ఈ సారి పోటీ ‘కుప్పం’ నుంచి కాదా ?

Sharing is Caring...

Are Babu’s strategies changing?………………….

“చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం.. కుప్పం నుండి నన్ను పోటీ చేయమంటారా?” —– నారా భువనేశ్వరి..
కుప్పంలో కార్యకర్తలతో భువనేశ్వరి అన్న మాటలివి.

ఆఫ్ కోర్సు ..  ఆమె సరదా గా అన్నానని వ్యాఖ్యానించినప్పటికీ ..ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అలాంటి మాటలు పలు అర్ధాలకు తావిస్తాయి.భువనేశ్వరి సరదాగా అన్నారా ?వ్యూహాత్మకంగా  ఓటర్ల పల్స్ తెలుసుకోవాలని అన్నారా ? అనేది ఇపుడు చెప్పలేం.

ఇక చంద్రబాబు వ్యవహారశైలి తెలిసినవాళ్లు ఆయన రెస్ట్ తీసుకుంటారా ? అంటే అసలు నమ్మరు. కానీ కొన్నాళ్లనుంచి బాబు నియోజకవర్గం మారుస్తారు అనే ప్రచారం జరుగుతున్న క్రమంలో భువనేశ్వరి కుప్పం బరి నుంచి పోటీ చేయవచ్చు అన్న ఊహాగానాలు వ్యాప్తిలో కొచ్చాయి.

చంద్రబాబు అరెస్ట్ అయిన క్రమంలో భువనేశ్వరి బస్ యాత్రలు మొదలు పెట్టినపుడే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భువనేశ్వరి పోటీ చేస్తారని పార్టీ  కార్యకర్తల్లో ప్రచారం జరిగింది. కొద్ది రోజులు పోతే కానీ ..  బాబు కుప్పం కు బై చెబుతారా ?అక్కడే పోటీ చేస్తారా ? అనేది తేలిపోతుంది.

ఆ విషయాలు పక్కన బెడితే ……  కుప్పం నియోజక వర్గానికి మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు 35 ఏళ్ళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.స్థానిక ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏమిటో పరిశీలించుకోకుండా చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటూ వ్యాఖ్యలు చేసి పరోక్షంగా ఓటమిని అంగీకరించారు.

అదలా ఉంచితే 2004 నుంచే కుప్పంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 1989 లో బాబు ఇక్కడ కేవలం 6918 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. 1994 నాటికి ఆ మెజారిటీ 56588 ఓట్లకు చేరుకుంది. 1999 నాటికి ఆ మెజారిటీ 65687 ఓట్ల కు పెరిగింది. ఎప్పుడైతే నాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుప్పం పై దృష్టి పెట్టారో అప్పటినుంచి మెజారిటీ తగ్గుతోంది.

2004లో బాబు మెజారిటీ 59508 ఓట్లకే పరిమితమైంది. 2009 నాటికి మరికొంత తగ్గి 46066 ఓట్ల దగ్గర ఆగింది. దీంతో బాబు జాగ్రత్త పడ్డారు. పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ  2014 ఎన్నికల్లో మెజారిటీ పెద్దగా పెరగలేదు. 47121 ఓట్లను అధిగమించలేదు.2019 ఎన్నికల్లో 70 వేల మెజారిటీ తో బాబును గెలిపించాలని ఆయన సతీమణి భువనేశ్వరి టెలి కాన్ఫెరెన్సులు పెట్టి నేతలను కోరారు.

ఎన్నో తాయిలాలు ప్రకటించారు. అయినా వైసీపీ నేత జగన్ వేవ్ లో బాబు మెజారిటీ 29993 ఓట్లకే పరిమితమైంది. కౌంటింగ్ జరుగుతున్నపుడు ఒక దశలో బాబు ఓడిపోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. మెజారిటీ దాదాపు 17 వేలు తగ్గింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని .. లోకల్ నేతలు పట్టించుకోవడం లేదని అందుకే మెజారిటీ తగ్గిందని అప్పట్లో మీడియాకు ఓటర్లు చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి.

మొత్తం మీద బాబు కుప్పంలో 7 సార్లు గెలవడం గొప్ప విషయమే. అభివృద్ధి పనులు కొన్ని చేశారు కానీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చేయాల్సిన స్థాయిలో చేయలేదని అక్కడి ఓటర్ల మనోగతం. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ కు లేదా వైసీపీ కి గట్టి అభ్యర్థులు లేరు.

అనుకూల మీడియా కుప్పం లో డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు బాబును అప్రమత్తం చేయాల్సింది పోయి కేవలం భజనకే ప్రాముఖ్యత ఇచ్చాయి. దీంతో కుప్పం లో పార్టీ బలం తగ్గింది. ఈ క్రమంలో ఈ ఓటమి భారంతో బాబు కుప్పం వదిలి వేరే నియోజకవర్గం చూసుకుంటారని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేశారు.

2019 ఎన్నికలకు ముందు కూడా బాబు నియోజకవర్గం మారుస్తారని ప్రచారం జరిగింది. కానీ మారలేదు.తాజాగా బాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబు కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేయవచ్చు అంటున్నారు.  

బాబు సన్నిహితులు కొందరు ఆయన కుప్పం వదిలి ఎక్కడికి పోరని అంటున్నారు.నియోజకవర్గం మారడమంటే  అంత సులభం కాదు. దానికి చాలా లెక్కలు ఉంటాయి. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికీ బాబు ఏమి చేస్తారో వేచి చూడాల్సిందే.

 ———— K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!