During the British rule….
అవును .. ఆ ఫోటో వెనుక పెద్ద కథే ఉంది. ఈ ఫోటోను విల్లోబీ వాలెస్ హూపర్ అనే ఫోటోగ్రాఫర్ తీశారు. ఈ ఫోటో 1876 నాటిది. అప్పట్లో వచ్చిన మహాకరువు ను తట్టుకోలేక,తినటానికి తిండి లేక, మల మల మాడిన ఒక కుటుంబానిది ఈ చిత్రం.ఈ ఫోటో మద్రాస్ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరంలో తీసారు.
ఇలాంటి ఫోటోలు తీయడం అనైతికమని అప్పట్లో ఆ ఫోటోగ్రాఫర్ ను విమర్శించారు.(ఇతగాడి గురించి విడిగా చెప్పుకుందాం ) ఇక ఈ కరువు గురించి చెప్పుకోవాలంటే .. నిజంగా అది భీకరమైన కరువే. 5 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలి బాధతో మరణించారని నాడు అంచనా వేశారు.1876-1879 ప్రాంతంలో ఈ మహా కరువు మద్రాస్, మైసూర్, హైదరాబాద్,బొంబాయి ప్రావిన్స్‌లను ప్రభావితం చేసింది.
అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ లోనే కలసి ఉంది. వర్షాలు లేవు ..భూములు ఎండిపోయాయి .. సాగు ఆగిపోయింది. తీవ్ర కరువు కారణంగా దక్కన్ పీఠభూమిలో పంటలే లేవు. కరువు కారణంగా ప్రాణ నష్టమే కాదు. రైతులు, కూలీలు వలస పోయారు. గ్రామాలు నిర్మానుష్యమై పోయాయి. తిండి లేక చనిపోయిన మృతదేహాల గురించి పట్టించుకునే వారే లేరు. ఫలితంగా ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటు వ్యాధులు వచ్చాయి.
తరచూ వచ్చిన కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొద్దీ సన్నకారు రైతులు, కూలీలు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలస పోయారు. ఎక్కడో అరుదుగా ఒకటి అరా చోట తప్ప ఎక్కడా పంటలు లేవు . దేశంలో ఇంత కరువు ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే .. బ్రిటిష్ సర్కార్ నిరాటంకంగా కరువు రహిత ప్రాంతాల నుంచి ఆహార ధాన్యాల ఎగుమతిని కొనసాగించింది.దీంతో ప్రజల ఇబ్బందులు మరింతగా పెరిగాయి.
ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం ఇవ్వడానికి భారతదేశం తగినంత ఆహారాన్నికలిగి ఉన్నప్పటికీ ఎగుమతులకే ప్రాధాన్యమిచ్చారు. అంతకుముందు ఒరిస్సాలో కరువు వచ్చినపుడు కూడా అలాగే చేశారు. అప్పటి బ్రిటిష్ అధికారులు మరణాల సంఖ్య తగ్గించడానికి సహాయ శిబిరాలు నిర్వహించారు. అవన్నీ సైనికుల పర్యవేక్షణలో అవి నడిచాయి. అరకొరగా సహాయం అందేది.
కాగా అంతకు ముందు 1791-95 ప్రాంతంలో డొక్కల కరువు తెలుగు వారిని గడగడలాడించింది.అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువు లేదా డొక్కల కరువు సమయంలో కోటి యాభై లక్షల మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెబుతున్నాయి. గుంటూరు ప్రాంతంలో మరణాలు ఎక్కువ గా సంభవించాయి .
అప్పట్లో కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క మనుష్యులు ఎండి పోయేవారు. శరీరంలో కండ మొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలిచేవారు. ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. చివరికి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తిని ప్రాణాలు పోగొట్టుకున్నవారు లేకపోలేదు. ఈ పరిస్థితులను అధిగమించడానికి చాలా కాలం పట్టింది.
——-KNM