Psycho Killer Story…….
‘స్టీఫెన్’ (Stephen) 2025 నాటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ..దర్శకుడు మిథున్ బాలాజీ దర్శకత్వంలో గోమతి శంకర్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం సైకో కిల్లర్ల మనస్తత్వాల చుట్టూ తిరుగుతుంది.
కథ ఏమిటంటే ?
స్టీఫెన్ జెబరాజ్ (గోమతి శంకర్) స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తాను తొమ్మిది మంది అమ్మాయిలను హత్య చేశానని లొంగిపోతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ మైఖేల్ (మైఖేల్ తంగదురై), క్రిమినల్ సైకాలజిస్ట్ సీమ (స్మృతి వెంకట్) రంగంలోకి దిగుతారు.
స్టీఫెన్ ఘోరమైన చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, తల్లిదండ్రుల వేధింపులే అతనిని సైకో కిల్లర్‌గా మార్చాయా? లేక లొంగిపోవడం వెనుక అతని మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందా? అనేదే సినిమా కథాంశం.
ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన గోమతి శంకర్, స్టీఫెన్ అనే ఒక విచిత్రమైన, భయానక సైకో కిల్లర్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. అతని నటన చిత్రానికి అతిపెద్ద బలం.సైకో కిల్లర్ స్టీఫెన్‌గా ఆయన పండించిన హావభావాలు, బాడీ లాంగ్వేజ్, సంభాషణలు పలికించిన తీరు బాగున్నాయి.
ఒక మానసిక రోగి మానసిక స్థితిని ఆయన చాలా పకడ్బందీగా స్క్రీన్‌పై చూపించారు. తల్లి పాత్రలో నటించిన విజయశ్రీ బాగా చేశారు. తండ్రిగా కుబేరన్ మెప్పించారు. ఇతర పాత్రధారులు వారి పరిధి మేరకు నటించారు.
సినిమా కేవలం మర్డర్స్ చుట్టూ తిరగకుండా, చైల్డ్‌హుడ్ ట్రామా (చిన్ననాటి చేదు జ్ఞాపకాలు) మానసిక ఆరోగ్య సమస్యలు ఒక వ్యక్తిని ఎంతటి ఘోరానికి పురికొల్పుతాయి అనే విషయాన్ని లోతుగా విశ్లేషించింది. ఈ సైకలాజికల్ అప్రోచ్ సినిమాకు ఒక ప్రత్యేకతను తెచ్చింది.
సినిమా ప్రారంభం, ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా సాగుతాయి. స్టీఫెన్ అనే క్యారెక్టర్ అసలు ఎవరు? అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? అనే సస్పెన్స్‌ను దర్శకుడు మొదటి భాగంలో చాలా ఆసక్తికరంగా మెయింటైన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి.
సైకో కిల్లర్ అనగానే చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నాడు అనే రొటీన్ ఫార్ములా బ్యాక్‌స్టోరీని ఇక్కడ కూడా ఉపయోగించడం కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమా చివరలో వచ్చే ట్విస్టులు,కోర్టు డ్రామా, జైలుకు సంబంధించిన చివరి అరగంట ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా,వినూత్నంగా డిజైన్ చేశారు.
ఒక హంతకుడి మనస్తత్వాన్ని విశ్లేషించే విధానం, స్క్రీన్‌ప్లేలో చూపించిన కొన్ని సైకలాజికల్ అంశాలు థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని చోట్ల చాలా సాధారణంగా అనిపిస్తాయి. మరింత అనుభవజ్ఞులైన నటీనటులు ఉండి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది.
గోకుల్ కృష్ణ / ఎన్.ఎస్. ముల్లై ల కెమెరా పనితనం బాగుంది.సంగీత దర్శకుడు రాఘవ్ రాయన్ ఈ సినిమాకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా మూడ్‌ను చాలా వరకు కాపాడింది . స్టీఫెన్ మానసిక స్థితిని, అతనిలోని క్రూరత్వాన్ని ఎలివేట్ చేయడంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మంచి పాత్ర పోషించింది.
‘స్టీఫెన్’ విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్. సైకో కిల్లర్ సినిమాలను, క్లైమాక్స్ ట్విస్టులను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్. సాధారణ ప్రేక్షకులు కొన్ని సాగదీత సీన్ల వల్ల కొంత అసహనానికి గురవ్వచ్చు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు వెర్షన్ తో అందుబాటులో ఉంది.

