క్రైమ్ కామెడీ మూవీ .. ఫ్యామిలీ తో చూడొచ్చు!!

Sharing is Caring...

A fun movie to watch……..

‘కాన్ సిటీ’ (Con City) తమిళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా. హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ దాస్, అన్నా బెన్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం Netflix  లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

కథాంశం 
శరవణ (అర్జున్ దాస్), మిత్ర (అన్నా బెన్), జాకీ (యోగి బాబు), జానకి (వడివుక్కరసి) అందరూ కలిసి కర్ణాటకలోని ముల్కి అనే ప్రాంతంలో ఒక హోటల్ నడుపుతూ సాదాసీదా కుటుంబంలా జీవిస్తుంటారు. కానీ నిజానికి వీరంతా గతంలో నేరాలు చేసి పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్న మోసగాళ్ల ముఠా. ఒకరితో ఒకరికి రక్తం పంచుకున్న బంధం లేకపోయినా ఒక ఫ్యామిలీలా కలిసిపోతారు.

అయితే, వీరి సంరక్షణలో ఉన్న ఒక చిన్న అబ్బాయిని (జీవా) ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ కిడ్నాప్ చేయడంతో వీరి ప్రశాంతమైన జీవితం తలకిందులవుతుంది. ఆ అబ్బాయిని ప్రాణాలతో కాపాడుకోవాలంటే ఈ ముఠా తమ పాత బుద్ధులను బయటకు తీసి, ఒక భారీ మోసానికి  ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వారు ఆ కిడ్నాపర్ల నుండి బాబును ఎలా రక్షించారు? వారి చివరి ప్లాన్ సక్సెస్ అయిందా లేదా? అనేదే ఈ సినిమా కథ.

లీడ్ రోల్స్ చేసిన అర్జున్ దాస్, అన్నా బెన్ తమ పాత్రల్లో అద్భుతంగా ఇమిడిపోయారు. ముఖ్యంగా అర్జున్ దాస్ తన బేస్ వాయిస్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, అన్నా బెన్ నటన సినిమాకు ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చింది. మోసగాడు జాకీ పాత్రలో యోగి బాబు తన మార్క్ టైమింగ్‌తో మంచి కామెడీని పంచారు. 

సీనియర్ నటి వడివుక్కరసి కి మంచి క్యారెక్టర్ పడింది. జీవ గా చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అఖిలన్ బాగా చేసాడు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నందగోపాల్ జీవించారు. 

హీరో అర్జున్ దాస్, సీనియర్ నటుడు విటివి గణేష్ మధ్య వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ సీన్లు బాగుంటాయి. యోగి బాబు, సీనియర్ నటి వడివుక్కరసి మధ్య సాగే కామెడీ సంభాషణలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. వారిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సినిమా ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, కిడ్నాప్ డ్రామా కథను ఒక్కసారిగా వేగవంతం చేసి సెకండ్ హాఫ్‌పై  ఆసక్తిని పెంచుతుంది. ఒక ఫేక్ న్యూస్ (అబద్ధపు వార్త)ను ప్రచురింపజేయడం కోసం ఈ కాన్ ఆర్టిస్టుల ఫ్యామిలీ అంతా కలిసి ఒక జర్నలిస్ట్‌ను 15 నిమిషాల పాటు డైవర్ట్ చేసే ప్లాన్ చాలా తెలివిగా, ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

కిడ్నాప్ అయిన బాబుకు సంబంధించిన ఒక ఊహించని సర్ప్రైజ్ ఎలిమెంట్, క్లైమాక్స్‌లో వచ్చే ‘దళపతి’ విజయ్ రిఫరెన్స్ సీన్ మాస్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తుంది.ఇదొక కాన్ గేమ్ (మోసాల చుట్టూ తిరిగే) సినిమా అయినప్పటికీ, ఇందులో పాత్రలు చేసే మోసాలు వాటి వెనుక ఉన్న ట్రిక్స్ చాలా పాతవిగా, సులభంగా ఊహించేలా ఉంటాయి.

సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 31 నిమిషాలు ఉండటం వల్ల, కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి.సాధారణ క్రైమ్ సినిమాల్లా కాకుండా సినిమాటోగ్రాఫర్అరవింద్ విశ్వనాథన్ ఈ సినిమా విజువల్స్‌ను చాలా బ్రైట్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించారు.

సంగీత దర్శకుడు షాన్ రోల్డన్ అందించిన బిజీఎమ్ ఈ సినిమాకు పెద్ద బలం. ‘కాన్ సిటీ’ ఒక అద్భుతమైన మాస్టర్‌పీస్ కాకపోయినప్పటికీ ఒకసారి కుటుంబంతో కలసి సరదాగా చూడదగ్గ క్రైమ్ కామెడీ సినిమా. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!