Goverdhan Gande………………………………….
Millions do not have access to food…….సుమారు 800 కోట్ల జనాభా. అపారమైన సాగు భూములు. ఎన్నో జీవ నదులు. సమృద్ధిగా ఆహార ఉత్పత్తులు.అపారమైన సహజ వనరులు. ఆకాశాన్ని సైతం చుంబించే శాస్త్ర ప్రగతి. ఫలితంగా భూ మండలం సకల సంపదల నిలయం.కానీ రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. 40 శాతం జనం అన్నార్తులు. అనేక ఆకలి చావులు. కోట్లాది మంది రోగ పీడితులు. ఈ విషయాలన్నీ ప్రపంచ దేశాల నాయకులకు తెలుసు.కాని పరిష్కరించే ప్రయత్నం చేయరు. కాదు చేయనివ్వరు పారిశ్రామిక వేత్తలు.ఎందుకంటే వారి జేబులు నింపుకునే విధానాలే వారికి కావాలి.
ఆ విధానాలను అనుసరించే నాయకత్వాల కే మద్దతు ఇస్తారు.అందుకు భిన్నమైన ప్రజానుకూల విధానాలను అనుసరిద్దామ నుకునే వారిని అధికారంలోకి రానివ్వరు.ఒక వేళ వచ్చినా వారి ప్రభుత్వాలను కూల్చివేయగల శక్తి సంపన్నులైన పారిశ్రామికవేత్తలకుంది.ఈ పారిశ్రామిక వేత్తలు,బహుళ జాతి కంపెనీలు దేశాల ఆర్థిక విధానాలను నిర్దేశిస్తారు.నిర్ణయిస్తారు. అందుకే అన్నీ ఉన్నా అన్నార్తులుoటారు.ఆకలి చావులూ ఉoటాయి. అసలు ఆహరం ఉంటే కదా ? భద్రత గురించి ఆలోచించేది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారమే సుమారు 26 కోట్ల మంది తిండిలేక ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మడగాస్కర్, కామెరూన్, సోమాలియా దక్షిణ సూడాన్, కాంగో, సిరియా,యెమెన్ వంటి 37 దేశాల్లో ఆహార కొరత .. ఆకలి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. మనదేశంలో కూడా ఆకలి చావులు తక్కువేమి కాదు. ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించాలని రాజ్యాంగం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం పేదవారు ఎక్కడ ఉన్న రేషన్ అందాలన్న సంకల్పంతో ఒక విధానాన్ని రూపొందించింది. అయినప్పటికీ అందరికి నిత్యావసరాలు చేరడం లేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ , మిడ్ డే మీల్, ఉపాధి హామీ పథకాల్లో లోపాలను సరి చేయాలి.
అపుడే కొంత మంది కైనా ఆహారం అందుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలి. కరోనా నేపథ్యంలో పేదలు, కార్మికులు ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారు. విపత్కర సమయాల్లో అయినా వారికి ఆహరం అందేలా చూడాలి. ఇక ఈ ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 లో మొదలు పెట్టింది. తినే తిండి వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచడం తద్వారా మానవ ఆరోగ్యానికి,ఆహార భద్రతకు, ఆర్ధిక అభివృద్ధికి,వ్యవసాయానికి సాయపడటం ఈ ఆహార భద్రత కార్యక్రమ లక్ష్యం. ఆహార భద్రత పేరుతో నిర్వహించే సదస్సుల్లో పేదరిక నిర్మూలనకు.. ఆకలి చావుల అంతానికి కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలి.అపుడే లక్ష్యం సిద్ధిస్తుంది.