ఆయన ఆత్మ అలా క్షోభించిందా ?

Sharing is Caring...

 Memories of NTR……………………….

ఇష్టమైన వ్యక్తులు .. ప్రదేశాలు , భవనాలు  చుట్టూనే ఆత్మలు సంచరిస్తాయట. పెద్దలు చెప్పగా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో విన్నాం.ఆ పెద్దల మాటలనే తీసుకుని సరదాగా రాసిన ఆర్టికల్ఇది.అభిమానులు సరదాగా తీసుకోవాలి. 

2020 ..  ఒక రోజు .. అర్ధరాత్రి. అది తెలంగాణా పాత సచివాలయం. జేసీబీల సహాయంతో కాంట్రాక్టు సిబ్బంది పాత భవనాలను కూల్చి వేస్తున్నారు. మరో పక్క కూలిన భవనాల శిధిలాలను కూలీలు లారీల్లోకి ఎక్కిస్తున్నారు. ఆ శబ్దాలు కర్ణ కఠోరంగా ఉన్నాయి. ఆ శబ్దాల తాకిడి కి ఎన్టీఆర్ ఘాట్ లోని సమాధి లో తీవ్ర ప్రకంపనలు మొదలైనాయి.

ప్రశాంతంగా నిద్రపోతున్న ఎన్టీఆర్ ఆత్మ ఒక్కసారి ఉలిక్కిపడింది.”లక్ష్మీ” అని బిగ్గరగా అరుస్తూ  సమాధి లో నుంచి బయటకొచ్చింది. దూరం నుంచి వినిపిస్తున్న ఆ శబ్దాలను  గమనిస్తూ ఆ దిశగా నడుచుకుంటూ కదిలింది. సచివాలయం గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళు కునికిపాట్లు పడుతున్నారు.  

ఎన్టీఆర్ లోపల కెళ్లబోతుంటే అంతలో ఒక గార్డ్ వచ్చి అడ్డం పడ్డాడు. “ఏయ్ … ఎవరు నువ్ .. ఆగు”  అన్నాడు. 

 “ధూర్తుడా … మమ్మల్నే గుర్తించలేదా ? మేము తెలుగు వల్లభులం “

 “నువ్వు ఎవరైతే నాకేంటి ? చల్ చల్ … లోపలికి వెళ్ళకూడదు” అన్నాడు గార్డ్ . 

“సరే కానీ … లోపల ఏమి జరుగుతుంది” అడిగింది ఎన్టీఆర్ ఆత్మ.

 ‘లోపల బిల్డింగ్స్ అన్ని కూల్చేస్తున్నారు.’ చెప్పాడు. 

ఆ మాటకు షాక్ అయి ఎన్టీఆర్ ఆత్మమూలిగింది. మరు క్షణమే మాయమైంది.ఒక్కసారిగా ఆత్మ మాయం కావడం తో గార్డు భయంతో బిక్క చచ్చి పరుగెత్తాడు. 

జీ బ్లాక్ ముందుకొచ్చిన ఎన్టీఆర్ ఆత్మ ఆ పరిసరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంది.  ‘నాడు కళకళ లాడిన ఈ భవనం ఇలా పాడుబడినదేమి ?’అంటూ రోదించింది.  కళ్ళ ముందు ఆనాటి జ్ఞాపకాలన్ని సినిమా రీళ్ళలా కదలాడాయి.  ‘ఎవరు దీనికి కారకులు’ అంటూ పెద్దగా కేకలేసింది ఆత్మ. జవాబు లేదు. అసలేమి  జరుగుతుందో  అర్ధం కాలేదు. 

ఇక లాభం లేదనుకుని లక్ష్మి ఇంటికి చేరుకుంది ఎన్టీఆర్ ఆత్మ.  హాల్లో కూర్చుని పెద్దగా కేక వేసింది. ఆ కేక కు బెడ్ రూమ్ లో నిద్ర పోతున్న లక్ష్మి ఉలిక్కి పడి నిద్ర లేచింది. ఈ లోగా మరోసారి కేక …. పరుగెత్తుకుంటూ హాల్లో కొచ్చింది ఆమె. ఎదురుగా కనిపించిన ఎన్టీఆర్ ని చూసి కలో ? నిజమో ? అర్ధంకాక కంగారు పడింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చేతిని గట్టిగా గిల్లుకుని కళ్ళు విప్పార్చి చూసింది. సందేహం లేదు  ఆయనే. 

