Bad time …………………………………
ముఖ్యమంత్రులు గా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఖ్యాతి ఆయనది. ఆ రోజుల్లో వారి పాటలు,నృత్యాలు చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేసేవారు. ముఖ్యమంత్రులు నాటి సినీ స్టార్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లు కాగా వారిచే స్టెప్పులు వేయించింది మరెవరో కాదు డాన్స్ మాష్టారు సలీం. ఈ తరం వారికి అంతగా తెలియని చరిత్ర సలీం ది .
డాన్స్ మాష్టారు సలీం 80 వ దశకంలో చిత్ర పరిశ్రమ ను ఒక ఊపు ఊపేసిన కొరియోగ్రాఫర్ . అప్పట్లో ఆయన డాన్సు అంటే విపరీతమైన క్రేజ్.పెద్ద పెద్ద స్టార్స్ కూడా సలీం ను ప్రిఫర్ చేసేవారు. సలీం కూడా తనకు వచ్చిన అవకాశాలను ఏమాత్రం జారవిడుచుకోకుండా నృత్యాలలో తన ప్రతిభను ప్రదర్శించేవాడు.
అడవిరాముడు లో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అన్నపాటకు ఎన్టీఆర్ జయప్రదలకు నృత్యరీతులు కూర్చింది సలీమే. అలాగే ఊరికి మొనగాడు లో హీరో కృష్ణ జయప్రదల హిట్ సాంగ్ ‘ఇదిగో తెల్లచీర ‘ కు స్టెప్స్ కూర్చింది సలీమే.
హీరో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ఖైదీ లోని ‘రగులుతోంది మొగలి పొద’ కు సలీం కూర్చిన నృత్యభంగిమలు చాలాపాపులర్ అయ్యాయి. ప్రేక్షకుల చేత కూడా థియేటర్లో డాన్సులు వేయించిన ఘనత సలీం దే. సలీం డాన్సులో ఏదో మ్యాజిక్ ఉండేది. మాస్ నాడి పట్టిన కొరియోగ్రాఫర్ సలీం. సలీం డేట్స్ కోసం నిర్మాతలు పోటీ పడేవారు.
సలీం జన్మతః మలయాళీ… అయినా తమిళ,తెలుగు వారిలో కలిసిపోయేవాడు. కేరళ లోని కన్నూరు ప్రాంతానికి చెందిన సలీం నిరుపేద కుటుంబం నుంచి తమిళనాడుకి వలస వచ్చాడు. తొలుత సినిమా వాళ్ళకు డ్రెసెస్ కుట్టే టైలర్ల వద్ద సహాయకుడిగా చేరాడు.
తండ్రి కూడా దర్జీయే కాబట్టి ఆ పని చేయడానికి సలీం సిగ్గుపడలేదు. చోప్రా అనే నృత్య దర్శకుడి కి వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. ఆ తర్వాత ప్రముఖ కొరియో గ్రాఫర్ గోపికృష్ణ వద్ద అసిస్టెంట్ గా చేరాడు. ఆయన వద్దనే నాట్యంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఏదైనా ఒకసారి చూస్తే ఇట్టే పట్టేసే నేర్పరి కావడం తో మెల్లగా నృత్య రీతులపై పట్టు సాధించాడు.
1970 లో తమిళ సినిమా “పెన్ఇన్రాల్పెన్” కి నృత్యదర్శకుడు అయ్యాడు. అప్పటి నుంచి నుంచి వెనుదిరిగి చూడలేదు. తెలుగు పరిశ్రమలోకి ‘నా తమ్ముడు’ చిత్రం తో ప్రవేశించాడు. వెరైటీ మాస్ నృత్య భంగిమలు , డాన్సులు, స్టెప్పులు అతగాడిని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ నిర్మాతలు సలీం నే పిలిపించే వారు.
అప్పటి హీరోలు దిలీప్ కుమార్,శివాజీ గణేశన్,నాగేశ్వరరావు ,కృష్ణ, శోభన్ లతో పనిచేసిన సలీం తర్వాత తరం హీరోలైన చిరు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల తో కూడా పనిచేసాడు. హీరోలను బట్టి , వారి బాడీ కదలికలను బట్టి స్టెప్స్ రూపొందించేవారు. ఆయన దగ్గర అసిస్టెంట్స్ గా చేరిన ఎందరో తర్వాత కాలంలో డాన్స్ మాష్టార్లుగా ఎదిగారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
ఒక దశలో సలీం వేరే సినిమా షూటింగ్ కోసం ఏదైనా లొకేషన్ కి వెళితే … నిర్మాతలు,దర్శకులు హీరోలు .. హీరోయిన్ల తో ఆ లొకేషన్ కే వెళ్లి అక్కడే పాటల చిత్రీకరణ పూర్తి చేసుకునే వారు. అంత బిజీగా సలీం ఉండేవారు. సలీం సుమారు 300 చిత్రాలకు డాన్స్ మాస్టారుగా పని చేశారు. అందులో తెలుగు, తమిళ్ , కన్నడ ,హిందీ సినిమాలున్నాయి.
చిత్రపరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన సలీం ఒక ఘటనతో జైలు పాలయ్యారు. దాంతో అతని జీవితం మారిపోయింది. సలీం కి టీ నగర్ లో షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది. అందులో ఒక షాప్ అతను సరిగ్గా అద్దె చెల్లించకపోవడంతో సలీం తన మనుష్యులను పంపి అతగాడిని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు.
ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో షాప్ అతను మరణించారు. అది కేసు అయింది. ఆ కేసులో సలీం అరెస్ట్ అయ్యారు. మానసికంగా కూడా దెబ్బ తిన్నారు. అరెస్ట్ కావడం … జైలుకెళ్లడం తదితర సంఘటనల నేపథ్యంలో కుటుంబసభ్యులు ఉన్న ఆస్తులు అమ్ముకుని కేరళ వెళ్లిపోయారు.
తర్వాత సలీం గురించి పట్టించుకోలేదని అంటారు. బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు కానీ నిర్మాతలు,హీరోలు పట్టించుకోలేదు. సలీం జైలుకెళ్లిన ఘటనపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
కోట్లు సంపాదించిన సలీం దాన ధర్మాలు ఎక్కువగా చేయడంతో మిగుల్చుకున్నది కూడా పెద్దగా ఏమీలేదు. వృత్తి పట్ల అధిక శ్రద్ధ చూపిన సలీం కుటుంబాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆయన జైలుకి వెళ్ళాక కుటుంబం కూడా దూరమైంది. కొన్నిరోజులు హైదరాబాద్ లో ఉండి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేసాడు.కానీ అవకాశాలు రాలేదు. అతని శిష్యులు కూడా పట్టించుకోలేదు.
చివరి రోజుల్లో చెన్నైలోని ఒక మురికి వాడ లో కొంతకాలం నివసించాడు. అక్కడ నుంచి ఒక కారు షెడ్డులోకి మారాడు. ఆరోగ్యం క్షీణించడం … మానసిక వ్యధ సలీం ను బలి తీసుకున్నాయి. అత్యంత దయనీయ స్థితిలో ఒక స్టార్ కొరియో గ్రాఫర్ అలా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.
చివరికి శవదహనానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలిసి ఇప్పటి హీరోలు సూర్య, కార్తీ ల తండ్రి నటుడు శివకుమార్ ముందుకొచ్చి శవదహన కార్యక్రమాలు చేపట్టారు. అదండీ సలీం విషాద గాధ.
—–KNM