వైతరణి నది అంత భయంకరంగా ఉంటుందా ?

Sharing is Caring...

 Garuda Purana………………………

వైతరణి నది. దీని గురించి గరుడ పురాణంలో వివరం గా రాశారు.  పాపాలు చేసిన మనుష్యులు చనిపోయిన తర్వాత  ఈ వైతరణి నది దాటుకుంటూ యమలోకానికి వెళ్ళాలి. గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ఉంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన దరిమిలా ఈ ద్వారం గుండా యమ లోకం లోకి ప్రవేశిస్తారు.  

ఈ వైతరణి నది దాటుకుంటూ వెళ్లే సమయంలో కలిగే  బాధలకు మనుష్యులకు వారు బతికి ఉండగా చేసిన  పాపాలన్ని గుర్తుకు వస్తాయని అంటారు.  ఈ నదిని చేరుకోవడానికి  కొంత దూరం కీకారణ్యం మధ్యలో నుంచి నడవాలి. లోయలను దాటాలి.  క్రూర సర్పాలు బుసలు కొడుతుంటాయి, గద్దలు పై నుంచి వచ్చి పాపులను పొడుస్తుంటాయి. విషకీటకాలు కాళ్లపై ఎక్కుతుంటాయి.

తేళ్లు ,మండ్రగబ్బలు కరుస్తుంటాయి. దాహమేసినా నీటి చుక్క అక్కడ దొరకదు. మార్గ మధ్యంలో ఒక చోట వేడి ఇసుకతో కూడిన మైదానం..మరో చోట నిప్పుల దిబ్బలు, పొగ మేఘాలు ఉంటాయి. మరి కొన్నిచోట్ల  ఆకాశంలో నుంచి  బొగ్గుల జల్లులు, రాళ్ల జల్లులు, పిడుగులు, రక్తపు జల్లులు, వేడినీటి జల్లులు పడుతుంటాయి. వీటి నుంచి పాపులు తప్పించు కోలేరు. దిక్కు తోచని పరిస్థితి.

ఇవన్నీ దాటాక  యముని సోదరుడు విచిత్ర రాజు పాలించే పట్నం వస్తుంది. అక్కడ వైతరణి నది కనిపిస్తుంది.ఈ నది కొన్నివేల మైళ్ళ వరకు విస్తరించి ఉంటుంది. ఈ నదిలో నీటికి  బదులుగా రక్తము, చీము ప్రవహిస్తుంటాయి. ఎటు చూసినా మృత కళేబరాలు, ఎముకలు,కుళ్లిపోయిన శవాలు  కాళ్లకు అడ్డం పడుతుంటాయి. మాంసం ముద్దలు తేలుతూ కనిపిస్తాయి.

ముక్కులు మూసుకున్నప్పటికీ భరించలేని దుర్గంధం అక్కడ ఆవరించి ఉంటుంది.  పాపాత్ముల కోసమే ఈ నది ప్రత్యేకంగా సృష్టించబడిందని అంటారు. ఈ నదికి ఒడ్డు,తీరం ఎక్కడ ఉందొ కనిపించదు.పెద్ద, పెద్ద మొసళ్ళుఇందులో సంచరిస్తుంటాయి ..మాంసాన్నితినే క్రిములు, జంతువులు, పక్షులు కూడా ఉంటాయి. ఇవే కాక సృష్టిలోని అన్ని మాంసహారులు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి.. వాటి మధ్యలో నుంచి పాపులు నడుస్తూ వెళ్ళాలి. పాపులకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం అనిపిస్తుంది.  
 
మనిషి మరణించాక వారసులు పెట్టే 171 వ రోజు  పిండాలు భుజించిన తరువాత  విచిత్ర రాజు పరిపాలించే  పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే ఈ వైతరణి నదిని దాటాలి. అక్కడనుంచి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంటుంది.  ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ.

మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు(మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనం , గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి  చేరుకోవాలి.

బతికుండగా గోదానం చేసినవారు పడవలో ఈ వైతరణి దాటగలరు.  కానీ చేయని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనిపిస్తుంది. పాపులు అందులో దిగి నడవవలసిందే.. పాపుల నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు.

శీతాడ్యనగరంలో జీవుడి పాపపుణ్యాల లెక్కలు కడతారు. ఆ జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరుకుంటాడు.హస్త ప్రమాణ పిండ రూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు.

ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరుకుంటాడు.  శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత కష్టాలు,క్లేశాలతో కూడిఉంటుంది. అందుకే వారసులకు శ్రాద్ధ కర్మలు తప్పనిసరిగా చేయాలని  చెబుతుంటారు.

ఏ పాపము చేయని వారు, మంచి కర్మలను అనుసరించిన వారు యమ లోకానికి అసలు రారు.
ఈ నది దాటిన పిమ్మట పాపులు దక్షిణ ద్వారము వద్దకు  చేరుకుంటారు. అబద్ధమాడిన వారు ఎవరైనా నరకాన్ని చవి చూడాల్సిందే. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతోంది గరుడ పురాణం.

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉన్నది. నది అంతా మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లి పడి పోయాడు. తేరుకున్నాక  దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అని ధర్మదేవతను అడిగాడు ధర్మరాజు.

అపుడు ధర్మ దేవత … ధర్మరాజా  మీరు అనుభవించిన  నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో మీరు ఆడిన అసత్య  ఫలితమే అని చెప్పింది. అశ్వత్థామ హతః అని పెద్దగా , కుంజరః అని చిన్నగా పలికి మీ గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, కొద్దీసేపు మీరు నరకం అనుభవించాల్సి వచ్చిందని చెబుతుంది.  

అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు, మారణ హోమాలు సృష్టించేవారికి , ఘోర కిరాతకాలకు  పాల్పడే వారికీ  మరి ఎలాంటి శిక్షలుంటాయో?  ఏమో ? ఇదంతా వినడానికే భయంకరంగా ఉంది కదా ? అందుకే గరుడ పురాణం చదవడానికి  చాలామంది భయపడుతుంటారు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!