మాధవన్ నటనే సినిమాకు బలం !!

Sharing is Caring...

A biopic worth watching……

‘జీడీఎన్’ (G.D.N)  ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త జీడీ నాయుడు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం. ఆర్‌. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 2026లో థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)  తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించారు.   

కథేంటంటే? 
భారతదేశపు ఎడిసన్‌గా పిలవబడే జీడీ నాయుడు (మాధవన్) జీవిత ప్రయాణమే ఈ సినిమా. ఒక సాధారణ హోటల్ సర్వర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఒక గ్రామీణ యువకుడు, బైక్‌లు, యంత్రాలపై ఉన్న అమితమైన ఆసక్తితో ఎలా ఒక గొప్ప ఆవిష్కర్తగా ఎదిగాడనేది కథ.

భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ తయారీ, ప్రసిద్ధ యుఎమ్‌ఎస్ (UMS) బస్సు సామ్రాజ్యం స్థాపన, బ్రిటీష్ కాలంలో, ఆ తర్వాత పన్ను అధికారులతో ఆయన చేసిన చట్టపరమైన పోరాటాల చుట్టూ ఈ బయోపిక్ సాగుతుంది. జీడీ నాయుడు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. 

గతంలో ‘రాకెట్రీ’ సినిమాలో సైంటిస్ట్ నంబి నారాయణన్‌గా మెప్పించిన మాధవన్, ఈ సినిమాలో జీడీ నాయుడు పాత్రలో జీవించేశారు. యువకుడి నుండి వృద్ధుడి వరకు వివిధ వయసుల షేడ్స్‌ను ఆయన చాలా ఈజీగా పండించారు.

కథానాయకుడికి యంత్రాలతో ఉండే బంధం, కొత్త వస్తువులను కనిపెట్టేటప్పుడు వచ్చే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఇంగ్లీష్ వ్యక్తి మోటార్ సైకిల్ చూసి అతను మురిసిపోయే సీన్లు ఇన్స్పైరింగ్‌గా ఉంటాయి. ఆ బైక్ మెకానిజం తెలుసుకోవడం కోసం అతను పడే తపన యువతకు బాగా కనెక్ట్ అవుతుంది.

కోయంబత్తూరులో జీడీ నాయుడు రవాణా రంగాన్ని ఎలా విప్లవాత్మకంగా మార్చారో చూపించే సీన్లు అద్భుతంగా ఉంటాయి.తన ఆవిష్కరణలను తక్కువ అంచనా వేస్తూ, ఆటంకాలు సృష్టించే బ్రిటిష్ అధికారులకు, పన్ను అధికారులకు జీడీ నాయుడు తన మేధస్సుతో, చట్టపరమైన లాజిక్కులతో ఇచ్చే కౌంటర్లు బాగుంటాయి. 

సినిమా ముగింపు దశలో మాధవన్ వృద్ధుడిగా కనిపించే సీన్లు, సమాజం కోసం తాను పడిన కష్టాన్ని వివరిస్తూ చెప్పే డైలాగులు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి.ఆయన నటన, మేకప్ ఈ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.  సత్యరాజ్, ప్రియమణి, దుషారా విజయన్ వారి పరిధి మేరకు చక్కని నటన కనబరిచారు. సీనియర్ నటుడు జయరామ్ ‘అంబలపార కృష్ణన్’ పాత్రలో చక్కగా నటించారు

జీడీ నాయుడు జీవితంలోని చాలా సంఘటనలను ఒకే సినిమాలో చూపించాలనే ప్రయత్నంలో, స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల సినిమా డ్రామాలా కాకుండా డాక్యుమెంటరీ లాగా మారిపోతుంది. ఒక మేధావి కథను సమాచార రూపంలో అందించినంతగా, ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ సీన్స్  బలంగా  రాసుకోలేకపోయారు. దీనివల్ల కొన్ని కీలక సన్నివేశాలు ఫ్లాట్‌గా సాగుతాయి.

ఇది ప్యూర్ బయోపిక్ కావడం వల్ల రెగ్యులర్ కమర్షియల్ మసాలాలు, ఫైట్లు, డ్యూయెట్లు ఆశించే సాధారణ ప్రేక్షకులకు సినిమా కొంచెం స్లోగా అనిపించవచ్చు. ఈ  సినిమాకు మ్యూజిక్ , కెమెరా వర్క్ చాలా పెద్ద బలాలుగా నిలిచాయి.

1920ల నుండి 1970ల కాలం నాటి పాత కాలపు వాతావరణాన్ని స్క్రీన్‌పైకి తీసుకురావడంలో ఈ రెండు విభాగాలు అద్భుతమైన ప్రతిభను కనబరిచాయి. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతాన్ని అందించారు.సినిమాకు అసలైన ఆత్మను ఇచ్చింది గోవింద్ వసంత అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. 

సినిమాటోగ్రాఫర్ అరవింద్ కమలనాథన్ ఐదు దశాబ్దాల క్రితం నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ, కోయంబత్తూరు పరిసరాలను సహజంగా చూపారు.సీన్లను కూడా బోర్ కొట్టకుండా నిలబెట్టింది విజువల్స్ మ్యాజిక్ మాత్రమే.

‘జీడీఎన్’  మన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప ఆవిష్కర్త కథను పరిచయం చేసే స్ఫూర్తిదాయకమైన బయోపిక్. కొన్ని డ్రామా లోపాలు ఉన్నప్పటికీ, భారతదేశ చరిత్రలో మరుగున పడిపోయిన ఒక గొప్ప వ్యక్తి కథను తెలుసుకోవడానికి, ఆర్‌. మాధవన్ అద్భుతమైన నటన కోసం ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ లో ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!