వివేక్ లంకమల……………………………… Oh my Tomiris, What a fighting spirit you are
మధ్య ఆసియా అనగానే కనుచూపుమేర విశాలమైన స్టెప్పీ గడ్డి మైదానాలు, వంపులు తిరిగిన నదులు, దూరంగా కొండలు గుర్తుకొస్తాయి నాకు.ఆ గడ్డి మైదానాల నిశ్శబ్ధాన్ని చెదరగొడుతూ దౌడు తీసే గుర్రం, గుర్రం జీనుపై స్వేచ్ఛా ప్రపంచానికి ప్రతీకలా ఒక స్త్రీ. జమీల్యా చేసిన మాయ అది.
ఇప్పుడు కొత్తగా టొమిరిస్ వచ్చి చేరింది. Tomiris స్టెప్పీ గెడ్డి మైదానాల్లో ఒక తెగ నాయకుని కూతురు. పుట్టగానే తల్లి చనిపోతుంది. జీవితంలో చెయ్యాల్సిన అనివార్యపు యుద్ధాన్ని, యుద్ధ విద్యలను నేర్పిస్తూ పెంచుతాడు. టొమిరిస్ కు పదేళ్లైనా నిండకముందే తండ్రిని వేరే తెగ వాళ్లు చంపుతారు. టొమిరిస్ సంరక్షణ బాధ్యతను వేరే వాళ్లకిచ్చి చనిపోతాడు.
యుక్త వయసుకు రాగానే మరొక దాడి. టొమిరిస్ తప్ప అందరూ చంపబడతారు. శతృవులను చంపుతుంది గానీ రక్తమోడుతూ గుర్రం మీద అలాగే పడిపోతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న టొమిరిస్ ను వేరే తెగ వాళ్లను చూసి, నాటు వైద్యం ద్వారా బతికిస్తారు. వాళ్లల్లో ఒకరిగా మారిపోతుంది.
ఆమెది ఒకటే లక్ష్యం.తండ్రిని చంపిన వారిని తెగనరకాలి అని. ఆ తెగ సహాయంతో వాళ్ల గుండెల్లో పిడిబాకు దింపుతుంది. వారి మరణంతో పాటు తండ్రి రాజ్యం వారసత్వంగా వస్తుంది. తెగలో మరొక యోధుడిని పెళ్లి చేసుకుంటుంది. కొడుకు పుడతాడు. వాడిని కూడా తండ్రిలాగా యోధుడిలా పెంచుతుంది.
సంతోషంగా సాగిపోతుండగా ఈజిప్టును జయించడమే లక్ష్యంగా బతుకుతున్న పర్షియా చక్రవర్తి Syrus The Great రాయబారి వచ్చి మైత్రి ప్రస్తావన తెస్తాడు. వద్దు ఇలాగే ఉందామంటుంది టొమిరిస్. భర్త వినడు. కొడుకును తీసుకుని బాబిలోనియా వెళ్తాడు. సైరస్ వాళ్లు మాయోపాయంతో వారిని చంపి, విధవరాలిని భయపెట్టొచ్చు అని రాయబారి ద్వారా టొమిరిస్ కు పంపుతారు.
ఏడవాలి కదా అనుకుంటాం. కానీ టొమిరిస్ ఏడవదు. ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చదు. సైరస్ నిన్ను భార్యగా స్వీకరించాలి అనుకుంటున్నాడు అని చెప్పిన రాయబారి గొంతును స్వజనుల మధ్యన తెగనరికి తన ధిక్కారాన్ని తెలియజేస్తుంది. ఆ ధిక్కారం ప్రపంచాన్ని జయించాలని కలలుకన్న సైరస్ చక్రవర్తికి వ్యతిరేఖంగా కాదు, తమ జాతి ఆత్మగౌరవాన్ని భంగం చేసిన మాయోపాయుడి పైన.
ప్రపంచాన్ని జయించడం తర్వాత ముందు వీళ్లను అరికట్టాలని యుద్ధం మొదలవుతుంది. సైరస్ తో యుద్ధం అంటే మరణం అనే భయంలో ఉన్న స్టెప్పీ మైదానపు తెగలన్నింటికీ ధైర్యం చెప్పి, సమర శంఖం పూరిస్తుంది. Syr Darya నది ఒడ్డున భీకర యుద్ధం జరుగుతుంది.
అంత పెద్ద సైన్యాన్ని తన శక్తి యుక్తులతో.. ధైర్యంతో ఎదుర్కొని తుదముట్టిస్తుంది. ఎంతో పెద్ద సైన్యం కలిగిన సైరస్ ది గ్రేట్, టొమిరిస్ అనే ఒక స్త్రీ ఆత్మ గౌరవం ముందు నేలకొరుగుతాడు.సైరస్ ను చంపావు, పర్షియా సామ్రాజ్యం నీదే కదా అంటే ‘నాకు నా స్టెప్పీ మైదానం చాలు’ అంటూ గుర్రం మీద సాగిపోతుంటుంది.
టొమిరిస్ గా Almira Tursyn నటించారు. ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుంది. సైరస్ ది గ్రేట్ పాత్ర ను Ghassan Massoud పోషించారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ఈ సినిమాను Akan Satayev డైరెక్ట్ చేశారు.
ఈ సినిమా Amazon Prime లో ఉంది. జమీల్యా ఒక స్వేచ్ఛ.. టొమిరిస్ ఒక ఆత్మగౌరవం. రెండూ స్టెప్పీ మైదానపు స్త్రీ ప్రతీకలే. జమీల్యా వల్లనో, ఇప్పుడు టొమిరిస్ వల్లనో స్టెప్పీ మైదానాలను తలుచుకోగానే గత కాలపు వాసనలేవో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి. వచ్చే సంవత్సరమో, తర్వాతనో కిర్గిజ్ స్తాన్, కర్కురేవ్ నది, సిర్ దార్యా నది, స్టెప్పీ మైదానాల్లో తిరిగితే జమీల్యా స్వేచ్ఛ, టొమిరిస్ తాలూకు ఆత్మగౌరవ ప్రతీకలు దొరుకుతాయోమో.