Different kinds of hells ……………………….
ఇంతకు ముందు రౌరవాది నరకాల గురించి తెలుసుకున్నాం. గరుడ పురాణం ప్రకారం అవి కాకుండా మరి కొన్ని నరకాలు ఉన్నాయి. అవేమిటో ? ఎలా ఉంటాయో చూద్దాం ..
తమసావృత నరకం నుండి నికృంతన మను పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాటి చక్రాలుంటాయి. నిజానికవి దర్జీ చక్రాలు. వాటి క్రింద సూదులుంటాయి. చక్రం కదలగానే అవి పాపి కాలి నుండి శిరస్సు దాకా ప్రయాణిస్తాయి.
యమదూతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతారు. అవి అలా తిరుగుతూనే ఉంటాయి. పాపి శరీరం అరికాలి నుండి శిరస్సు దాకా పోయి తల నుంచి పైకి వచ్చి మరల అదే అరికాలిలో మరొక కన్నం చేసుకొని ప్రవేశించే పొడవాటి సూదులతో కుట్టబడుతూనే ఉంటుంది.
అప్రతిష్ఠ మను పేరు గల ఇంకో నరకముంది. అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలననుభవిస్తారు. వీరు దారుణ దుఃఖం పాలగుటకు కారణం ఇక్కడ చక్రం ఉంటుంది.గిలక సహాయంతో అది తిరుగుతూ ఉంటుంది..పాపులను ఈ చక్రంపై కట్టి పడేస్తారు. ఆ చక్రం తిరిగినపుడల్లా పై నుండి పదునైన బల్లేలు అసంఖ్యాకంగా వచ్చి గుచ్చుకుంటూ వుంటాయి. ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతుంటుంది. పాపుల అన్ని రంధ్రాల నుండీ రక్తం కారుతూనే వుంటుంది.
అసిపత్రవనమనే పేరు గల వేరొక నరకం ఉంది. ఇదొక వేయి యోజనాల మేర పఱచుకొని ఉంటుంది. ఇక్కడి నేల నిరంతరం అగ్నిజ్వాలల్లో మండుతూ ఉంటుంది. ఈ భయంకర నరకంలో పదునాల్గురు సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్నికాలుస్తుంటారు. అక్కడి పాపులు నిత్యం హాహాకారాలు చేస్తూ తగలబడుతుంటారు. కాని శరీరాలూ అలాగే వుంటాయి.
ఒంటి మంటలూ అలాగే ఉంటాయి. ఈ నరకంలోనే నాలుగవ భాగంలో ” శీత స్నిగ్ధపత్ర” మనే వనం ఉంది. ఇక్కడ పండ్లూ ఆకులూ నేలపై కుప్పలుగా పడి వుంటాయి కాని అక్కడే ఘోర మాంసాహారులూ పులుల కన్న శక్తి వంతమగు వేటకుక్కలు కూడా ఉంటాయి. వాటి మొహాలు మరీ పెద్దవిగానూ వాటిలోనూ దంతాలు పరమ బలిష్టంగానూ పారల వలె పైకి …..గునపాల వలె క్రిందికీ వుంటాయి.
చల్లగా నీడలు పఱచుకొని వున్న ఆ వనాన్ని చూసి ఆకలీ దాహమూ తీర్చుకుందామనే ఆత్రంతో పాపులు అటు వైపు వెళతారు కానీ అక్కడ అతి శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటాయి. ఇవి ఇలా వుండగా అగ్గిలో పడి బొబ్బలెక్కిన వారి కాయాలపై పైనుండి ఆకులు రాలి పడతాయి. అవి మామూలు ఆకులు కావు. చురకత్తులు. అవి ఏటవాలుగా పడి శరీరాన్ని ముక్కలు చేసి వేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేటకుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి వారిని ముక్కలు ముక్కలుగా కొరికి తింటాయి. వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు.
తప్త కుంభ మని మరొక నరకముంది. ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బానలుంటాయి. వీటిలో నూనె, ఇనుప రజను వుండి వీటి కింద పెద్ద పొయ్యిలలో బ్రహ్మాండమైన అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. ఒక్కొక్క బానలో పది మంది మనుషులు సులువుగా పట్టే వీలుంటుంది. యమభటులు పాపులను అందులో పడవేస్తారు. పదునునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడ పొడుస్తూ వేయిస్తుంటారు.
ఈ లోగా గునపాల వంటి ముక్కులున్న గ్రద్దలు, మానవులు సరదాగా చేపలు పట్టినట్లు, ఈ బానలలోకి ముక్కులను పెట్టి పాపుల మాంసమును ముక్కుతో పట్టి లాగుతుంటాయి. యమదూతలు వేపుడు కూరను మాడ్చి పారేసినట్లు ఈ పాపులను ఆ బానల్లో అలా వేయిస్తూనే వుంటారు. ఇదీ తప్తకుంభ నరకం.
ఇప్పటిదాకా వర్ణింపబడిన ఏడూ ప్రధాన నరకాలు. ఇవి కాక మరి కొన్ని నరకాలున్నాయి. రోధ, సూకర,తాల, తప్త లౌహ , మహాజ్వాల, శబల,విమోహన, క్రిమిభక్ష ,లాలా భక్ష, విషంజన, అధః శిర ,పూయవహ, రుధిరాంధ, వింబుజ, వైతరణి, మూత్ర సంజ్ఞక ,, అగ్నిజ్వాల, సందంశ, అభోజన వంటి చాలా నరకాలు ఉన్నాయి. పాపులందరూ ఒకే నరకానికి వెళ్లరు. చేసిన పాపాలను బట్టి వివిధ నరకాలకు వెళతారు. అదండీ నరకాల కథ.