ఆ ఇద్దరికి సినీ గ్లామర్ వర్క్ అవుట్ కాలేదా ? Tamil politics-10

Sharing is Caring...

FAILURE STORIES…………………………..

సినిమా నటులు అందరికి రాజకీయాలు కలసి రావు. గురుశిష్యులు గా ఉండే శివాజీగణేశన్ …కమల్ హాసన్లకు కూడా రాజకీయాలు అచ్చి రాలేదు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూపలేకపోయారు.

మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ ది కూడా అదే పరిస్థితి. ప్రజలు ఆయనను నటుడిగా ఆదరించినప్పటికీ …  రాజకీయంగా  ఆదరించలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికలే అందుకు నిదర్శనం. కమల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అవేవీ ఫలించలేదు. ఇక కమల్ శివాజీని తన గురువుగా భావించేవాడు. శివాజీ కూడా తన నట వారసుడు కమల్ అని పలుమార్లు చెప్పారు కూడా.

సినిమాలలో కమల్ గురువు శివాజీని మించిపోయాడు.మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డులు సాధించారు. కానీ రాజకీయాల్లో మాత్రం గురువు లాగానే ప్రజల ఆదరణ పొంద లేకపోయారు.  కమల్ శివాజీ లాగానే “మక్కల్ నీది మయ్యాం” పేరిట సొంత పార్టీ పెట్టారు. 2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో 37 మందిని  బరిలోకి దింపారు. ఒక్కరూ కూడా గెలవలేదు.

సూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ పెడితే ఆయన తో కలసి రాజకీయాలు చేద్దామనుకున్నారు. కానీ రజనీ అనూహ్యంగా వెనుకడుగు వేశారు.ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశారు. తాను పోటీ చేస్తూ .. 142 మందిని ఎన్నికల బరిలోకి దింపారు. ఎక్కడా పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కమల్ తో సహా అందరూ ఓడిపోయారు. దక్షిణ కోయంబత్తూరు లో 1728 ఓట్ల తేడాతో కమల్ ఓడిపోయారు.

ఆ తర్వాత పార్టీ లో రాజీనామాల పర్వం మొదలైంది. ఒక దశలో పార్టీని ఉంచాలా? మూసివేయాలా అని కమల్ కొన్నాళ్ళు మల్లగుల్లాలు పడ్డారు. కమల్ సిద్ధాంతాల్లో కొన్ని బాగానే ఉన్నాయి. కానీ అవి సరిగ్గా జనంలోకి వెళ్లినట్టులేవు.ఓట్లు కొనుగోలు చేయం..అని ప్రకటించి కమల్ తన మాట నిలుపుకున్నారు.

స్వల్పకాలంలో ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరాశ పడకుండా పార్టీ ని కొంత కాలం నడిపితే భవిష్యత్తులో ప్రజలు ఆయన వెంట నడవొచ్చుకమల్ హాసన్ ఆ మధ్య కాంగ్రెస్ నేత రాహుల్ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ ని విడిగా కూడా కూడా కలిశారు. అప్పట్లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు.

ఈ మధ్య మీడియా ‘ఇండియా కూటమిలో చేరతారా?’ అని అడిగితే కమల్ సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తమ పార్టీ భాగస్వామి కాదని చెప్పారు. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీతో కమల్‌హాసన్‌ కలిసి పనిచేయబోతున్నారన్న వార్తలు ఇటీవలి కాలంలో ప్రచారంలోకి వచ్చాయి. స్టార్‌ హీరో దళపతి విజయ్‌ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్‌హాసన్‌ స్వాగతించడం విశేషం. ఏమి జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. 

————-KNMURTHY 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!