Lift……. పేరుకే హర్రర్ కానీ ఇది థ్రిల్లర్ సినిమా. గొప్ప సినిమా కాదు కానీ ఒక సారి చూడొచ్చు. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నది. తమిళ్ వెర్షన్ .. సబ్ టైటిల్స్ ఉన్నాయి. IT నిపుణుల జీవితాలపై దృష్టి పెట్టి ఈసినిమా తీశారు. కొత్త దర్శకుడు వినీత్ వరప్రసాద్ ముప్పాతిక భాగం సినిమాను రెండు పాత్రల తోనే నడిపించాడు.
తమిళంలో ఎన్నో హర్రర్ చిత్రాలు వచ్చాయి. కానీ ఈ తరహా కాన్సెప్ట్ లో రాలేదు. సినిమాలో కథ అంత లిఫ్ట్ లోను ..ఆఫీస్ భవనంలో ఉన్న దెయ్యాలదే. ఎక్కడో ఒకటి రెండు చోట్ల లీలా మాత్రంగా తప్పితే .. దెయ్యాలను ఎక్కడా చూపించకుండా దర్శకుడు కథ నడిపించాడు. ఇందులో హీరో కవిన్ .. హీరోయిన్ అమృతా అయ్యర్ ప్రధాన పాత్రధారులు.
క్లుప్తంగా కథ ఏమిటి అంటే …. గురు (కవిన్) ఒక IT ప్రొఫెషనల్. టీమ్ లీడర్ గా చెన్నైకి బదిలీ పై వస్తాడు. అక్కడ అతను HR ప్రొఫెషనల్ హరిణి (అమృత అయ్యర్)ని కలుస్తాడు. వీరికి అంతకు ముందే పరిచయం ఉంది. ప్రాజెక్ట్ పనిని పూర్తి చేయడానికి గురు ఆఫీసులో ఓవర్‌టైమ్ చేస్తాడు. ఇంటికి వెళ్ళేటపుడు లిఫ్ట్‌లో కనిపించని ఎవరో ఉన్నట్టు ఫీల్ అవుతాడు. ఆఫీస్ బిల్డింగ్ లో నుంచి బయటకు రానీయకుండా చేయడంతో షాక్ తింటాడు.
హరిణి ని కూడా ఎవరో గదిలో బంధిస్తారు. ఆ ఇద్దరు ఎలా బయట పడ్డారు ? కనిపించని దెయ్యాల రహస్యాన్ని ఎలా ఛేదించారనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. మొదటి అరగంట తర్వాత అసలు కథ మొదలవుతుంది. లాజికల్ గా ఆలోచించకుండా చూస్తే థ్రిల్ ఫీల్ అవుతారు. భయానక సన్నివేశాలు సినిమాలో ఏమీ లేవు. కథనం ఊహ కు అందకుండా సాగుతుంది.
ఆ విషయం లో దర్శకుడిని అభినందించవచ్చు. సింగల్ లొకేషన్ లోనే సినిమా కథ సాగుతుంది. హర్రర్ ఎలిమెంట్ లిఫ్ట్‌లో.. బయట కొంత మేరకు వర్క్‌అవుట్ అయ్యింది. కానీ అవన్నీ కొత్తదనం లేని సన్నివేశాలు. హర్రర్ సినిమాలకు అలవాటు పడ్డ వారికి ఆ డోస్ చాలదు. సెకండాఫ్ చివర్లో వచ్చే బ్యాక్‌స్టోరీ ప్రేక్షకులను కదిలిస్తుంది.
ప్రతిభావంతులైన ఐటీ నిపుణుల కష్టాలను, యాజమాన్యం పెట్టే ఇబ్బందులు .. వారు పడుతున్న కష్టాలను బయటకు తీసుకురావాలనే దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవచ్చు. అయితే కథనంలో కాస్త స్పీడ్ ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది. హీరో కవిన్ పాత్రలో నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పవచ్చు.
కనిపించని దెయ్యం నుంచి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిస్సహాయ వ్యక్తిగా .. భయాన్ని కళ్లలో .. ముఖ కవళికల్లో అద్భుతంగా కవిన్ ప్రదర్శించాడు.అమృత అయ్యర్ నటన కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. కొన్ని సన్నివేశాల్లో అమృత కూడా బాగా చేసింది. జోడీ సరిగ్గా కుదిరింది.
ఫోటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. కెమేరామ్యాన్ ఎస్. యువ అద్భుతమైన విజువల్స్‌తో సినిమాకు ఒక నేపథ్యాన్ని సృష్టించారు. బ్రిట్టో మైఖేల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళ్తుంది. తపస్ నాయక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. ఇది థియేటర్స్ లో చూస్తేనే ఒక ఫీల్ కలుగుతుంది.
దెయ్యాలు ఎలివేటర్‌ను మారుస్తాయా ? ఫోటోకాపీలను తీస్తాయా ? ఫోన్‌లను డిస్‌కనెక్ట్ చేస్తాయా ? పెన్రోస్ మెట్ల వంటి భ్రమను కల్పిస్తాయా ? వంటి సందేహాలు కలుగుతాయి.ఇది కనిపించని దెయ్యాల సినిమా కాబట్టి ఏదైనా సాధ్యం అనుకోని సినిమా చూడాలి. తమాషా ఏమిటంటే …. సినిమాలో గురు కానీ హరిణి కానీ దెయ్యాల తాలూకు వ్యక్తులకు ఏ హానీ చేసి ఉండరు. వాళ్ళు చేసిన ఉద్యోగాల్లోకి వీరిద్దరూ వస్తారు అంతే.
———-KNM