What does Garuda Purana say?…………………..
పాప కార్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ? నరకాలు చాలానే వున్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం,పిండి పిండి చెయ్యడం, ముద్ద చెయ్యడం వంటి వేలకొద్దీ శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడ ఒక్కరోజే నూరు రోజుల బాధలు అనుభవంలోకి వస్తాయి. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి కి చెప్పిన విషయాలు ఇవి.
ఎక్కడో, ఎంతో పుణ్యం చేసుకొన్న మానవులు తప్ప, సామాన్యంగా ఏ మనిషి చని పోయిన వెంటనే నరకానికీ, స్వర్గానికీ వెళ్ళి వచ్చి వెంటనే మనిషిగా పుట్టెయ్యడం జరుగదు. మహాపాపులు నరకం నుండి వచ్చి మొక్కగానో, చెట్టుగానో పుడతారు. తరువాత క్రిమి, కీటక, దీపక షట్పాది జన్మలూ ఎత్తుతారు.
తరువాత గిట్టలున్న గాడిద వంటి జంతువుల నుండి అడవి ఏనుగు దాకా వారి పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు.
ఇంకా పాపఫలాలు మిగిలివారు గూని, మరుగుజ్జు, తదితర మానవ జన్మలెత్తి, ఆ పిదప సంపూర్ణ
మానవ జన్మను పొందుతారు.అందుకే అంటారు పెద్దలు నరజన్మ బహు దుర్లభమని…. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అయితే అందులో ముక్తిని మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉన్న ఏకైక జీవి మానవుడు మాత్రమే. అది మానవులు గ్రహించాల్సిన అవసరం ఉంది.
ఈ మానవులలోనే కొందరు బహు పుణ్యప్రదులు, దేవతలు కావచ్చు, ఇంద్రులూ కావచ్చు.పుణ్యాత్ములను స్వర్గానికి పంపించేది యమధర్మరాజే. ఆయన అనుమతి తో పుణ్యాత్ములను దేవదూతలు వచ్చి మధుర గీతాలు పాడుతూ వాటికి తగిన అందమైన నృత్యాలను చేస్తూ, చందనాది దివ్య సుగంధాలను పూసి, మరింత హృద్య సుగంధాలను వెదజల్లే పూలమాలలతో అలంకరించి దివ్యకాంతులు వెదజల్లు విమానాలలో కూర్చుండ బెట్టి స్వర్గానికి తీసుకొనిపోతారు .
పుణ్య సమాప్తి తరువాత వారు మరల పుడమిపై పుట్టవలసి వచ్చినపుడు సుక్షత్రియులుగానో…. మహాత్ములుగానో – అట్టి వారింటనే పుట్టి పెరిగి పరిఢవిల్లుతారు. వీరికి ఈ జన్మలో బ్రహ్మాండమైన భోగభాగ్యాలబ్బుతాయి. వాటిని వదలి భగవంతుని పనినే చేస్తూ జన్మను చాలించి మోక్షాన్ని పొందే అవకాశమూ వుంటుంది.
భూలోకంలో జన్మించినపుడు మరణం తప్పదు. ఆత్మ శరీరాన్ని వీడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్త్వం పృథ్విలోనూ, జలతత్త్వం నీటిలోనూ, తేజ తత్త్వం తేజంలోనూ, వాయు తత్త్వం గాలిలోనూ, ఆకాశ తత్త్వం నింగిలోనూ సర్వవ్యాపియైన మనస్సు చంద్రునిలోనూ విలీనమైపోతాయి.
శరీరంలోని పంచేంద్రియాల కోరికలూ, కామక్రోధాదులను చోరులతో పోల్పవచ్చు.వాటి బారి నుండి జ్ఞాన రత్నాన్ని కాపాడుకోవాలి. ఇంకా కామక్రోధాహంకార నామక వికారాలు కూడా వుంటాయి. వాటికి నాయకత్వం వహించేది మనస్సు. ఈ శరీరానికి సంహార పత్రాన్ని రాసేది కాలం. ఉన్న ఇల్లు కాలిపోతే మనిషి వేరొక ఇంటిలోకి వెళ్ళినట్లు ఒక శరీరంలో నుండి వేరొక దానిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది.
మానవశరీరం నాడులతో నవ ద్వార యుక్తమై వుంటుంది. ఈ సాంసారిక విషయ వాసనలచే ప్రభావితములైన కామక్రోధాది వికార సమనిత్వమై వుంటుంది. రాగద్వేష పరిపూర్ణమై తృష్ణతో నిండి వుంటుంది.
లోభమనెడి వలలో మోహమనెడి బట్ట ముసుగులో వుంటుంది.మాయచే గట్టిగా కట్టబడి లోభానికే కట్టుబడి వుంటుంది. అన్ని శరీరాలూ ఇంతే. అయినా కొందరు అదే శరీరంలో వుండే ఆత్మను తెలుసుకొని దాని ద్వారా జపతపాది ఆయుధాలతో మాయను సంహరించి పరమాత్మను చేరుకోగలరు. ఆత్మజ్ఞానం లేనివారు పశు సమానులై జీవించి అలాగే మరణిస్తారు.