Sivaramakrishna …………………………..
ఆత్మానుభూతి అంటే క్లుప్తంగా చెప్పాలంటే అంతరంగంలో పరమాత్మ దర్శనమే ఆత్మానుభూతి అని చెప్పుకోవాలి. అనుభవం, అనుభూతి రెండూ ఒకటే. భగవాన్ రమణమహర్షి ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకోమని అంటారు . అలా నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు.. ‘నేను ఆత్మను’ అనే సమాధానం దొరుకుతుంది.
ఆత్మ అన్నా జీవుడన్నా ఒక్కటే. ‘నేను’ అని తలపింపజేసేది ఆత్మే. ‘నేను’ ఫలానా అని చెప్పేది ఆత్మే.
మనకు తెలియకుండానే మనం ఆత్మ నుండి ప్రవర్తిస్తాం. కానీ దేహభ్రాంతిలో ఉంటాం. ఆత్మలు అనేకం. అణువంత ఆత్మలో ఆకాశమంత పరమాత్మ ఉంటాడు. పరమాత్మ కంటే సూక్ష్మమైన, వ్యాపకమైన తత్వం మరొకటి లేదు.
జీవాత్మలో అంతర్యామి .. అన్ని ఆత్మల్లోనూ ఉంటాడు. విశ్వమంతా ఉంటాడు. జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి? అప్పటిదాకా తెలియని విషయమేదైనా తెలుసుకుంటే అది జ్ఞానం. తెలియనంత వరకూ అదే అజ్ఞానం. అది ఆ ఒక్క విషయానికి సంబంధించినంత వరకే.ఆత్మ విషయంలోనూ అంతే. ‘నేను ఆత్మను’ అని తెలుసుకోగలిగితే ఆత్మ విషయంగా అది జ్ఞానం. తెలుసుకోవాలన్న శ్రద్ధ ముఖ్యం. తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండటమే జ్ఞానోదయం .
అద్భుతమైన సృష్టి అంతా ఒక మహాకావ్యం. అందులో రకరకాల ఛందస్సులు ఉంటాయి. దృష్టి కందని తత్వం ఉంది. ఎల్లలు లేని ఆనందంలో సాగిన రచన అది. దాని కర్త పరమాత్మ. వినగలిగే చెవులుంటే మధుర గీతాలను, మనోజ్ఞమైన సంగీతాన్ని విన వచ్చు.
ఋషులు విన్న సృష్టి రహస్యాలను వేదాలుగా వెల్లడించారు. విశ్వమంతా నిండియున్నది చైతన్యమే. సర్వేశ్వరుడే సర్వజ్ఞుడు. అల్పజ్ఞులమైన మానవులం ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందిన వాళ్లంతా జ్ఞానులని చెప్పలేం. ఆత్మజ్ఞానమే తానైనవాడు జ్ఞాని. అనంతమైన తత్వంతో పాటు ఉంటూ అద్భుతమైన, కుశలమైన వాడుగా ఉంటాడు. ఆత్మనెరిగిన వారే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఉపనిషత్తులు బోధించే సత్యమిది.
ఆత్మసాక్షాత్కారం అంటే పరమాత్మ సాక్షాత్కారమే. భగవంతుడు మన భౌతిక నేత్రాలకు కనిపించడు. సాక్షాత్కారం ఒక అనుభూతి. ఆత్మానుభూతి. తమ సాధన ద్వారా ఇట్టి అనుభూతిని పొందిన వారే యోగులు. ఆధ్యాత్మికత వేరు, జీవితం వేరు అనుకుంటాం. ఆధ్యాత్మికతతో కలిసి ఉన్నదే జీవితం. చైతన్యం ఉంటేనే శరీరం. చైతన్యం ఆత్మ. దేహం లేకుండా జీవుడు ఏమీ సాధించలేడు. సుఖదుఃఖాలను దేహం మూలంగానే అనుభవిస్తున్నాడు.
కాబట్టి ప్రాపంచిక వ్యవహారాల్లో ఉంటూనే జీవితాన్ని ఆధ్యాత్మికతతో మేళవించి పారలౌకిక చింతనతో యోగమార్గాన్ని అనుసరించడం మంచిది.