Bharadwaja Rangavajhala…………………………………..
ఈనాడు సమాజ హితం అస్సలు పట్టించుకోలేదు అనే మాటను నేను అంగీకరించను అన్నారు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి.అలాగే రామోజీ వ్యాపార దృష్టి వల్లే ఈనాడు బతికింది … విలువలు అంటూ కూర్చున్న శివలెంక రాధాకృష్ణ లాంటి వాళ్లు పత్రిక మూసేసుకున్నారు.కనుక రామోజీకి వ్యాపార ఆలోచనలు ఉండడం తప్పని అన్లేం అన్నారు మూర్తిగారు.
ఇదంతా … రామోజీరావు గురించి సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ గారు రాసిన పుస్తకం “రామోజీరావు ఉన్నది ఉన్నట్టు” మీద సకలం అనే యు ట్యూబు లో ఇంటర్యూ చేస్తూ మూర్తిగారు చేసిన వ్యాఖ్యలు.నేనేదో అనుకోకుండా విన్నాను.అంతా బాగానే ఉందిగానీ … నాకేమనిపించిందంటే … పత్రికలు మూసేయడానికి వ్యాపార దృక్పధం లేకపోవడం మాత్రమే కాదు ..వ్యాపార దృక్పధం ఉండడం కూడా కారణం అవుతుంది అనేది నా అభిప్రాయం.
మూర్తిగారు ఆ మాట చెప్పుంటే బావుండేది అనిపించింది. రామోజీ తన దినపత్రిక ద్వారా నడిపించే వ్యవహారాల నుంచీ కాస్త పాఠకుల అభిప్రాయాలను మళ్లించడానికి వ్యాపార దృక్పథం నుంచే చతుర విపుల లాంటి పత్రికలు పెట్టారు. తన దగ్గర ఉన్న తనకు ఉపయోగపడే కొందరు పెద్దల్ని అకామడేట్ చేయడానికి వేదిక అవసరమైన సందర్భంలోనే ఆయన నష్టం వస్తుందని తెల్సీ విపుల చతుర లాంటివి పెట్టారు సంపాదకుడికి పూర్తి స్వేచ్చనిచ్చి నడిపారు.
ఉదయంలో ఉండగా సుబ్బారాయుడు గారు చెప్పిన విషయం …ఓ సారి విశాఖలో సిపిఐ సభలు జరిగితే ఆ సభలకు అవసరమైనవన్నీ రామోజీ గారే సమకూర్చారు. అయితే … సభల వార్త మాత్రం మొదటి పేజీలో వద్దూ మూడో పేజీలో వేయమన్నారట…అలా ఆయనకు ఓ లెక్క ఉంటుంది. వ్యాపారానికి ఇబ్బంది అనుకున్నప్పుడు అనవసరమైన సెంటిమెంట్లకు పోకుండా అక్కడితో ఆపేయడం వ్యాపారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం.
అది ఉన్నవాడే నిలబడతాడు. సోమా అనే డ్రింకు ప్రారంబించి ఆపేసినా … న్యూస్ టైమ్ అనే ఇంగ్లీషు పత్రిక పెట్టి మూసేసినా … ఇదే పద్దతిని అనుసరించారాయన. అలా చూస్తే ఎఫ్ఫుడు పత్రిక పెట్టాలి అని తెలియడమే కాదు ఎప్పుడు మూసేయాలనేది తెలిసినవాడు రామోజీరావు.
సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు సితార పెట్టారు. సినిమా వాళ్ల ప్రేక్షకుల వేదికలు మారాయి అని అనిపించినప్పుడు దాని అవసరం లేదనుకున్నప్పడు మూసేశారు.తెలుగు భాష గురించి అందరూ మాట్లాడడం ప్రారంభించిన దశలో తొంభై ఏడు ప్రాంతాల్లో హైద్రాబాద్ లో సెక్రటేరియట్ పేరు తెలుగులో ఉండాలి .. అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ తెలుగులోనే మాట్లాడాలని సి.ధర్మారావు, తిలక్ లాంటి వాళ్లు తెలుగు భాషా సమాఖ్య లాంటి సంఘాలు డిమాండ్ చేశాయి.
