నంబర్ ఒన్ హీరోల పర్మినెంట్ ప్రొడ్యూసర్ !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………………………

నందమూరి తారక రామారావు తన వారు అనుకున్న వారిని ఆదుకోడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు.ఎందరినో నిర్మాతల్ని చేసి దారి చూపించినవారు. ఎన్నో బ్యానర్లు ఆయన చేతుల మీదుగా ప్రారంభమై సంచలన చిత్ర నిర్మాణ సంస్ధలుగా పాపులార్టీ సంపాదించుకున్నాయి.

అలాంటి వాటిలో దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ కూడా  ఒకటి. విజయవాడకు చెందిన దేవీవరప్రసాద్ వారసత్వంగా చలన చిత్ర నిర్మాణరంగంలోకి వచ్చారు. ఆయన తండ్రి క‌న‌క‌మేడ‌ల తిరుపతయ్యగారు ఎన్.టి.ఆర్ కు సన్నిహిత మిత్రుడు.ఆయ‌న‌తో క‌ల్సి నేష‌న‌ల్ ఆర్ట్ థియేట‌ర్స్ బ్యాన‌ర్ లో నాట‌కాలూ ఆడారు. ప్రధానంగా వ్యవసాయం చూసుకునే తిరపతయ్యగారిని సినిమా రంగంలోకి తీసుకువచ్చింది ఎన్.టి.ఆరే.

ఎన్.ఎ.టి బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రం పిచ్చిపుల్లయ్యతో పంపిణీ రంగంలోకి ప్రవేశించిన తిరపతయ్యగారు …ఆ తర్వాత నిర్మాతగా మారి అన్నగారితోనే సినిమాలు తీశారు.బెజ‌వాడ‌లో ఎన్టీఆర్ కంపెనీ పేరైన నేష‌న‌ల్ ఆర్ట్ థియేట‌ర్స్ పేరుతోనే ఓ డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీసు పెట్టి  పిచ్చిపుల్లయ్య, తోడు దొంగలు, జయసింహ లాంటి సినిమాల పంపిణీ వ్యవహారాలు చూసిన తిరుపతయ్యగారు…నెమ్మదిగా నిర్మాణరంగంలోకి కాలు పెట్టారు.

అట్లూరి పుండరీకాక్షయ్యతో కల్సి తారకరామా ఫిలింస్ బ్యానర్ మీద నందమూరి తారక రామారావు హీరోగా శ్రీ కృష్ణావతారం తీశారు.పౌరాణిక బ్రహ్మ అనిపించుకున్న దర్శకుడు కమలాకర కామేశ్వర్రావు డైరక్ట్ చేసిన ఈ సినిమా బానే ఆడి …  నిర్మాతగా తిరపతయ్యగారికి ఉత్సాహాన్నిచ్చింది.ఈ సినిమాలో నంద‌మూరి హ‌రికృష్ణ చిన్ని కృష్ణుడుగా న‌టించారు.  శ్రీ కృష్ణావతారం రిలీజైన మూడో రోజునే సివియర్ హార్ట్ ఎటాక్ రావడంతో తిరపతయ్యగారు కన్నుమూశారు. అప్పటికే ఎన్.టి.ఆర్ తో ఓ సోషల్ పిక్చర్ చేయాలని నిర్ణయం అయిపోయింది.

తిరుపతయ్యగారు చనిపోయిన తర్వాత ఎన్.టి.ఆర్ కబురు చేసి అప్పటికి ఇంజనీరింగ్ చేస్తున్న దేవీవర ప్రసాద్ ను పిలిపించి మరీ సినిమా చేయమన్నారు. అలా దేవీవరప్రసాద్ నిర్మాతగా పుండరీకాక్షయ్య తో కలసి చేసిన తారకరామా ఫిలింస్ రెండో చిత్రం భలే తమ్ముడు. భలే తమ్ముడు చైనా టౌన్ అనే బాలీవుడ్ మూవీకి రీమేక్. దాదాపు ఇదే స్టోరీ లైన్ తో ఆ తర్వాత అమితాబ్ డాన్ వచ్చింది.

ఇద్దరు అన్నదమ్ములు తప్పిపోతారు.ఒకడు దొంగైతే…మరొకడు సింగర్ అవుతాడు.పోలీసులు దొంగ ప్లేస్ లోకి సింగర్ ను పంపి మొత్తం ముఠా గుట్టు బయటకు లాగడం కథ.ఇందులో పాటలన్నీ సూపర్ హిట్.  మహమ్మద్ రఫీతో తెలుగులో పాడించి కొత్త పద్దతికి నాందిపలికారు.

