ఏరియా 51లో ఏలియన్స్ పై పరిశోధనలు?

Sharing is Caring...

Is that true……………………………………………………  ఏరియా 51.. ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. అసలేమిటి ఈ ఏరియా 51 ? అక్కడ ఏలియన్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. అది నిజమా ? కాదా ? అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు.ఈ ఏరియా 51 అనేది ఒక  వైమానిక దళం క్యాంప్.ఈ ప్రదేశం అమెరికాలోని నెవడా రాష్ట్రం లోని లాస్ వేగాస్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నఎడారి లో ఉంది. 

నెవడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ పేరిట ఈ క్యాంప్ ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలోకి సాధారణ ప్రజలకు అనుమతి లేదు. ఈ ఏరియా మొత్తం వైమానిక దళం నిఘాలో ఉంటుంది.ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండా ఆ ప్రాంతంలో హెలికాఫ్టర్లు,విమానాలు, డ్రోన్లు కూడా ఎగర కూడదు. ఎవరైనా లోపలకు వెళ్లాలని ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ క్యాంప్ ఎంట్రెన్స్ వద్ద బోర్డులు కూడా పెట్టారు. దాదాపు 50 ఏళ్ళనుంచి ఈ ఏరియా వైమానిక దళం పహారాలోనే ఉంది.

1950 ప్రాంతంలో ఈ క్యాంప్ లో యూఎఫ్ వోలు గాల్లో ఎగురుతూ కనిపించాయని అంటారు. అప్పటినుంచే ఈ క్యాంపుకి ఏలియన్స్ వస్తున్నారని ప్రచారం మొదలైంది. ఆ తర్వాత కాలంలో అక్కడ  ఎయిర్ ఫోర్స్ నిఘా విమానాలను తిప్పేది. దాంతో ఏలియన్స్ నిజంగానే వస్తున్నారని ప్రజలు చెప్పుకోవడం ప్రారంభించారు.

ఆ తర్వాత  ఎయిర్ ఫోర్స్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో ఏలియన్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. వాటి ఆధారంగా పలు కథనాలు పుట్టుకొచ్చాయి. అధికారులు కాదని చెప్పినా ఏలియన్స్ ను నమ్మేవారు మాత్రం కాదు కాదు అక్కడ ఏదో జరుగుతోంది అనే అంటున్నారు.

తాము ఎన్నోసార్లు ఇక్కడ ఎగిరే పళ్లాలను చూశామని గట్టిగా తమ వాదన వినిపిస్తుంటారు. ఎంతో మంది ఉద్యోగులు క్యాంప్ లో పనిచేస్తున్నారని ప్రచారం కూడా ఉంది.  ఉద్యోగుల రవాణా కోసం ప్రత్యేక విమానాలను ఉపయోగిస్తారని చెబుతారు.

అక్కడ పని చేసే ఉద్యోగులందరూ తాము చేసే పని గురించి ఎవ్వరికి చెప్పకూడదు. తోటి ఉద్యోగులు గురించి తెల్సుకునే ప్రయత్నం చేయకూడదనే నిబంధనలు ఉన్నాయట. వీరికి జీతాలు ప్రభుత్వం బ్లాక్ బడ్జెట్ నుంచి నగదు రూపంలో ఇస్తుందని అంటారు.

బీబీసీ జర్నలిస్టులు అక్కడ ఒక డాక్యుమెంటరీ తీయాలని ప్రయత్నించారు.కాని అది గమనించిన భద్రతా సిబ్బంది వాళ్ళని అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కాల్చేస్తామని సెక్యూరిటీ హెచ్చరించగా  బీ బీ సి టీమ్ వెళ్ళిపోయింది.  ఆ ప్రాంతాన్నిఅంత రహస్యంగా ప్రభుత్వం ఉంచింది కాబట్టే అక్కడ ఏదో జరుగుతుంది అని సందేహాలు కలుగుతున్నాయి. దాన్నితెలుసుకోవాలని ఉత్సుకత పెరుగుతోంది.

————–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!