జనసాహితి లాంటి వామపక్ష రచయితల సంఘం కూడా తెలుగో తెలుగు అని … గోల పెట్టడం జరిగిన సందర్భంలోనే … ఈనాడు పూర్తిగా తెలుగుకు టర్న్ చేయడం జరిగింది. ఆ టైమ్ లో తెలుగు భాషను కాపాడే ఛాంపియన్ గా ఆయన అవతరించాలనుకున్నాడు. అంతే తెలుగు వెలుగు ప్రారంభించారు. దాని ఎక్స్ టెన్షన్ లో చందమామ లేని లోటు తీర్చాలని బాలభారతం మొదలెట్టారు.
అయితే పత్రిక ఏదైనా అందులో కొంత అరాచకం ఉండాలి … అది లేకపోవడం వల్లే తెలుగు వెలుగు నాకు నచ్చలేదు. బాలభారతం కూడా… చక్రపాణిలో ఉండిన లేదూ పైకి చెప్పకపోయినా కుటుంబరావులో ఉండిన ఓ తరహా అరాచకవాదం గురువు గారిలో లోపించడం వల్లే అవి వేయాల్సినంత ప్రభావాన్ని వేయ లేకపోయాయి.ఈనాడు మీదా నాది అదే విమర్శ.
చతుర …విపుల వెనకాల చలసాని ప్రసాదరావు గారున్నారు కనుక పర్లేదు… ఆయన ఉండబట్టే కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి లాంటి రచయితల నవలలు అందులో ప్రచురితమయ్యాయి. అది వేరు సంగతి .ఇందాక ఏమిటి అనుకుంటున్నామూ ఈ తెలుగు లో పడి కొట్టుకుపోయే క్రమంలో ఈనాడు తెలుగు అనే కొత్త భాషను కూడా ఆయన మార్కెట్‌కు పరిచయం చేశారు.
ఇందుకు ప్రతి తెలుగువాడూ ఆయనకు రుణపడి ఉండాలి. ఒకప్పుడు డబ్బింగ్ సిన్మా తెలుగు అనేవారు. ఇప్పుడు ఈనాడు తెలుగులో మాట్లాడతాడండీ .. అర్ధం చేసుకోవడం మన వల్ల కాదు అన్న నానుడి బయల్దేరింది. కొందరు నాలాంటి దుర్మార్గుల నుంచీ … అది లేరు సంగతి ..అలా ఆనాటి తెలుగు వాతావరణంలో తెలుగు ఛాంపియన్ కావాలనుకున్న గురువుగారు ఈ పత్రికలు ప్రారంభించేశారు …అయితే … ఇప్పుడంత తెలుగు వాతావరణం లేదు.
ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పేయాలి … మళ్లీ మర్చిపోతా … ఇలా తెలుక్కి టర్నింగ్ ఇచ్చుకోవాలనే తాపత్రయం విప్లవ పత్రికలను బ్రాహ్మణీకరించిందని నా అనుమానం … అంటే విప్లవంలో ఉన్న బ్రాహ్మలే ఎక్కువగా ఆ రోజుల్నాటి తెలుగు విప్లవాల ప్రభావానికి గురయ్యారనిపించింది నాకు …ఇది కూడా వేరు సంగతియే.
అలా ఇప్పుడంత తెలుగు వాతావరణం లేకపోవడం చేత … నాయనా … గురువుగారికి ఎందుకొచ్చిన కంచిగరుడ సేవ అనిపించింది. రూపాయి నష్టపోయినా … ఇంకెక్కడో లాభం కలిగించేదిగా ఉండాలి ఏ పనైనా అనుకునే టైపు గురువుగారు.రెంటికీ చెడ్డ రేవడి కావడం ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే టెల్గు వెల్గు బాలభారతం లతో పాటు మోమాటంగా వెబ్‌లో నడుపుతున్న చదుర విపుల సితారలను కూడా వదిలించేసుకున్నారు.
