మాయదారి కరోనా రావడంతో కరచాలనమ్ అనేది బూతుమాట అయిపోయి, మనిషిని మనిషి కరస్పర్శతో పలకరించుకోవడం రూపుమాసిపోయింది.నిజానికి కరచాలనమ్ అనేది పాశ్చాత్య వికృత సంప్రదాయం కాదు. రెండు చేతులు జోడించి నమస్కరించడమే భారతీయ సంప్రదాయం కాదు.
అన్నట్టు.. కరచాలనమ్ పేరిట తెలుగులో ఒక కవితా సంపుటి కూడా వుంది. ఎవరు రాశారో గుర్తులేదు. అలాగే స్పర్శ పేరిట మరో కవితా సంపుటి వుంది. దానిని గౌస్ రాసిన గుర్తు.కరచాలనం ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం వున్నందున, పరస్పర స్పర్శను తాత్కాలికంగా విరమించుకోవడం, తోటి మనుషులకు వీలైనంత దూరంగా వుండడం అనివార్యత కావొచ్చు. కానీ అదే అంతిమ పరిష్కారం కాకపోవచ్చు.
కొంత వెతికితే నాకు తెలిసిన విషయాలు: కరచాలనం అనేది బహుశా ఏడెనిమిది వందల ఏళ్లనాటి ఐరోపా సంప్రదాయం. వివిధ శత్రుదేశాల రాజులు, సైన్యాధికారులు, యోధులు కలుసుకున్నప్పుడు కరచాలనం చేయడం ద్వారా.. తాను నిరాయుధుడిని అని, స్నేహహస్తం చాస్తున్నానని చెప్పడానికి సంకేతంగా కరచాలనం నిలిచింది. చేతులు పట్టుకుని ఊపడం ద్వారా.. దుస్తుల మాటున ఏమైనా చురకత్తులు దాగివుంటే అవి బయటపడడానికి అవకాశం వుంటుంది. రెండొందల ఏళ్ల క్రితం నాటికి కరచాలనం ఎలా వుండాలి, ఆ స్పర్శ ప్రభావం మనిషిపై ఎలా వుంటుందనే దానిపై చాలా అధ్యయనాలు కూడా జరిగాయి.
భారతీయుల కరచాలన సంప్రదాయం పూర్తిగా ఐరోపా దేశాలనుంచి దిగుమతి అయినది అయివుండదు.
నామటుకు నేను నా అనుభవం చెబుతాను. ఏదన్నా తలనొప్పి, కాలునొప్పి వున్నప్పుడు.. నా ఒడిలోకి నేనే సొమ్మసిల్లి, నా పుండుకు నేనే మందు రాసుకుని, నా నొప్పికి నేనే అమృతాంజనం రాసుకున్నప్పుడు కలిగే ఊరట, ఉపశమనం, రోగలక్షణం నివారణ పదిశాతమే వుంటుంది. కానీ అదే ఎవరిదైనా కరస్పర్శ తాకినప్పుడు నయమయ్యే లక్షణం అనేక రెట్లు.. కనీసం ఐదారు రెట్లు పెరుగుతుంది. చేతులు జోడించిన నమస్కారం మాత్రమే భారతీయ సంప్రదాయం అని వాదించేవారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తోటి మనిషి కరస్పర్శ ద్వారా మనిషికి, మనిషికి మధ్య అయస్కాంత విద్యుత్ ప్రవాహాలు వుంటాయి. ఇది ఇరువురికీ ఆరోగ్యకరమైనదే.
ఇక ఆలింగనం సంగతి. ఆలింగనం అనేది ఆలుమగల మధ్యనే వుండనక్కర్లేదు. ఆత్మీయ స్త్రీల మధ్య, ఆత్మీయ పురుషుల మధ్య కూడా ఆలింగనాలు వుంటాయి. అవి కూడా అయస్కాంత విద్యుత్ తరంగాలను ప్రసరింపచేస్తాయి.అంతెందుకు.. లంకలో సీతమ్మవారి జాడ తెలుసుకుని వచ్చి, వివరాలు అందించిన హనుమంతుడిని శ్రీరాముడు గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ స్పర్శ ఇరువురికీ అనిర్వచనీయమైనది. చెక్కుచెదరని బంధాన్ని ఏర్పరచింది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. కరోనా కష్టకాలంలో కరస్పర్శలు, ఆలింగనాలకు దూరంగా వుండండి. తప్పులేదు. కానీ.. అవి ఎల్లకాలం తప్పే, ఇదే శాశ్వత సత్యమనే భ్రమల్లో వుండడం శ్రేయస్కరం కాదు.
అసలే కరోనా.. మనుషులకు, మనుషులకు మధ్య అనేక దూరాలను పెంచింది. అనేక అంతరాలను పెంచింది. ఆరోగ్యకరమైన దగ్గరితనాన్ని దూరం చేసి, అనేక మందిని మానసిక రోగులుగా మలుస్తున్నది. దీనిని శాశ్వతం కాకుండా కాపాడుకోవడం కూడా తోటి సమాజంలోని తోటి మనుషులుగా మన బాధ్యత.
మనం కరోనా తరుముతున్న తోడేళ్లం కాదు, తోడేళ్లు తరుముతున్న కరోనాలం కాదు.. మనుషులం.
—— Vasireddy Venugopal