Subramanyam Dogiparthi …………………..
ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మించడానికి ప్రజల్ని బాదుతుంటాడు . హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు.స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు. ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు.ఈరోజుల్లో స్థూపాలను , విగ్రహాలను విమర్శించే సినిమాలను బాయ్ కాట్ కూడా చేస్తారు , చేపిస్తారు.
వామపక్ష భావజాలం పుష్కలంగా ఉన్న గిడుతూరి సూర్యం మహాకవి శ్రీశ్రీ వ్రాసిన మరో ప్రపంచం మరో ప్రపంచం పాటను కూడా అధ్భుతంగా చిత్రీకరించాడు . అంతే కాదు ; సినిమాలో డైలాగులు కూడా ఎర్రగానే ఉంటాయి. అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల నాయకులను కట్టేసి అయినా చూపించాలి . సినిమా అంతా బిర్రుగా సాగుతుంది.
ఈ సినిమాలో మరో విశేషం.. రాజబాబు విలనావతారం. ఆత్మన్యూనతా భావం ( inferiority complex ) ఉన్న వారు pervert అయి , cynical అయి , ఎలా కౄరంగా monstrous గా తయారవుతారో ఈ సినిమాలో చూడవచ్చు . పిల్లల్ని , విద్యార్థులను ఎప్పుడూ తక్కువ చేసి , చులకన చేసి చూడకూడదు . కొందరు తమ ప్రతాపాన్ని చూపటానికి .. చేయకూడని పనులు కూడా చేస్తారు . ఈ సినిమాలో రాజబాబు పాత్ర అలాగే ఉంటుంది.
కాంతారావు , రామకృష్ణ , ప్రభాకరరెడ్డి , రాజనాల , మిక్కిలినేని , రాజబాబు , రాజశ్రీ , వాణిశ్రీ , గీతాంజలి , ధూళిపాళ , మీనాకుమారి , నాగభూషణం , జ్యోతిలక్ష్మి , బాలకృష్ణ , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు . వాణిశ్రీ తనకొచ్చిన మంచి పాత్రలో బాగా నటించింది.
పాటలు , డాన్సులు అన్నీ బాగుంటాయి. వలపు కౌగిళ్ళలో కరిగిపోయేవులే, ఇది కూడదురా మదమెందుకురా , వచ్చింది ఏమో చేయాలని , ఇంతేలే వీరుల గాధలు త్యాగుల గాధలు పాటలు శ్రావ్యంగా ఉంటాయి . యస్ పి కోదండపాణి సంగీతం, కె యస్ రెడ్డి నృత్య దర్శకత్వం, మహారధి మాటలు అన్నీ పదునుగానే ఉంటాయి. పింజల సుబ్బారావు నిర్మాత.
సైకిళ్ళు వేసుకుని కుర్రాళ్ళమంతా చిలకలూరిపేట వెళ్లి చూసాం ఈ సినిమాను . మా నరసరావుపేటకు చిలకలూరిపేట 12 మైళ్లే . సైకిళ్లు మీద వెళ్లి సినిమాలు చూసేవాళ్ళం . టి విలో కూడా అప్పుడప్పుడు వస్తుంది . యూట్యూబులో ఉంది . తప్పక చూసే సినిమాల్లో చేర్చండి .