ఆయన తెలుగు వెలుగు ప్రారంభించిన రోజుల్నాటి తెలుగు వాతావరణంలోనే ఓ ఎన్ఆర్ఐ మేడం గారు ప్రభవ పత్రిక పెడదాం అని ప్రయత్నించడం.అందులో నేను ఉద్యోగిగా చేరడం లాంటి దారుణాలన్నీ గుర్తొచ్చాయి.అదే మా సూరేకాంతం గారు ఉండి ఉంటే … హమ్మ తెలుగో హమ్మ తెలుగో అనేసుండేవారు. ఇలా ఎప్పుడు పత్రిక పెట్టాలో కాదురా ఎప్పుడు తీసేయాలో తెల్సినోడే రామోజీరావు అనే నానుడీ.
ఎప్పుడు పత్రిక పెట్టాలో అప్పుడు పెట్టకపోవడం ఎప్పుడు పత్రిక మూసేయాలో అప్పుడు మూసేయకపోవడం రెండూ ఒకే తరహా జబ్బులు అనే నానుడీనూ ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి.ఈనాడు కూడా మూసేస్తారేమో అనే అనుమానం కూడా నాకు ఈ మధ్య తొలిచేస్తోంది.
నిజానికి ఈనాడు ఎంతటి ముద్ర వేసిందంటే … నాలుగేళ్ల వయసు ఉండగా మా అబ్బాయిని మా ఇంటి ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న కొట్టు దగ్గరకు పేపర్ తీసుకురారా అని పంపాను నేను బెజవాడలో ఉన్న రోజుల్లో..వాడెళ్లి ఈనాడు తెచ్చాడు. ఈనాడేంట్రా … జ్యోతి అడక్కపోయావా అన్నా.
అప్పుడు వాడు నా వేపు సీరియస్ గా చూసి పేపర్ అంటే ఈనాడే అన్నాడు. సర్లే అలాక్కానీ అన్నా …అలాంటి ఈనాడు కూడా అనవసరం అని ఏనాడు అనిపించినా ఈనాటితో సరి అనేయగల మనో నిబ్బరం ఆయన సొత్తు.అంచేత … పత్రిక పెట్టడానికీ నడపడానికీ మాత్రమే కాదు … మూయడానికీ వ్యాపార తెలివి ఉండాలి.
అంచేత ఈనాడు మీద మమకారం వదిలించుకోండి పాఠకులారా … లేకపోతే మరో ఆప్షన్ ఏమంటే ఆర్రూపాయల ఈనాడును వందకు కొని ఆ మిగిలిన డబ్బును గురువుగారి అక్కౌంటుకు పంపండి అనైనా అంటే కొంత కాలం నడిపే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇందిరాగాంధీ హత్య జరిగిన మర్నాడు ఈనాడు ఫ్రంట్ పేజ్ చాలా గొప్ప లెవెల్లో డిజైన్ చేయించేస్తున్నారట ఎడిటోరియల్ టీమ్ .. అప్పుడు రంగంలో దిగిన రామోజీ గారు … తన దగ్గరున్న ఇందిరాగాంధీ అద్భుతమైన ఫొటో ఒకటిచ్చి … ఫుల్ పేజ్ ఇంకేం రాయద్దు … ఈ ఫొటో వేసి కింద శ్రద్దాంజలి అన్రాసి అచ్చేయండి … అన్నారట.
ఆయన ఎందుకామాటన్నారో మర్నాడు అర్ధమైంది జనాలకి .. తెలంగాణలో ఓ పద్దతుంది … ఆంధ్రలో తక్కువ … ఎవరైనా పోతే వారి ఫొటో చిన్న కర్రకు పెట్టి ఆ ఏరియాలో నాలుగు సెంటర్లలో పాతేస్తారు.ఆ పద్దతిన … తెల్లారి పొద్దున్న ప్రతి సెంటర్లోనూ చిన్న చిన్న కర్రలకు ఈనాడు పేపర్ ఇందిరమ్మకు శ్రద్దాంజలి కాయితం వెలిసింది.
అంటే అన్ని వేల కాపీలు రామోజీ ఆలోచన వల్లే అమ్ముడయ్యాయి. అది ఆయన విశ్వరూపం … మరి ఆయన గురించి మరింకెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు తెల్సుకోవాలంటే చదవండి మూడొందలుట … కొంత డిస్కౌంటు కూడా ఉంటుందేమో నాకు తెలీదు … “రామోజీరావు … ఉన్నది ఉన్నట్టు “… చాలా కష్టపడి రాశారు చక్రధర్ గోవిందరాజు…