దేవీ వర ప్రసాద్ చదువు పూర్తయిన తర్వాత మళ్లీ ఎన్.టి.ఆర్ ను కల్సారు. ఒక స్టోరీ తెచ్చుకో.మనం సినిమా చేద్దాం.
ఈ సారి భాగస్వామ్యం కాదు…సోలోగా నువ్వే చేసుకుందువుగాని..నీ లైఫ్ సెట్ అవుతుందని సలహా చెప్పారు. అంతే దాన్నే తారకమంత్రంగా తీసుకుని రంగంలోకి దూకేశారు దేవీవరప్రసాద్.  అలా ఎన్.టి.ఆర్ తో సోలో నిర్మాతగా నాలుగు సినిమాలు తీసేశారు.

మోదుకూరి జాన్సన్ చెప్పిన స్టోరీ లైన్ తీసుకుని కథానాయకుని కథ పేరుతో సినిమా తీశారు. ఈ సినిమాకు దేవీ వ‌ర‌ప్ర‌సాద్ అనుకున్న దర్శకుడు దాసరి నారాయణరావు. నవభారత్ బాబూరావుకు దాసరి తాతామనవడు కథ చెప్తుండగా పక్కనే ఉన్న దేవీవరప్రసాద్ ఇంప్రస్ అయి తన సినిమాకు దాసరే దర్శకుడు అని కన్ఫర్మ్ అయ్యారు.
తీరా ఎన్.టి.ఆర్ కథ విని యోగానంద్ ను డైరక్టర్ గా పెట్టుకోండి అనడంతో ఏమీ మాట్లాడలేక వెనక్కి వచ్చేశారు.

ఆ త‌ర్వాత చాలా కాలానికి దాస‌రితో అమ్మ‌రాజీనామా భాగ‌స్వామ్యంలో తీశారు.  కథానాయకుని కథ లో ఎన్.టి.ఆర్ సినిమా హీరోగా నటించారు.ఆయన నటించిన పాత సినిమా క్లిప్లింగ్స్ తో నడిచిన సినిమా ఆడియన్స్ కు కొత్తగా అనిపించింది. సినిమా ఆడేసింది. దేవీవరప్రసాద్ నిర్మాతగా సెటిలైపోయారు. నిర్మాణమే వృత్తిగా స్వీకరించారు. అయితే అప్పటికి ఎన్.టి.ఆర్ కమిట్ మెంట్స్ చాలా ఉండడంతో కొంతకాలం డబ్బింగ్ సినిమాల మీద కథలాగించేశారు ప్రసాద్.

బాలీవుడ్ హిట్ మూవీ దస్ నంబరీ కథ తో మళ్లీ ఎన్.టి.ఆర్ ను కల్సారు. అదే కె.డి.నంబర్ ఒన్ గా వచ్చింది. మనోజ్ కుమార్ కు ఉన్న క్లాస్ ఇమేజ్ కు దస్ నంబరీ సరిపోయిందని..అడవి రాముడు, యమగోల తర్వాత ఎన్.టి.ఆర్ తో చేయదగ్గ సబ్జక్ట్ కాదని అటు ఎన్.టి.ఆర్ నీ, ఇటు దేవీ వర ప్రసాద్ నీ చాలా మండి డిస్కరేజ్ చేశారు. అయితే డి.వి.నరసరాజు మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నారు.సినిమా డెఫినెట్ హిట్ అవుతుంది. ఎన్.టి.ఆర్ ఇమేజ్ కు తగ్గ కథే అని చెప్పడంతో కె.డి.నంబర్ ఒన్ తెరకెక్కింది. దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ కు మరో విజయాన్ని అందించింది.

కె.డి.నంబర్ ఒన్ తర్వాత దేవీ ప్రసాద్ తీసిన చిత్రం తిరుగులేని మనిషి. ఎన్.టి.ఆర్ , రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో దెబ్బతిన్న సినిమా అదే. కర్ణుడి చావుకు అనేక కారణాలు.  ఆ సినిమా గురించి ఎన్.టి.ఆరే అన్న మాట…ఫ్లాప్ సినిమాకు పోస్ట్ మార్డం అవసరమా?  తిరుగులేని మనిషి స్క్రిప్ట్ దశలోనే ఎన్.టి.ఆర్ చెప్పారు. లైనేదో తేడాగా ఉందయ్యా అని దర్శక నిర్మాతలను హెచ్చరించారు.

