Bharadwaja Rangavajhala ……………………………
దక్షిణ భారత రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేక స్థానం. అనేక రాజ్యాలుగా సంస్థానాలుగా ఉన్న భారతావనిని ఒక్క పాలన కిందకు తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష్ జమానాలో అది ఓ మేరకు సాకారమైంది.
బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నప్పుడూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు తమిళ ప్రజలు. ఈ ప్రత్యేకతను తొలిసారి ప్రపంచానికి చాటింది పెరియార్ రామస్వామి నాయకర్.పెరియార్ ద్రవిడనాట నాస్తిక, ఆత్మగౌరవ, స్త్రీ హక్కుల కోసం పోరాటాన్ని నడిపించినవాడు.
పెరియార్ రామస్వామి 1919లో గాంధేయవాదిగా, కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మద్యపాన నిషేధం, అంటరానితనం నిర్మూలన లాంటి గాంధీ విధానాల పట్ల ఆకర్షితులయ్యారు. తన సతీమణి నాగమ్మాయ్, చెల్లెలు బాలాంబాల్ కూడా రాజకీయాల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు.ఆ ఇద్దరూ కల్లు దుకాణాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించారు.
ఈ రామస్వామి తెలుగువాడే అవడం కాస్త రోమాలు నిక్కబొడుచుకునే వ్యవహారమే గానీ రాయలసీమ ప్రాంతం నుంచీ తమిళనాడుకు వలస వెళ్లిన వెనకబడిన తరగతుల కుటుంబానికి చెందిన వ్యక్తి .పెరియార్ రామస్వామి ఓ సారి కాశీ వెడితే ఆలయ ప్రవేశం లేదన్నారట.
దీంతో ఆయన హిందూ మతం మీద ఆగ్రహించారు. వర్ణ వ్యవస్థను ప్రశ్నించారు.బ్రాహ్మణ ఆధిపత్యం మీద పోరాడాలని చెప్పి అగ్రవర్ణేతరులనందరినీ ఒక చోటకు తెచ్చే ప్రయత్నం చేశారు.పెరియార్ దేశ వ్యాప్తంగా జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అరెస్ట్ అయ్యారు.
తర్వాత కాలంలో కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీ యూనిట్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత ఉత్తరాధి ఆధిపత్యంలోనూ ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్న పార్టీగానూ కాంగ్రెస్ ను విమర్శించి జస్టిస్ పార్టీలో చేరారు.
రాముడు అనే ఉత్తరాది రాజు దక్షిణాదిని ఆక్రమించుకోడానికి ద్రవిడ రాజు రావణుణ్ని హతమార్చడమే కాకుండా ఆ హత్యకు లెజిటమసీ తీసుకురావడానికి రావణుడ్ని రాక్షసుడుగా చూపించే ప్రయత్నమూ చేశారనే ఆరోపణ కూడా పెరియార్ చేసేవారు.
బ్రాహ్మణేతర ఉద్యమం ఊపు మీదున్న రోజుల్లోనే తమిళనాడుకు రాజాజీ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ రోజుల్లోనే హిందీ భాషను బలవంతంగా స్కూళ్లల్లో బోధించాలన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించారు పెరియార్ రామస్వామి.పెరియార్ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చిన వారే అన్నాదురై, కరుణానిధి తదితరులు.
అప్పటికి పెరియార్ జస్టిస్ పార్టీలో ఉన్నారు. తర్వాత రోజుల్లో దాని నుంచీ బయటకు వచ్చి ‘ద్రవిడర్ కళగం’ ను ప్రారంభించారు.ఎన్నికల రాజకీయాలను కాదని’ ద్రవిడర్ కళగం’ ను ఒక సామాజిక సంస్ధగానే ఉంచే ప్రయత్నం చేశారు పెరియార్.
ఆయన 70 ఏళ్ల వయసులో 32 ఏళ్ళ వయస్సున్న అమ్మాయిని వివాహం చేసుకోవడాన్ని అన్నాదురై తదితరులు వ్యతిరేకించారు.అలా పెరియార్ పై నిరసన తెలిపి ‘ద్రవిడ మున్నేట్ర కళగం’ ని ప్రారంభించి రాజకీయాల్లో పోటీకి నిలబడ్డారు అన్నాదురై. రామస్వామి 1973 డిసెంబరు 24 న కన్నుమూశారు.
ఈ ‘ద్రవిడ మున్నేట్ర కళగం’ పార్టీనే డీఎంకే గా పాపులర్ అయింది. 1969లో అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి నాయకత్వంలో పార్టీ ముందుకు నడిచింది. కరుణానిధి తో
విభేదించిన యమ్.జి.రామచంద్రన్ డి.యమ్.కె. నుండి బయటకొచ్చి ‘అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎ.ఐ.ఎ.డి.యమ్.కె.) అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు.
ఈ రెండు పార్టీలే అప్పటి నుండి ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. డీఎంకే నుంచి కరుణానిధి,ఆయన కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రులు అయ్యారు. అన్నాడీఎంకే నుంచి ఎంజీఆర్,జయలలితలు సీఎం అయ్యారు.
pl read it also …………. డీఎంకే మూల పురుషుడు ఈయనే ..Tamil politics-2