How did the superstar face the series of failures?………………
సూపర్ స్టార్ కృష్ణ 1966 నుంచి 1974 వరకు మూడు షిఫ్ట్ లలో పని చేసే వారు. ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ 1975 లో ఒక్క సినిమా కూడా ఆయన చేతిలో లేదు.1974, మే 1 న ‘అల్లూరి సీతారామరాజు’ రిలీజయింది. సూపర్ స్టార్ ఊహించినట్టుగానే సీతారామరాజు అఖండ విజయం సాధించింది,
కొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ నటించిన 12 సినిమాలు విడుదలయ్యాయి. అన్నీఫెయిల్ అయ్యాయి. ప్రజాదరణ పొందలేకపోయాయి. సీతారామరాజు తర్వాత విడుదల అయిన మనుషులు మట్టిబొమ్మలు యావరేజ్ గా ఆడింది. ఆ తరువాత వరుసగా ‘రాధమ్మ పెళ్లి’, ‘గౌరి’, ఆడంబరాలు అనుబంధాలు’, ‘దీర్ఘసుమంగళి ‘, ‘ఇంటింటి కథ’, ‘ధనవంతులు గుణవంతులు’, ‘సత్యానికి సంకెళ్లు’, ‘దేవదాసు’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
వీటిలో ‘రాధమ్మ పెళ్లి’, ‘దీర్ఘసుమంగళి ‘ మంచి సినిమాలు అని సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా కూడా చెప్పుకోదగిన స్థాయి లో ఆడలేదు. ‘దేవదాసు’ కూడా ఆదరణ పొందకపోవడం తో సూపర్ స్టార్ చాలా అప్సెట్ అయ్యారు. ఆ సినిమా విడుదల సమయంలో అక్కినేని తాను నటించిన దేవదాసును విడుదల చేయించడం కూడా కొత్త దేవదాసు ను దెబ్బకొట్టింది.
దేవదాసు తర్వాత ‘అభిమానవతి’, ‘కొత్తకాపురం’, ‘సౌభాగ్యవతి’, ‘చీకటివెలుగులు’, ‘రక్త సంబంధాలు’, ‘సంతానం సౌభాగ్యం’, ‘గాజుల క్రిష్ణయ్య ‘, ‘దేవుడులాంటి మనిషి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ ఓ మాదిరిగా ఆడాయి. ప్లాప్ అయితే కాదు. ఈ క్రమంలోనే ఆయన తో సినిమా తీయడానికి ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. హీరో కృష్ణ నట జీవితంలో ఇదొక విచిత్ర మైన పరిస్థితి.
అల్లూరి సీతా రామరాజు హ్యాంగోవర్ ఈ పరిణామాలకు దారితీయడం పట్ల కృష్ణ కూడా ఆశ్చర్య పోయారు. ఇలా జరగవచ్చని విజయా చక్రపాణి ముందే చెప్పారు. హీరో కృష్ణ తండ్రి వీర రాఘవయ్య చౌదరి చక్రపాణి ఇద్దరూ స్నేహితులు. సూపర్ స్టార్ మంచి చెడ్డలు ఆయన కూడా గమనిస్తుండే వారు. చక్రపాణితో కృష్ణకు సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే సీతారామరాజు సినిమాను చక్రపాణి కి చూపించారు.
సినిమా చూసిన చక్రపాణి ఏమీ చెప్పకుండా రేపు కలిసినపుడు చెబుతాను అని వెళ్లిపోయారట. మర్నాడు కృష్ణ చక్రపాణి దగ్గరకి వెళ్లారు. సినిమా చూసి ఏమీ చెప్పలేదు అని ఆయనను అడిగారు. అపుడు చక్రపాణి “నీతో ఎంతమంది ఇప్పుడు ఎన్ని సినిమాలు తీస్తున్నారు ” అని అడిగారు.
కృష్ణ “ఒక ఏడు ఎనిమిది మంది తీస్తున్నారు, ఇంకో ఏడూ ఎనిమిది మంది తీయడానికి రెడీగా ఉన్నారు” అని చెప్పారు. దానికి చక్రపాణి “వాళ్ళందరి పని అయిపోయినట్టే.. ఆ నిర్మాతలు బాగా దెబ్బతింటారయ్యా” అని కూల్ గా అన్నారట. ఆ మాటకు కృష్ణ షాక్ తిన్నారు.
‘ అదేంటి సినిమా బాగోలేదా’ అన్నారు కంగారుగా. “సినిమా బాగుంది .. బాగుండటం అంటే అలా ఇలా కాదు, బ్రహ్మాండంగా ఉంది.. సీతారామరాజు లాంటి గొప్ప పాత్రలో నటించిన నిన్ను రాబోయే రెండు మూడేళ్ళ వరకు వేరే పాత్రలో ప్రేక్షకులు చూడలేరు.. సీతారామరాజు ఇంపాక్ట్ అంతలా ఉంటుంది” అని చక్రపాణి చెప్పారు.
ఆయన చెప్పింది నిజమైంది. అపుడే సూపర్ స్టార్ పని అయిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఆ సమయంలో సూపర్ స్టార్ ఏ మాత్రం నిరాశ పడకుండా తన సొంత బ్యానర్ లో పాడిపంటలు సినిమా తీసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.