ఆకట్టుకునే క్లాసిక్ మూవీ ‘అకాలే’ !!

Sharing is Caring...

Sai Vamshi …………………..

నటుడు పృథ్విరాజ్ సుకుమారన్‌ని ‘ఆడు జీవితం’లో చూశాం.. ‘సలార్’లో చూశాం. పృథ్విరాజ్ తల్లిదండ్రులిద్దరూ సినిమా నటులే.19 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన పృథ్విరాజ్‌కు ఇప్పుడు 42 ఏళ్లు. 20 ఏళ్ల నుంచి సినిమారంగంలో ఉన్నందువల్ల కాబోలు, పెద్ద వయసు వ్యక్తి అనిపిస్తారు.

2004లో ఆయనకెంత వయసు? 21. కానీ తనకు రెట్టింపు వయసున్న పాత్ర చేసే సాహసం చేశారు. అదీ సినిమా కెరీర్ మొదట్లోనే. ఆ సినిమా పేరు  ‘అకాలే(Akale)’. అంటే ‘దూరతీరంలో’ అని అర్థం. పక్క భాషలో ఫలానా సినిమా చూసి, ‘తెలుగువాళ్లు ఇలాంటి సినిమాలు చేయరెందుకు?’ అంటుంటారు.

వాళ్లకు తెలియని విషయమేంటంటే, ఆ సినిమాలు ఆ భాషలోనే బాగుంటాయి. ఆ భాషలోనే చూడాలి. ఆ భాషలోనే అర్థం చేసుకోవాలి. ‘అకాలే’ మలయాళ క్లాసిక్. ఇప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది. చూస్తున్నంతసేపూ ఏదో మార్మికత కనిపిస్తుంది. సినిమా పూర్తయ్యాక విషాదం వెంటాడుతుంది.

కేరళలో స్థిరపడ్డ ఆంగ్లో-ఇండియన్ కుటుంబం. బిడ్డల మీద విపరీతమైన ప్రేమ కలిగిన తల్లి. రచయిత కావాలన్న తపన ఉన్నా, కుటుంబ పరిస్థితుల కోసం ఓ గోడౌన్‌లో గుమాస్తా పని చేస్తున్న కొడుకు. కాలికున్న లోపం కారణంగా సరిగా నడవలేక, అందమైన గాజుబొమ్మలు తయారు చేస్తూ కాలం వెల్లదీసే కూతురు.

రోజూ సినిమాలకు వెళ్తూ, ప్రేమ నవలలు చదువుతున్న కొడుకు చెడిపోయాడని, అతణ్ని బాగు చేయాలని ఆ తల్లి తపన. రచయిత అవ్వాల్సిన తన కలను ఆ ఇంటి పరిస్థితి కోసం పక్కన పెట్టాల్సి వచ్చిందని కొడుకు అసహనం. వారిద్దరినీ చూస్తూ, ఏమీ అనలేని, ఎలా స్పందించాలో తెలియని కూతురు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. కానీ జీవితమనేది చాలా దుర్మార్గమైనది. అనుకున్నది అనుకున్నట్లు సాగనివ్వదు.

కూతురికి పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి చేయాలి. కాలు సరిగా లేని, పదిమందిలో తిరగడం అలవాటు లేని, పెద్దగా ఎవరితోనూ మాట్లాడని, చలాకీతనం అంతగా లేని కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ విషయం తల్లి మనసులో తిరుగుతూ ఉంది. కానీ మరో పక్క ధైర్యం.

ఏం? కాలికి కాస్తంత లోపం ఉంటే ఏమిటి? తన కూతురికి అందం లేదా, అణకువ లేదా? అసలు ఈ భూమ్మీద లోపం లేనిది ఎవరికి? తన కూతురికి మంచి సంబంధం వస్తుంది. తప్పకుండా పెళ్లి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది.

ఈ విషయం కొడుకుతో మాట్లాడింది. ‘నీ స్నేహితుల్లో ఎవరైనా మంచి వ్యక్తిని చూసి మనింటికి భోజనానికి పిలువు. అతనికి మన పిల్ల నచ్చితే ఆపైన ఇద్దరికీ ముడిపెట్టేయొచ్చు’ అంది.ఆమె కోరినట్టే ఇంటికొచ్చాడో యువకుడు. పేరు ఫ్రెడీ. అతనొస్తున్నాడని ఆ తల్లి హడావిడి పడింది. ఇంటిని, కూతుర్ని రకరకాలుగా తయారు చేసింది. కానీ కూతురికి ఇవేవీ నచ్చడం లేదు. వచ్చిన వ్యక్తి ముందుకొచ్చి మాట్లాడే ఆసక్తి లేదు.