“ఏమిటి లక్ష్మి గారు ? కంగారు పడుతున్నారు .”  అంది ఆత్మ నవ్వుతూ. 

ఆమె కు అర్ధమైంది అది ఎన్టీఆర్ ఆత్మే నని .

“ఏమి లేదు స్వామి… తమరు ఏమిటి ఇలా ?” అంది కొంచెం ధైర్యం తెచ్చుకుని.

 “నాకో విషయం తెలుసుకోవాలనిపించింది .. అందుకే ఇక్కడికి వచ్చాను.”

” ఏమిటి స్వామీ ఆ విషయం ?”

“మన తెలుగు సామ్రాజ్య పరిపాలనా భవనాలను కూల్చి వేస్తున్నారు ఏమి?”

“ఓహో అదా స్వామి …అక్కడ కొత్త సచివాలయం కడుతున్నారు .”

“కానీ మన జ్ఞాపకాలన్నీ శిధిలమై పోతాయి కదా. తెలుగు జాతి వారసత్వసంపద మట్టిపాలవుతుందికదా వెంటనే  అల్లుడు గారికి  ఫోన్ కలపండి. మాట్లాడతాను. ” అంది ఎన్టీఆర్ ఆత్మ.

“ఇప్పడు ఆయన అధికారంలో లేరు కదా ?ఆయన మాట ఎవరు వింటారు ? ఇక్కడి సీఎం కేసీఆర్ కి ఆయనకు అసలు పడదే. “
“ఏమిటి లక్ష్మి గారు తమరు చెప్పేది ?” 

“తమరు తనువు చాలించాక చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి స్వామీ. 99 ఎన్నికల్లో గెలిచిన అల్లుడు గారు 2004 లో 2009లో  ఓడిపోయారు స్వామి.”

 “ఎవరు ఆయన గారిని ఓడించింది ?”

“ఇంకెవరు మీ అభిమానే ! పులివెందుల రాజశేఖరుడు “

“ఓ … అతగాడా ? బాగు బాగు “

“ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది … రాష్ట్రం రెండు ముక్కలైంది. 2014లో జరిగిన ఎన్నికల్లో అల్లుడు గారే ఆంధ్రాకి సీఎం అయ్యారు. ఇక 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆయనకీ  ఓటర్లు 23 సీట్లే ఇచ్చారు . అప్పటినుంచి ఎక్కువగా ఇక్కడే  ఉంటున్నారు. ఇపుడు ఆంధ్రా ను జగన్, తెలంగాణా ను కేసీఆర్ ఏలుతున్నారు .” చెప్పింది లక్ష్మి.

“ఈ కేసీఆర్ ఎవరు ? ఆ జగన్ ఎవరు ?”

“కేసీఆర్ అంటే కే. చంద్రశేఖరరావు … సిద్ధిపేట .. అప్పట్లో తమరే టిక్కెట్ ఇచ్చారు.  కరువు మంత్రుల బృందంలో కూడా పెట్టుకున్నారు.”

“ఓ … అతగాడా ? బక్క పలుచగా ఉంటాడు కదా !”

“అవును స్వామి … ఇక జగన్ ఎవరో కాదు రాజశేఖరుని కుమారుడే .. అతగాడు మన బాలయ్య అభిమానే. అన్నట్టు జగన్ నాకు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ పదవి కూడా ఇచ్చాడు స్వామి . ” వివరించింది లక్ష్మి. 

“ఓ … చాలా బాగుంది. మరి ఆ కేసీఆర్ గారి తో మాట్లాడమంటావా ?”

“ఆయన మీమాట వింటారో ? లేదో ? గ్యారంటీ లేదు స్వామి .. ఆయన కూడా మీ టైపే .. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఒకప్పటిలా ఎవరిని ఇపుడు కలవడం లేదు”

“మరిప్పుడు ఎలా ? మా జ్ఞాపకాలన్ని మట్టి పాలు కావాల్సిందేనా ? ఆ జీ బ్లాక్ ను ఎవరూ కాపాడలేరా ? 
 నేను నామకరణం చేసిన  సర్వహిత భవనం చరిత్రలో కలసిపోవాల్సిందేనా ? హతవిధీ ”  .. అంటూ ఎన్టీఆర్ ఆత్మ మాయమైంది. 

——-  KNMURTHY

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!