బెజవాడ మ్యూజింగ్స్!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………………………….

తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది.

అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన రామభజన మందిరమొకటి వెలిసిందో లేదోగానీ…సినిమా హాలు మాత్రం వెలిసింది. ఈ సినిమా హాలు వాళ్లు ఆడించడంతో ఆగలేదు.  సినిమాలు తీసేదాకా వెళ్లారు. అదీ ఇవాళ్టి కథ.

మారుతీ యజమాని పోతిన శ్రీనివాసరావు గారికి మొదట్నించి నాటకాలంటే ఇంట్రస్టు. 1913లో ఫాల్కే తీసిన రాజా హరిశ్చంద్ర ఆయన్ని సినిమాల వైపుకు తిప్పింది. మూకీ సినిమాలు ఊళ్లల్లో ఆడించేవారు.  ఆ తర్వాత ఎనిమిదేళ్లకు 1921లొ విజయవాడలో పర్మినెంట్ థియేటర్ కట్టారు.

తొలి భారతీయ టాకీ అలం అరా విడుదలైంది 1931లో. తెలుగు టాకీ భక్త ప్రహ్లాద 1932లో విడుదలైంది. అప్పటి వరకు మూకీ సినిమాలే ఆడేవారు. నెమ్మదిగా చమ్రియా వారితో కలసి నిర్మాణ రంగంలోకి దూకారు శ్రీనివాసరావు. శాంతి నివాసం, వీరాభిమన్యు, గుడిగంటలు, రక్తసంబంధం లాంటి సినిమాలు తీశారు.

వీరికి తోడు రామాటాకీసు వ్యవస్థాపకులు అశ్వర్ధనారాయణ కూడా సినిమా నిర్మాణ రంగంలోకి వెళ్లారు. ఆయన ఒక దశలో పోతిన శ్రీనివాసరావు గారు తదితరులతో కల్సి సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు.గూఢచారి 116 తో మొదలెట్టి దొంగలకు దొంగ, దొంగల వేట, దొంగలు బాబోయ్ దొంగలు, భలే దొంగలు ఇట్టా దొంగ సినిమాలు తీసిన నిర్మాత డూండీ సాక్షాత్తు శ్రీనివాసరావు గారి కుమారుడే.

అయితే డూండీ గారి దొంగ సినిమాలు ఎక్కువగా లక్ష్మీ టాకీసులో మేనకా లోనూ విడుదలయ్యేవి … దొంగలు బాబోయ్ దొంగలు మాత్రం జైహింద్ లో వచ్చింది.తొలి రోజుల్లో పోతిన వారితో కల్సి సినిమాలు తీసిన సుందర్ లాల్ నహతా తర్వాత రోజుల్లో శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్ మీద కుమారుడు శ్రీకాంత్ నహతా నిర్మాతగా సినిమాలు తీసేవారు. ఏజంట్ గోపీ , రహస్యగూఢచారి , గిరిజా కళ్యాణం తదితర చిత్రాలు వీరు తీసినవే. వీరి బ్యానర్ లో పర్మినెంట్ డైరక్టర్ కె.ఎస్.ఆర్ .దాస్ .. హీరోయిన్ జయప్రద. ఫైనల్ గా శ్రీకాంత్ నహతానే జయప్రద పెళ్లాడిందనుకోండి.

తెలుగులో టాకీ రావాలని కలలు కన్నవారిలో మారుతీ టాకీసు శ్రీనివాసరావుగారే కాదు…పూర్ణా మంగరాజుగారు కూడా ఉన్నారు. 1929లో విశాఖపట్నంలో పూర్ణాటాకీసు కట్టించారు మంగరాజు. ఆయనే విజయవాడ నుంచి పూర్ణా పిక్చర్స్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ నిర్వహించేవారు.ఆయన పిల్లలు ఊర్వశీ కాంప్లెక్స్ కట్టారు. కొన్ని చిత్రాలూ నిర్మించారు. మంగ రాజు ప్రోత్సాహంతోనే త్యాగయ్య తీసానని నాగయ్య తరచు చెప్పేవారు.

తొలినాటి సినిమా థియేటర్ ఓనర్లందరూ దాదాపు సినిమా నిర్మాణం కూడా చేశారు. టాకీలు ప్రారంభమయ్యాక నలభై దశకం ప్రారంభంలో వచ్చిన విజయవాడ లక్ష్మీటాకీసు యజమానులు కూడా జలరుహ, ఎస్.విఎస్ బ్యానర్ల మీద సినిమాలు తీశారు.జైహింద్ సినిమా టాకీసుకు చెందిన దోనేపూడి కృష్ణమూర్తి నిర్మాతే.