కానీ తల్లి బలవంతంపై తప్పలేదు. కానీ.. కానీ.. ఆమె లోలోపల మథనం. తనలాంటి అమ్మాయిని ప్రేమించేందుకు ఎవరైనా దొరకుతారా? తనను నిజంగా మనసారా ప్రేమిస్తారా? ప్రేమతో తన చెయ్యి పట్టుకుంటారా? ఆమె గదిలోకి వచ్చిన ఫ్రెడీ తన అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు. ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమెతో సరదాగా మాట్లాడాడు. ఆమె ముందు కూర్చుని జోకులు వేశాడు.

ఆమె మనసులోని భయాలు పోగొట్టాడు. కాలి సమస్యతో లేవలేక ఇబ్బంది పడుతున్న ఆమెను లేపి, ఆమె చేత డ్యాన్స్ చేయించాడు. ఇదే.. ఇదే కదా తాను కోరుకుంది అనుకుందా అమ్మాయి. ఇన్నాళ్లుగా తను ఎదురుచూసింది ఈ క్షణాల కోసమేగా అనుకుంది. ఆమె ఆనందానికి తోడుగా బయట వాన కురిసింది. ఆహా! ఎంత బాగుందీ రాత్రి! ఇలా ఈ క్షణం ఆగిపోతే చాలనిపించింది.

ఇంతలో ఫ్రెడీ టైం చూసుకున్నాడు. ‘వెళ్లాలి.. లేటవుతోంది’ అన్నాడు. ఎక్కడికి అని అడిగింది. చెప్పాడు. ఆ మాటతో ఆ అమ్మాయి గుండె బద్దలైంది. బయట హాల్లో కూర్చున్న తల్లి, అన్నలకు ఈ విషయం తెలియదు. తెలిస్తే వాళ్లెలా స్పందిస్తారో? కానీ తెలియక తప్పదు కదా! ఆమె తయారుచేసిన గాజు వస్తువులు ఆమె వంక దీనంగా చూస్తూ ఉన్నాయి.

గుండె గొంతులో వేలాడుతోంది. ఎట్లా? ఎట్లా తట్టుకోవాలి ఈ విషాదం? ఈ అస్పష్ట బంధాల నుంచి ఏ దూరతీరానికి పారిపోవాలి? బాధ.. భరించలేని బాధ, వేదన. ఆ తర్వాత? ఆ కుటుంబం ఏమైంది? ఆ అమ్మాయి జీవితం ఏమైంది? ఆమె తల్లి, అన్న ఏమయ్యారు? అదంతా సినిమాలో చూడాల్సిందే.

Tennessee Williams అనే ప్రఖ్యాత అమెరికన్ రచయిత రాసిన ‘The Glass Menagerie’ నాటకం ఆధారంగా మలయాళ దర్శకుడు శ్యామప్రసాద్ ఈ సినిమా తీశారు. వాట్ ఎ మేకింగ్! ఇట్లా కదా సినిమా తీయాల్సింది అనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క షాట్ కూడా అనవసరం అనిపించదు.

ఇక నటన! నీల్‌గా పృథ్విరాజ్, రోజ్‌మేరీగా గీతూ మోహన్‌దాస్, వారిద్దరి తల్లి మార్గరీటాగా సీనియర్ నటి షీలా.. ముగ్గురూ పోటాపోటీగా నటించారు. టక్కున బయట ఆ ముగ్గుర్నీ చూస్తే వీళ్లు ఒకే కుటుంబం కదా అనిపించేంత గొప్పగా నటించారు. ఇద్దరు పిల్లల తల్లిగా, ఆంగ్లో-ఇండియన్‌గా నటించిన షీలా నటన చూసి తీరాల్సిందే. ఆ సంవత్సరం జాతీయ ఉత్తమ సహాయనటిగా అవార్డు అందుకున్నారు.

మీరు ఈ సినిమా చూడండి. Frustrated  Manగా పృథ్విరాజ్ నటన కోసం చూడండి. Possessive Motherగా షీలా నటన కోసం చూడండి. Introvert and Innocent Girlగా అద్భుతమైన నటన చూపిన గీతూ మోహన్‌దాస్ కోసం చూడండి. ముగ్గురూ ముగ్గురే!

శ్యామప్రసాద్ దర్శకత్వ ప్రతిభ కోసం చూడండి. గొప్ప కథను గొప్పగా తెర మీద చూపించడం ఎలా అని తెలుసుకునేందుకు తప్పకుండా చూడండి. సినిమా యూట్యూబ్‌లో without Subtitlesతో అందుబాటులో ఉంది. Subtitlesతో కావాలంటే ‘SUN NXT’ స్ట్రీమింగ్ యాప్‌లో ప్రయత్నించండి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!