సుమారుగా 1820 వరకూ యూరోపియన్ సైంటిస్టులు విశ్వం (universe) వయస్సు 6,000 సం… మాత్రమే అని భావించారు. ప్రస్తుతం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలని భావిస్తున్నారు.దీన్ని కూడా సర్వత్రా ఆమోదించక పోవడానికి కారణం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న, అధ్యయనం చేసిన విశ్వం మేరకు కొన్నిరెడ్ జైయింట్ నక్షత్రాలు 14 నుండి 18 బిలియన్ సంవత్సరాల వయస్సు వరకూ కలిగి ఉన్నాయని అంచనా. కాబట్టి ఈ చర్చపై ఇతమిథ్థమైన ముక్తాయింపుకి ప్రస్తుతానికి రాలేమని గమనించగలరు.
సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 9
శివపురాణంలో శివుని గురించి వర్ణన చేసేప్పుడు ఆయన మెడలో ధరించిన కపాలమాల గురించి మీరు వినే ఉంటారు. అవి బ్రహ్మ కపాలాలు. సృష్టిని రచించిన బ్రహ్మ మరణించినప్పుడు ఆయన కపాలాలకు మహాదేవుడు శివుడు ఇచ్చే గౌరవం అది. ఇప్పటివరకు ఎంతోమంది బ్రహ్మలు అంతరించిపోయారు. బ్రహ్మవైవర్త పురాణం కూడా ఇదే చెప్తుందని ఇంతకు మునుపే మీకు తెలియపరిచాను.
అసలు ఆ పురాణం మూలభావన అంతా ఆ పేరులోనే ఇమిడి ఉంది. నిజంగా మారడం ‘వికారం’ , నిజంగా మారకున్నా మారినట్లు కనిపించడం ‘వివర్తం’. ఈ జగత్తు బ్రహ్మం (పరమాత్మ, బ్రహ్మ కాదు) వలన కలిగినదే, కానీ ఇది సత్యం కాదు, శాశ్వతం కాదు. విశ్వానికి కారణం బ్రహ్మమనీ, విశ్వమంతా బ్రహ్మ వివర్తమనీ పరమార్థం.
మనం ఏదైనా దైవిక కార్యం కోసం అనుష్టానం చేసేప్పుడు… బ్రహ్మ ద్వితీయ పరార్థే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతఖండే, భరతవర్షే… ఇలా చెప్పుకుంటాం కదా. బ్రహ్మ ద్వితీయ పరార్థే అంటే ఆయన రెండవ సగ జీవిత కాలంలో, శ్వేతవరాహ కల్పంలో, వైవస్వతుడనే మనువు యొక్క మన్వంతరకాలంలో, కలియుగం యొక్క ప్రథమపాదంలో ఉన్నామని… అసలు ఈ ప్రహసనంలో బ్రహ్మ జీవితకాలం ఎంతో తెలుసుకుందాం.
4,32,000 సం. – కలి యుగం
8,64,000 సం. – ద్వాపర యుగం
12,96,000 సం. – త్రేతా యుగం
17,28,000 సం. – కృత యుగం
మొత్తం 43,20,000 సం. ఒక మహా యుగం.
–> 71 మహాయుగాలు ‘1’ మన్వంతరం.
–> 14 మంది మనువులు ఉన్నారు. వారు వరుసగా…1) స్వాయంభువుడు 2) స్వారోచిషుడు 3) ఉత్తముడు 4) తామసుడు 5) రైవతుడు 6) చాక్షుషుడు 7) వైవస్వతుడు 8) సావర్ణి 9) దక్ష సావర్ణి 10) బ్రహ్మ సావర్ణి 11) ధర్మ సావర్ణి 12) రుద్ర సావర్ణి 13) దేవ సావర్ణి 14) ఇంద్ర సావర్ణి. వీరిలో 7వ వాడైన వైవస్వతుని మన్వంతరంలో, 28వ మహాయుగంలో, కలియుగంలోని ప్రథమపాదంలో అంటే సరిగ్గా 5121వ సం. లో ఉన్నాం.
–> ఈ 14 మన్వంతరాల కాలం బ్రహ్మకు ఒక పగలు. దీనినే ఉదయ కల్పం అంటారు.
–> తిరిగి ఇంతేకాలం బ్రహ్మకు రాత్రి. ఇది క్షయ కల్పం. ఈ సమయంలో ‘సంకర్షణ’ అనే అగ్ని చేత కొన్ని లోకాలు మినహా అన్ని లోకాలూ దగ్దమౌతాయి. దీనిని ‘నైమిత్తిక ప్రళయం’ అంటారు.
