స్పీకర్ పై చెప్పులు విసిరిన ఎమ్మెల్యేలు !

Sharing is Caring...

ఒడిశా శాసనసభలో ఎమ్మెల్యేలు స్పీకర్ సూర్యనారాయణ పాత్రో పై చెప్పులు,డస్ట్ బిన్లు, ఇయర్ ఫోన్లు విసిరి సంచలనం సృష్టించారు. ఆ ముగ్గరు విపక్షానికి చెందిన బీజేపీ సభ్యులు. అసెంబ్లీ లో మైనింగ్ కుంభకోణంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ అనుమతించలేదు. అలాగే చర్చలేకుండా 2021 ఒడిశా లోకాయుక్త (సవరణ) బిల్లు ను ఆమోదించడంపై ప్రతిపక్షాలు సభలో వాగ్యుద్ధానికి దిగాయి. ఈ సందర్భంగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎమ్మెల్యేలు  నినాదాలు చేస్తూ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు జయనారాయణ మిశ్రా, బిష్ణు చరణ్ సేథి, మోహన్ లు స్పీకర్ పై చెప్పులు, ఇతరవస్తువులు విసిరారు.

అధికార పార్టీ బిజెడి సభ్యులు ఈ సంఘటనను ఖండించి, తప్పు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పిదప స్పీకర్ ఫుటేజీని పరిశీలించి ఆ ముగ్గురు శాసనసభ్యులను సస్పెండ్ చేశారు. ఏప్రిల్ 9 తేదీ వరకు జరగాల్సిన ఈ సెషన్‌ను షెడ్యూల్ కంటే ఐదు రోజుల ముందే వాయిదా వేశారు.  ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ సభ వెలుపల మీడియాతో మాట్లాడుతూ సభలో జరిగిన విషయాలను తెలియజేసారు. ఇక తమ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ధర్నాచేపట్టారు. బిజెపి ఎమ్మెల్యేల నిరసనను సమర్థిస్తూ, ప్రతిపక్ష నాయకుడు ప్రదీప్తా నాయక్ మాట్లాడుతూ, “స్పీకర్ ఏదైనా చర్య తీసుకునే ముందు మా మాట వినాలి. ప్రతిపక్ష నాయకుడికి ఎటువంటి సంబంధం లేదు. నన్ను మాట్లాడటానికి అనుమతించలేదు.” అని వివరించారు.

విపక్ష సభ్యులకు అసెంబ్లీలో మాట్లాడటానికి స్పీకర్ అనుమతించడం లేదని నాయక్ ఆరోపించారు. కాగా సస్పెండ్ అయిన సభ్యులలో మాజీ మంత్రి జయనారాయణ  నాలుగో సారి ఎమ్మెల్యే గా చేస్తున్నారు. మోహన్ మూడు సార్లు, బిష్ణు రెండోసారి అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు. వీరందరికి సభా సంప్రదాయాలు గురించి తెల్సు.శాసనసభలో నిరసన తెలియజేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.ఆ పద్దతులను తోసిరాజని స్పీకర్ పై చెప్పులు విసిరారు. పైగా క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఇతర పార్టీనేతలు అంటున్నారు. కాగా ఇదే అసెంబ్లీ లో 2004లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుప్ సాయిని ఆరు రోజులు సస్పెండ్ చేశారు.  తాజా సంఘటన శనివారం జరిగింది.

————-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!