాలలో వారి నటనను మనం ఎలా మరచిపోతాం ? ఇక విషయానికొస్తే ఓ సారి ‘  మీరు బ్రదర్ ని తరచుగా బండబ్బాయి, బండ రాముడు అంటున్నారు. మీరు మాత్రం తక్కువ లావున్నారా? ‘ అని చమత్కరించారట ఏయన్నార్. దానికామె విసురుగా. 

“అడపాదడపా తప్ప నాకేమీ పాత్రలు రావటం లేదు. చెయ్యాలన్న ఉత్సాహం కూడా తగ్గిపోతోంది. నేనెంత లావున్నా ఇబ్బందిలేదు. నాకు తగ్గ పాత్రలు వచ్చినప్పుడే చేస్తా. మీరేమో ఆరోగ్యం సహకరించకున్నా ఎలాగోలా వైద్యచికిత్సలతో నెట్టుకొస్తున్నారు. ఎన్టీఆర్ కి చెయ్యాలే గానీ ఎప్పుడూ చేతినిండా సినిమాలుంటాయి.

దేవుడిచ్చిన చక్కని రూపానికి తోడు బంగారం లాంటి ఆరోగ్యం ఆయనది. జిహ్వాచాపల్యంతో అవీ ఇవీ తిని చేజేతులా ఆరోగ్యం పాడుచేసుకోవద్దనే బ్రదర్ కి నా సూచన. నేనేమన్నా మా బండబ్బాయి ఏమీ అనుకోడులే. ఆయన మంచికోరే నా విమర్శలు ” అన్నారట.టీడీపీ ఆవిర్భావ దశలో ఒకసారి ఎన్టీఆర్ తెనాలిలో  ఉదయపు అల్పాహారంగా పాతిక నేతిగారెలు చికెన్ కూర తో లాగించారట. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!