–> ఈ ఉదయ కల్పం, క్షయ కల్పాలు కలిసి బ్రహ్మకు ఒక రోజు. దీనికే కల్పం అని పేరు. ఈ కల్పాల పేర్లు అనంతం. ప్రస్తుతం ఉన్నది శ్వేత వరాహ కల్పం. విష్ణుమూర్తి శ్వేత వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడు కనుక ఆ పేరు.
–> ఇలాంటి 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్థాయం. దీనినే మహాకల్పం అంటారు. అలా బ్రహ్మ మరణం తరువాత వచ్చే ప్రళయాన్ని ‘ప్రాకృతిక ప్రళయం’ అంటారు.
ఇలా బ్రహ్మ లాగే పరమాత్మ అప్పజెప్పిన పనులు చేయడానికి ఎవరి పదవుల్లో వారు అందరూ ఉన్నారు. మనం వారిని వారి పదవుల పేర్లతోనే పిలుచుకొంటూ ఉన్నాం. ఉదాహరణకు ఇంద్రుడు. ఇది ఒక పదవి. ప్రస్తుతం ఉన్నవాడు పురంధరుడు. ఈయన తదనంతరం ‘బలి చక్రవర్తి’ ఇంద్రుడు అవుతాడు.
వ్యాసుడి పేరు కృష్ణ ద్వైపాయనుడు. ప్రతి మహాయుగంలో వచ్చే ద్వాపరయుగంలో ఆయన వేద వ్యాసం అంటే వేద విభాగం చేసి 18 పురాణాలను రచిస్తాడు. ఈయన తదనంతరం ‘అశ్వథ్థామ’ వ్యాసుడు అవుతాడు. అలాగే, ప్రస్తుత బ్రహ్మ జీవితకాలం ముగిసిన పిదప ‘ఆంజనేయస్వామి’ అంటే ‘వాయుదేవుడు’ తరువాతి బ్రహ్మ అవుతాడు.
In Astronomy, Hubble’s law shows that., Universe is getting bigger and bigger. So, it must have started very small. This led to the Idea of “BIG BANG”. [ ఖగోళశాస్త్రంలో హబుల్స్ సూత్రం ఏం చెబుతోందంటే, విశ్వం నిరంతరం విస్తరిస్తోంది కాబట్టి అది మొట్టమొదట చాలా చిన్నదిగా ప్రారంభం అయి ఉంటుంది. ఇదే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి హేతువైంది.]
ఈ బిగ్ బ్యాంగ్ లేదా మహా విస్ఫోటనం సిద్దాంతాన్ని సమర్థించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ఈ బిగ్ బ్యాంగ్ అనేది అనంతమైన బుడగల్లో (బబుల్) ఒకటి మాత్రమే అని పేర్కొనడం గమనార్హం, ఆసక్తికరం.
చెణుకులు :
* మన పురాణ వాజ్మయంలో కాలగణన…
15 నిమేషములు = 1 కాష్ఠ
30 కాష్ఠలు = 1 కల
15 కలలు = 1 నాడిక
30 కలలు (లేదా) 2 నాడికలు = 1 ముహూర్తము
30 ముహూర్తములు = 1 దినము (పగలు + రాత్రి)
15 దినములు = 1 పక్షము
30 దినములు (లేదా) 2 పక్షములు = 1 మాసము (శుక్ల పక్షము + కృష్ణ పక్షము)
6 మాసములు = 1 ఆయనము
12 మాసములు (లేదా) 2 ఆయనములు = 1 సంవత్సరము (ఉత్తర + దక్షిణ ఆయనములు)
మూలం : విష్ణు మహా పురాణము.
* వాడుక లోని దిన గణన…
60 లిప్తలు = 1 విఘడియ
60 విఘడియలు = 1 ఘడియ
7½ ఘడియలు = 1 జాము
8 జాములు = 1 దినము (పగలు + రాత్రి)
[ లిప్తలు, విఘడియలు… సెకన్లు, నిమిషాలతో సరిపోలవని గమనించగలరు.]
———– పులి. ఓబుల్ రెడ్డి
ఇది కూడా చదవండి>>>>>>>>>>>>>> సూర్యుని శబ్దం “ఓంకారం”… నిజమెంత ?