Chandramukhi entertained many ……………………….
సూపర్ హిట్ మూవీ “చంద్రముఖి” ని అయిదు భాషల్లో నిర్మించారు. అయిదు చోట్లా హిట్ అయింది. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. అయిదు భాషల్లో చంద్రముఖి పాత్రను వేర్వేరు తారలు పోషించారు. తెలుగు తమిళ్ చిత్రాల్లో జ్యోతిక చేసింది. మొదటగా ఈ సినిమాను తీసింది మలయాళంలో.
ఇందులో చంద్రముఖి పాత్ర పేరు నాగవల్లి. తెలుగు, తమిళ భాషల్లో నాగవల్లి ని చంద్రముఖి గా మార్చారు. మలయాళ చిత్రంలో నాగవల్లి .. గంగ పాత్రను పోషించింది ప్రముఖ నటి,నర్తకి శోభన. ఆ పాత్రకు శోభన నూరు శాతం న్యాయం చేసింది. మలయాళంలో ఈ సినిమా పేరు మణిచిత్రతాజు.
ఈ చిత్రంలో గంగ భర్తగా సురేశ్ గోపి, భర్త స్నేహితుడిగా మోహన్ లాల్ నటించారు. మోహన్ లాల్ సరసన హీరోయిన్ గా వినయ ప్రకాష్ నటించారు.మలయాళంలో మసాలా లేకుండా ఈ సినిమాను సాదా సీదాగానే తీశారు. కేరళలో జరిగిన యదార్ధ గాధనే తెర కెక్కించారు. ఈ కథను మధు ముట్టం అనే రచయిత రాయగా దర్శకుడు ఫాజిల్ మెరుగులు దిద్దారు.
ఆ తర్వాత ఫాజిల్ సినిమాపై అంత శ్రద్ధ చూపకపోవడంతో అసిస్టెంట్ దర్శకుడిగా చేస్తోన్న ప్రియదర్శన్ మొత్తం సినిమాను తీశారు. 1993 లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అద్భుతమైన కలెక్షన్ల ను రాబట్టింది.
అప్పట్లోనే ఈ సినిమాను ‘ఆత్మరాగం’ పేరిట తెలుగులో డబ్ చేశారు.. కానీ అది ఎందుకో విడుదల కాలేదు. ఈ సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేసిన ప్రియదర్శన్, సిద్ధికి, లాల్ తర్వాత కాలంలో మంచి అవకాశాలు దొరికి పెద్ద డైరెక్టర్లు అయ్యారు. గంగ , నాగవల్లి పాత్రల్లో అసమాన నటనతో ఆకట్టుకున్నశోభన సినిమా ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది.
జాతీయ స్థాయిలో ఆమెకు ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. కీలక సన్నివేశాల్లో నాగవల్లి గా, గంగ గా శోభన అద్భుతమైన నటనను ప్రదర్శించింది. కేరళలో అధికశాతం ప్రేక్షకులు చదువుకున్నవారే. ఆత్మలు,దెయ్యాలను అంతగా నమ్మరు. అందుకే హారర్ జోనర్ లో కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను నిర్మించారు.
ఇక రీమేక్ కి వెళ్ళేసరికి హారర్ టైపు చిత్రంగా మారిపోయింది.కొంత మేరకు భయపెట్టే విధంగా తీశారు. హీరో కి ప్రాధాన్యత ఇచ్చి పక్కా కమర్షియల్ గా నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో రజనీ కాంత్ హీరో అనగానే ఇతర హంగులన్నీ వచ్చి చేరాయి. మూల కథ కి స్వల్ప మార్పులు చేశారు. జ్యోతిక నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు.
శోభనకు లాగా జ్యోతికకు పెద్ద కళ్ళు ఉండటం ఆ క్యారెక్టర్ కు ప్లస్ అయింది. కన్నడం లో నాగవల్లి గా సౌందర్య నటించారు. హిందీలో ఈ పాత్రను విద్యాబాలన్ చేశారు. బెంగాలీలో అనుచౌదరీ పోషించారు. కన్నడ లో ‘ఆప్తమిత్ర’, హిందీలో ‘భూల్ భులయ్యా’ గా, బెంగాలీలో ‘రాజమహల్’ పేర్లతో నిర్మితమైంది.
‘ఆప్తమిత్ర’ కి సీక్వెల్ గా తెలుగులో తీసిన ‘నాగవల్లి’లో అనుష్క చంద్రముఖిగా నటించింది. కన్నడ సీక్వెల్ లో విమలారామన్ చేశారు. మొత్తం మీద చంద్రముఖి కథ అన్ని భాషల ప్రేక్షకులను అలరించి 500 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని సమాచారం. యూట్యూబ్ లో అన్ని సినిమాలు ఉన్నాయి ఆసక్తిగలవారు చూడవచ్చు.
————-KNM