Travel literature …………………….
తెలుగులో యాత్రా సాహిత్యానికి తొలి అడుగు వేసిన రచన ‘ఏనుగుల వీరాస్వామయ్య..కాశీ యాత్ర చరిత్ర’. వీరాస్వామయ్య ఒకనాటి చెన్నపట్టణం (ఈనాటి చెన్నై) లో ఉన్న కోర్టులో ఇంటర్ ప్రిటర్ గా పనిచేశారు. వీరాస్వామయ్య తెలుగు తమిళ ఆంగ్ల భాషల్లో దిట్ట.తొలుత ఆయన ట్రేడ్ బోర్డు లో వాలంటీర్ గా పనిచేశారు. తర్వాత తిరునల్వేలి జిల్లా కలక్టరేట్ లో అనువాదకుడిగా చేశారు.వీరా స్వామి తెలుగువారే .. వారి పూర్వీకులు ఒంగోలు ప్రాంతీయులు.
అది 1830-31 నాటి కాలం. అప్పట్లో వీరాస్వామయ్య సకుటుంబ,సపరివార సమేతంగా సుమారు (నూరు మంది తో) కాశీ యాత్ర చేశారు. రోడ్లు,రైళ్లు లేని కాలంలో ఆయన పల్లకీలో ఈ యాత్ర చేశారు.మద్రాస్, తిరుపతి, కడప,కర్నూల్,హైదరాబాద్, నాగపూర్,అలహాబాద్ మీదుగా కాశీ చేరుకున్నారు.తిరుగు ప్రయాణంలో గయ,భువనేశ్వర్, విశాఖపట్నం,నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట చెన్నపట్టణం చేరుకున్నారు.
ఈ యాత్ర సందర్భంగా వీరాస్వామయ్య తాను చూసిన నగరాలు, పట్టణాలు ,పల్లెలు,అక్కడ నివసించే నానాజాతి మనుష్యులు,వారి వృత్తులు, ఆచారాలు తదితర విషయాలు తెల్సుకుని వివరంగా ప్రతిరోజు డైరీ లో రాశారు. వీరాస్వామయ్య తన పదిహేను నెలల యాత్రాకాలంలో ఆనాటి సమాజ స్థితిగతులను నిశితంగా గమనించి ఈ కాశీయాత్ర గురించి రాశారు.
ఆయన తన రాత ప్రతిని బ్రౌన్ కి పంపారుట. కాని ఎందుకనో మరి బ్రౌన్ కి నచ్చలేదు. తర్వాత బ్రౌన్ గారు దాన్నిమద్రాసు ఓరియంటల్ లైబ్రరీకి ఇచ్చేశారని అంటారు. 1836 లో ఏనుగుల వీరాస్వామి చనిపోయాక అతని స్నేహితుడు శ్రీనివాస పిళ్ళై ఈ కాశీయాత్రని 1838 లో ముద్రించారు. వీరాస్వామి రచించిన ఆ పుస్తకం లోని తెలుగు ఈ తరం వారికి అర్థమవ్వాలంటే తిరగరాయడం తప్ప మరో మార్గం లేదు.
పుస్తకం మొత్తం చదివిన మాచవరపు ఆదినారాయణ ఏనుగుల వీరాస్వామి రాత ప్రతిని దగ్గర పెట్టుకుని తనే స్వయంగా సరళమైన భాషలో తిరిగి రాశారు. ఈయన ఈ యాత్రా విశేషాలను పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించి, ఒక్కో అధ్యాయానికి పేరు పెట్టి, మ్యాపులను, బొమ్మలను చేర్చి పుస్తకానికి ఒక కొత్త రూపు తెచ్చారు.
ఇక్కడ మాచవరపు ఆదినారాయణ గారి గురించి ఓ రెండు మాటలు చెప్పుకోవాలి. ఈ ఆదినారాయణ సామాన్యులు కాదు. ఆరు ఖండాల్లో పద్నాలుగు దేశాల్లో పాదయాత్రలు చేసిన అనుభవం ఆయనది. ఆయన పూనుకోని ‘ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర’ ని తిరగ రాసిన కారణంగా ఈ పుస్తకం అపూర్వమైన యాత్రా గ్రంథంగా మారింది.
ఈ పుస్తకాన్నితిరగ రాస్తున్నప్పుడు వీరాస్వామి గారే స్వయం గా చెప్పిన అనుభూతిని ఫీల్ అయ్యారు.ఒక రాయసగాడిగా మారిపోయారు. మూల ప్రతిని అనుసరిస్తూ పుస్తకాన్ని కొత్తగా రాశారు. అంతే కాకుండా వీరాస్వామయ్య జీవిత చరిత్రను కూడా చేర్చానని ముందు మాటలో ఆదినారాయణ వివరించారు.
ఏ మౌలిక సదుపాయాలూ లేని ఆ రోజుల్లో తన పరివారంతో 15 నెలలు యాత్ర చేయడం అంటే మాటలు కాదు. దారిపొడుగునా వసతి, వంటలు అబ్బో చాలా కష్టమైన విషయం. అందులోను తాను చూసిన .. తెల్సుకున్న విషయాలను ఎప్పటి కప్పుడు గ్రంధస్తం చేయడం కూడా సులభం కాదు.
ఆయన శ్రమను ఆదినారాయణ ప్రపంచానికి తెలియ చేసేందుకు పుస్తకాన్నిగొప్పగా తీర్చిదిద్దారు. సుమారు రెండువందల ఏళ్ళ క్రితం సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి .. తెలుసుకోవడానికి ఈ తొలి యాత్ర సాహిత్య పుస్తకం చదవాల్సిందే.
2018 లో ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో లాంఛనంగా ఆవిష్కరించారు. నాటి కార్యక్రమంలో ఈ వ్యాస రచయిత కూడా పాల్గొన్నారు.
ఈ పుస్తకాలు Emesco .. vijayawada లో ఉన్నాయ్. ఆసక్తి గలవారు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు.
————-KNMURTHY