Bhavanarayana Thota………………
రీవైండ్ 2004…..అన్నీ కాకపోయినా, కొన్ని సమస్యలు మీడియా వల్ల పరిష్కారమవుతుంటాయి. ముఖ్యంగా విద్య, వైద్యం విషయాల్లో సాయం అవసరమైనప్పుడు వార్త ప్రసారమైతే స్పందించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే, అలా స్పందించి సాయం చేశాక ఆ ప్రయోజనం పొందిన వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే తీరిక మీడియాకు ఉండదు.
ఎప్పటికప్పుడు కొత్త సంగతుల మీదనే దృష్టి. ఫాలో అప్ కథనాలు అవసరమని మీడియా పాఠాల్లో చెప్పినా పట్టించుకోవటం తక్కువే. ఏమైనా నాకు తటస్థపడిన రెండు సందర్భాలలో ఒక దాని గురించి ఇప్పుడు చెబుదామనుకుంటున్నా.
*****
కరీంనగర్ జిల్లా వేములవాడ దగ్గర జయవరం అనే పల్లెటూరు. అక్కడ ముప్పయ్యేళ్ల యువరైతు రాములు అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ జబ్బుతోనే భార్య సాయంతో ఆఖరినిమిషం దాకా వ్యవసాయం చేయాలనే పట్టుదలతో శ్రమిస్తున్నాడు. రాష్ట్రమంతా రైతుల ఆత్మహత్యల వార్తలతో అట్టుడుకుతున్న సమయమది.
ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదంటూ రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు తేజా టీవీ పదిరోజులపాటు ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. అది చూసి ఆత్మహత్య ఆలోచన మానుకుని మొండిగా వ్యవసాయం చేస్తున్నాడేగాని వళ్ళంతా నీరుపట్టి కదలటానికే ఇబ్బందిపడే పరిస్థితి ఆయనది. ఈ విషయం తెలుసుకున్న మా రిపోర్టర్ శ్రీనివాసరెడ్డి అతని దుస్థితిని కళ్ళకు కడుతూ వార్త పంపారు.
తేజా టీవీలో ప్రసారం చేశాం.అలా ఆ వార్త ప్రసారమైన కొద్ది గంటలకే పోసాని కృష్ణమురళి గారి నుంచి ఫోన్. తనను తాను పరిచయం చేసుకున్నారు. “బ్రదర్, మీ టీవీలో చూపించిన ఆ రైతును వెంటనే హైదరాబాద్ పిలిపించండి. ట్రీట్‍మెంట్ ఇప్పిద్దాం” అన్నారు నేరుగా.
ఆ తరువాత కాసేపటికే నటుడి ఏవీఎస్ తో కలిసి ఆఫీసుకు వచ్చారు. అప్పట్లో బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ గోపీచంద్ (ఇప్పుడు స్టార్ ఆస్పత్రి నిర్వాహకుడు) గారితో మాట్లాడి మరుసటి రోజే పేషెంట్ ని రప్పించమని చెప్పారు. అదే మాట మా రిపోర్టర్ కి చెప్పా. రాములు, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు, బావమరిది నర్సింగ రావు మా రిపోర్టర్ వెంట నేరుగా కేర్ ఆస్పత్రి కి వచ్చారు.
పోసాని గారితో బాటు నటుడు ఏవీఎస్ గారు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గోపీచంద్ గారికి పేషెంట్ ను చూపించి అన్ని టెస్టులూ చేయించారు. జబ్బు బాగా ముదిరిందని, మరుసటి రోజే సర్జరీకి ఏర్పాటు చేద్దామని గోపీచంద్ చెప్పారు. మొత్తానికి సర్జరీ జరిగింది. చాలా క్లిష్టమైన సర్జరీ అని కూడా డాక్టర్ గోపీచంద్ చెప్పారు. ఆస్పత్రి ఛార్జీలు మాత్రమే ఇప్పించి తన ఫీజు తీసుకోకుండా ఆయన కూడా తనవంతు ఔదార్యం చూపారు.
రాములు పూర్తిగా కోలుకునే వరకూ ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి పోసాని గారు కేర్ కి వచ్చేవారు. అలా పదిరోజుల్లో రాములు మామూలు మనిషయ్యాక భార్యాపిల్లలతో సహా అందరికీ కొత్త బట్టలు కొనిచ్చి, దారిఖర్చులు కూడా ఇచ్చి మరీ సాగనంపారు పోసాని.
ఖర్చు మొత్తం రెండు లక్షలదాకా అయింది. ఈ వార్త ప్రసారం చేయటానికి పోసాని ఒప్పుకోలేదు. స్ఫూర్తిమంతంగా ఉంటుందని, ఇంకొంతమంది ఇలాంటి సందర్భాలలో ముందుకొచ్చి సాయం చేస్తారని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. ఆయన కోరిక మన్నించక తప్పలేదు నాకు.
ఇది జరిగి ఆరునెలలు గడిచాయనుకుంటా. నేను వేములవాడ వెళితే ఆ విషయం తెలిసి వాళ్ళ బావమరిది నర్సింగరావు వచ్చి వాళ్ళింటికి తీసుకెళ్ళారు. రాముల్ని చూస్తే అసలు జబ్బున పడ్డ మనిషనిపించలేదు. హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు.
నేను చేసిందేమీ లేకపోయినా అందరూ నా వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఉంటే నాకే ఇబ్బందిగా అనిపించి దిక్కులు చూడటం మొదలెట్టా. ఆ చిన్న ఇంట్లో నా దృష్టినుంచి తప్పించుకోలేకపోయింది…. దేవుళ్ళ బొమ్మల సరసన ఉన్న పోసాని ఫొటో…. అవును మరి. ఆయన నిలబెట్టింది ఒక ప్రాణాన్నే కాదు.. ఒక కుటుంబాన్ని. రాములు కుటుంబానికి నిజంగానే దేవుడాయన..