సినిమా దెబ్బతిన్న తర్వాత దేవీ వరప్రసాద్ ను పిల్చి…జరిగిందేదో జరిగింది. నువ్వు నిరుత్సాహపడకు….మంచి కథ చూడు సినిమా చేద్దాం అని ధైర్యం చెప్పారు.  అలా తెరకెక్కిన సినిమాయే ఎన్.టి.ఆర్ చివరి చిత్రంగా మారింది. ఆ సినిమా పేరు నాదేశం.  దేవీ వర ప్రసాద్ తిరుగులేని మనిషి దెబ్బతిన్న తర్వాత జాగ్రత్తగా ఆలోచించి ఎన్.టి.ఆర్ తో ఓ భారీ సక్సస్ తీయాలని కథలు తయారు చేస్తున్న టైమ్ లో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది.

ఎన్.టి.ఆర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు అని తెల్సి ఖంగుతిన్నారు. స్ట్రెయిట్ గా వెళ్లి ఎన్.టి.ఆర్ ను కల్సారు. ఖంగారు పడద్దు…నేను మూడు సినిమాలు చేయాల్సి ఉంది. టైమ్ లేదు కనుక ముగ్గురికీ కలిపి ఒకటే సినిమా చేద్దామనుకుంటున్నాను. కథ తెచ్చుకోండన్నారు.. పల్లవి ప్రొడక్షన్స్ వెంకటరత్నం, దేవీ ప్రొడక్షన్స్ దేవీ వరప్రసాద్ లతో పాటు కొత్త నిర్మాత కృష్ణంరాజు. ముగ్గురూ కల్సి కూర్చున్నారు.

కొత్త నిర్మాత తాను వెళ్లిపోతాననడంతో అతని వాటా కొనేసి… పల్లవీ దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్మీద సినిమా అనౌన్స్ చేశారు. దర్శకుడు బాపయ్య. లావారిస్ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. తీరా లావారీస్ కు ఫ్లాప్ టాక్ రావడంతో ఖంగారు పడ్డారు. ఎన్.టి.ఆర్ ఏమంటారో అని భయపడ్డారు. అన్నగారు మాత్రం కూల్ గా లావారిస్ కథకు కొన్ని మార్పులు చెప్పి అలా కంటిన్యూ అవమనడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అందులో రోజులన్ని మారే పాట ఇందిరను ఉద్దేశించి రాయించారని అప్పట్లో చెప్పుకునేవారు.నా దేశం సినిమా డేస్ ప‌రంగా కాదుగానీ వ‌సూళ్ల ప‌రంగా భారీగా రాబ‌ట్టింది.  ఎన్.టి.ఆర్ డైలాగ్స్ కు జనం బాగా రెస్పాండ్ అయ్యారు.

నువ్వు ముప్పై ఐదేళ్ల పాటు నేర్చుకున్న రాజకీయాన్ని నేను మూడు రోజుల్లో అవపోసన పట్టాను అన్న డైలాగ్ మామూలుగా పేలలేదు.  నాదేశం హిట్ కొట్టింది. ఎన్నికల్లో ఎన్.టి.ఆర్ సూపర్ హిట్ కొట్టారు. ముప్పై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. దేవీ ప్రొడక్షన్స్ కు కొత్త హీరోను వెతుక్కోవాల్సిన పరిస్ధితి.

చిరంజీవి బెస్ట్ ఆప్షన్ గా కనిపించాడు. అంతే…ఓ సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చారు దేవీ వర ప్రసాద్. ఇక మీద చిరంజీవితోనే సినిమాలు తీస్తాను అనేశారు. అనడమే కాదు..ఆ మాట మీద నిలబడ్డారు. చట్టం తో పోరాటం, కొండవీటి రాజా, మంచిదొంగ తీశారు. మంచి దొంగ తర్వాత కథల కోసం అన్వేషిస్తున్న దేవీ వర ప్రసాద్ కు విజయశాంతి ఓ అద్భుతమైన ఐడియా ఇచ్చింది.

పి.వాసు డైరక్షన్ లో తమిళ్ లో రజనీకాంత్ సరసన తాను చేస్తున్న మన్నన్ సినిమాను చిరంజీవితో రీమేక్ చేస్తే బాగుంటుందనేది విజయశాంతి ఇచ్చిన అడ్వైజ్. దేవీ ప్రసాద్ ప్రొసీడ్ అయ్యారు. అప్పటికింకా సెట్స్ మీదే ఉన్న మన్నన్ తెలుగు రైట్స్ తీసుకుని ఘరానా మొగుడు స్క్రిప్ట్ తయారు చేశారు.ఒరిజినల్ ను తెలుగు వాతావరణానికి అనుకూలంగా మార్చి తెరకెక్కించిన విధానం అద్భుతం.విజయశాంతి డేట్స్ ప్రాబ్లమ్ రావడంతో గొప్పింటి అల్లుడు తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మాను పెట్టి సినిమా కంప్లీట్ చేశారు దేవీ వర ప్రసాద్.

టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా ఘరానా హిట్ కొట్టింది. ఆ త‌ర్వాత తీసిన అల్లుడా మ‌జాకా బూతాధారిత హాస్య చిత్రంగా పాపుల‌ర్ అయ్యింది.అందులో వేటూరి అత్తో అత్త‌మ్మ కూతురో రాయ‌డం ఓ దారుణం… మిడ్ నైన్టీస్ లో టాలీవుడ్ లో సెకండ్ జనరేషన్ టాప్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో దేవీ వర ప్రసాద్ ఒకరు. అశ్వనీదత్,  అల్లు అరవింద్, దేవీ వర ప్రసాద్, విజయలక్ష్మీ ఫిలింస్ త్రివిక్రమరావు. ఈ నలుగురే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెంచేశారనే ఆరోపణ కూడా ఉండేది. బావగారూ బావున్నారా టైమ్ లో చిరంజీవి చెప్పిన సలహా మేరకు జయంత్ తో సినిమా ప్లాన్ చేశారు దేవీ వర ప్రసాద్.

అయితే ఉన్నట్టుండి  ఘోస్ట్ అండ్ ది డార్క్ నెస్ అనే హాలీవుడ్ మూవీ రీమేక్ చేయాలని నిర్ణయించారు. డైరక్టర్ గా జయంత్ ప్లేస్ లో గుణశేఖర్ వచ్చాడు.  ఆఫ్రికా అడవుల్లో… తీసిన ఈ మూవీ కోలుకోలేని దెబ్బ కొట్టింది. అన్ని హిట్స్ తీసిన నిర్మాత ఒక్క సినిమాతో దిక్కుతోచని స్థితికి వెళ్లిపోవడం దారుణం. అయితే…దాదాపు ఇలాంటి పరిస్ధితే తిరుగులేని మనిషి టైమ్ లో దేవీ వర ప్రసాద్ ఎదుర్కొన్నారు.అయితే ఎన్.టి.ఆర్ పిల్చి మరీ ఓదార్చడంతో పాటు నాదేశం లాంటి సూపర్ హిట్ చేసి పెట్టి పరిస్ధితిని సెట్ రైట్ చేశారు. మృగరాజు తర్వాత అలాంటి సహకారం …ఆత్మ విశ్వాసం నింపే ప్రయత్నం చిరంజీవి నుంచి జరక్కపోవడం బాధించిందనేవారు దేవీ వర ప్రసాద్.

ఎన్.టి.ఆర్ ఫ్యామ్లీతో చాలా దగ్గర సంబంధాలున్న దేవీ వర ప్రసాద్ కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా కనిపిస్తారు. ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ టాప్ హీరోలుగా పోటాపోటీ సినిమాలు తీస్తున్న టైమ్ లో ఇద్దరికీ అత్యంత ఆప్తుడుగా నిల్చిన వ్యక్తి ఆయన. చిరంజీవితోనే సినిమాలు తీస్తానని బహిరంగంగా ప్రకటించి అన్న మాట మీద నిలబడ్డ దేవీ వర ప్రసాద్ ప్రాక్టికల్ గా నందమూరి బాలకృష్ణ డేట్స్ ఇతర ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా చూసేవారు. బాలయ్యతో ఎవరైనా సినిమా తీయాలంటే…దేవీ వర ప్రసాద్ ను ఒప్పించాల్సిన పరిస్ధితి ఉండేది.

తన చెల్లెలి కోసం బాలయ్యతో కోదండరామిరెడ్డి డైరక్షన్ లో భలే దొంగ సినిమా తీసారు దేవీ వర ప్రసాద్. డి.వి.ఎస్ రాజు తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన సంస్దల్లో అనేక కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి దేవీ వర ప్రసాద్. యువచిత్ర మురారి సంపాదకత్వంలో తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర గ్రంధం వెలుగు చూడ్డానికి కారణమైన వ్యక్తుల్లో దేవీ వర ప్రసాద్ ఒకరు. టాలీవుడ్ లో ఇద్దరు నంబర్ ఒన్ హీరోలకు పర్మినెంట్ ప్రొడ్యూసర్ గా ఏ వన్ గ్రేడ్ నిర్మాణ సంస్ధ అధినేతగా ఒక వెలుగు వెలిగిన కనకమేడల దేవీ వర ప్రసాద్  2010 డిసెంబర్ పదో తేదీన కన్నుమూశారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!