Bharadwaja Rangavajhala …………………… An old generation comedian
హే రాజన్ … శృంగార వీరన్ అంటూ సిఎస్ఆర్ రెచ్చిపోయి రాజు రాజనాలను రెచ్చగొడుతుంటే … ప్రగ్గడా బాదరాయణ ప్రగ్గడా అంటూ రాజన్ పేట్రేగిపోతుంటే …చూస్తూ ఏమీ చేయలేక తనలో తనే కుమిలిపోయే వృద్ద మంత్రి వంగర గుర్తున్నారు కదా…
ఎందుకో ఈ రోజు ఆయన్ని గుర్తు చేయాలనిపించింది. మాయాబజార్ లో శాస్త్రిగా …కన్యాశుల్కంలో కరటకశాస్త్రిగా ఇలా చాలా సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో పాటు ఓ మోస్తరు పొడవైన పాత్రలతో కూడా మనల్ని అలరించిన వంగర వెంకటసుబ్బయ్య తెనాలి దగ్గరలోని సంగం జాగర్లమూడిలో పుట్టారు.
నాలుగేళ్ల వయసులో 1901లో తొలి సారి స్టేజ్ ఎక్కి ఇంద్రసేనుడి వేషం వేశారు. నాటకం పేరు చిత్రనళీయం. వంగర చిన్నతనంలోనే సంగీతం నేర్చుకున్నారు. అలాగే సంస్కృతం చదువుకున్నారు.
జ్యోతిష్యం చెప్పేవారు. అలాగే ఆయనకి బొమ్మలు గీసే అలవాటూ ఉంది. వేదం వెనక నుంచీ ముందుకీ ముందు నుంచీ వెనక్కీ చెప్పేయగల ప్రజ్ఞ ఉండేది.
చాలా మంది పెద్దలు వెంకటసుబ్బయ్యగారిని పిలిపించుకుని అలా చదివించుకునేవారు. శ్రీ రామవిలాససభ వారి నాటకాల్లోనూ, యడవల్లి నాటకాల్లోనూ వేషాలు వేస్తూనే ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ జీవించేవారు. నాటక ప్రదర్శనల్లో భాగంగా ఆయన 1935 ప్రాంతాల్లోనే దేశమంతటా తిరిగారు.
ఆ రోజుల్లో తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ నాటకం వేసేవారు. అలా రంగూన్ లో కూడా నాటకం వేశారు వంగర. సారంగధరలో రాజరాజు, కృష్ణ తులాభారంలో విదూషకుడు, హరిశ్రంద్రలో హరిశ్చంద్రుడు ఆయన రెగ్యులర్ గా చేసిన పాత్రలు. 1915లో సొంతంగా నాటక సమాజం పెట్టి చింతామణి, చిత్రనళీయం, రామదాసు నాటకాలు ఆడేవారు.
మహానటుడు స్థానం నరసింహారావుగారితో కలసి చాలా నాటకాల్లో నటించారు వంగర. 1936లో మద్రాసులో విప్రనారాయణ నాటకాన్ని ప్రదర్శించారు. అందులో శ్రీనివాసులు పాత్ర ధరించారు వంగర.
ఈ నాటక ప్రదర్శనకు అరోరా ఫిలిం కంపెనీ వారు వచ్చారు. నాటక ప్రదర్శన చూసి ఆ నటులతోనే దాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. నాటకంలో నటించిన వారితోనే సినిమాలోనూ నటింపచేశారు.
అలా వంగర సినీ ప్రవేశం జరిగిపోయింది. ఆ సినిమాలో నటించడం కోసం కలకత్తా వెళ్లారు వంగర.
ఆ తర్వాత తిరిగి మద్రాసు వచ్చాక బాలయోగిని లో అవకాశం వచ్చింది. బాలయోగిని ప్రబావం వల్ల గూడవల్లి తీసిన మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల్లో కీలక పాత్రల్లోనే నటించారు.ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదాయనకు.
షావుకారు, పెద్దమనుషులు, పల్నాటి యుద్దం, మల్లీశ్వరి, పరమానందయ్య శిష్యుల కథ, చక్రపాణి, మాయాబజార్ సినిమాల్లో జనంలో గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రల్లో కనిపించారు. వీటిలో వంగరలోని నటుడ్ని చూపించే పాత్రలు మాత్రం పెద్దమనుషులు చిత్రంలోని సిద్దాంతి, షావుకారులోని గుమస్తా పాత్రలు.
అలాగే మాయాబజార్ లో చేసిన శాస్త్రి పాత్ర కూడా. శాకాంబరీ పాకం గోంగూర లేకుండా దుర్యోధనుడికి ముద్ద దిగదు అని ఆయన అభినయించిన తీరు నభూతో అన్నట్టుంటుంది. సినిమాల్లోకి వెళ్లినా ఆయన నాటకాలను వదల్లేదు. తన దగ్గరకు వచ్చిన కుర్రాళ్లలోని నటనకు మెరుగులు దిద్దుతూ నాటకాల్లో నటింపచేసేవారు. నాటక రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్ర నాటక కళాపరిషత్తు గుడివాడలో వంగర వెంకట సుబ్బయ్యకు సన్మానం చేసింది.
అరవైల నాటికే ఆయన సినిమాలు తగ్గించేసుకున్నారు. ఆయన చివరి రోజుల్లో చేసిన సినిమాల్లో ఒకటి పరమానందయ్య శిష్యుల కథ. ఓ జర్నలిస్టు వంగర ఇంట్లో ఉండగా వెళ్లి … ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదేమిటి? అన్నారట. ఆయన అయ్యా … ప్రతి వాడూ వంగరా వంగరా అంటుంటే … వంగలేక మానేశాను అని రిప్లై ఇచ్చారట.
డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో 1976 లో ఆయన కన్నుమూశారు. వంగర అనగానే మాయాబజార్ లో రమణారెడ్డి చూపించే వంటకాలను చూసి పెదవి విరిచే సీనే గుర్తుకు వస్తుంది.