1921 నుంచి ప్రారంభించి 1925 వరకు తెలుగునాట చాలా ప్రాంతాల్లో సినిమా హాళ్లు వెలిశాయి. బందరు లో 1925లో మినర్వాటాకీసు వచ్చింది. పినపాల దాసు గారు దాని యజమాని. థియేటర్ తో పాటు సినిమా నిర్మాణ వ్యవహారాల్లో కూడా ఆయన పాల్గొనేవారు. ఆయన మద్రాసులో వేల్ స్టూడియో కట్టి  మరీ సినిమాలు తీశారు. ఆయన స్టూడియో ఉందనే ధీమాతోనే గూడవల్లి సినీనిర్మాణం ప్రారంభించారు. ప్రముఖ నటి శాంతకుమారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా దాసుగారిదే.

ఇక అలంకార్ థియేటర్ యజమానులైన నవయుగ శ్రీనివాసరావుగారు దుక్కిపాటి వారి అన్నపూర్ణా పిక్చర్స్ లో భాగస్వామిగా ఉండేవారు. శ్రీనివాసరావుగారి అబ్బాయి మాత్రం ఆత్మీయులు తీశారు. అదే సంస్ధకు చెందిన పర్వతనేని శశిభూషణ్, గుళ్లపల్లి దుర్గా ప్రసాదరావులు మాత్రం సారధీ బ్యానర్ మీద అన్నదమ్ముల సవాల్, రాధాకళ్యాణం, పెళ్లిచూపులు ఇలా కొన్ని చిత్రాలు తీశారు.

డెబ్బై దశకంలో విజయవాడ లక్ష్మీటాకీస్ ఎదుట వెలిసిన ఎ.సి.సినిమా హాలు అప్సరా యజమానులు కూడా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. కృష్ణ హీరోగా బ్రహ్మాస్త్రం తదితర సినిమాలు తీశారు. పై  ఫొటోలో క‌నిపిస్తున్న‌ది బెజ‌వాడ రామాటాకీసు. ఒకానొక పాతెస్ట్ టాకీసు. దీంట్లో నేను చాలా సినిమాలు చూసి ఉన్నాను. దాని ప‌క్క‌గా క‌నిపిస్తున్న తెల్ల సినిమా హాలు .. ఎన్టీఆర్ గారి క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి.ఆ సినిమాహాలు ప్ర‌త్యేకత ఏమిటంటే … డ‌బుల్ బాల్క‌నీ . ఇప్పుడొక బాల్క‌నీ మూసేశారు జ‌నం లేక‌… లిఫ్ట్ లేదు … అంత పైకి మెట్ల‌మీంచీ ఎక్కుతూ పోవాలంటే దూల‌తీరిపోయేది.

ఈ మ‌ధ్య అందులో ఎన్టీఆర్ న‌టించిన బొబ్బిలిపులి సినిమా చూశా… ప‌ర్లేదు….అదే కాంపౌండ్ లో మ‌రో హాలు క‌ప‌ర్ధి ఉంటుంది. అది ఏ సి హాలు. అంతకు ముందు అది పద్మావతి పేరుతో కొంత కాలం నాన్ ఏసీ థియేటర్ గా నడిచింది. జనం ఏసీలకు అలవాటు పడిపోయారని గమనించి దాన్ని మోడ్రన్ చేసి కపర్ది అని పేరెట్టారు.

ఎన్టీఆర్ కుటుంబం భాగాలు పంచుకున్న‌ప్పుడు ఈ విజ‌య‌వాడ సినిమా హాళ్లు  త్రివిక్ర‌మ‌రావు గారి చేతికి వ‌చ్చాయి. క‌నుక ఇది ఎన్ఎటి వారి హాలుగా చెప్పుకోవ‌చ్చు.ఈ హాలు మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే … జ‌నం హాల్లోకి వ‌చ్చాక తెర లెగ‌వ‌గానే శ్రీ వేంక‌టేశ్వ‌ర సుప్ర‌భాతం .. సీను .. శ్రీ వేంక‌టేశ్వ‌ర మ‌హ‌త్యం చిత్రంలో క‌నిపించేదాన్ని ప్ర‌ద‌ర్శించి గానీ సినిమా మొద‌లెట్ట‌రు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!