ఒకే వ్యాన్ లో ఆయనతో 16 గంటలు !

Sharing is Caring...

Mnr M …………………………

His style is different……………………………………………………

సరిగ్గా మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన. రాత్రి 10 గంటలకు నా ఫోన్ కి ఓ మెసేజ్ వచ్చింది. రేపు మీరు ఉదయం అయిదు గంటలకి రెడీ అవ్వాలి. మనం అంతా కలసి ఉదయం అయిదింటికే సింహాచలం అప్పన్నను దర్శించుకుంటున్నాం. అన్నట్లు అసలు విషయం ఏమంటే మీరు బాలకృష్ణ గారి కారులో రావాలి అని సందేశం.

అప్పుడే నిద్రకు రెడీ అయిన నాకు ఈ మెసేజ్ తో జలక్ తగిలినంత పనైంది. ఎంత జర్నలిస్టునైనా బాలకృష్ణ గురించి మీడియాలో చూస్తూ, వింటూ ఉంటాం కదా.సరే… ఇంతకూ ఆ మేసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటారా… బాలయ్య చిన్నల్లుడు భరత్ ఆఫీసు నుంచి. 2019 ఎన్నికల కోసం బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం యూనివర్శిటీ ప్రస్తుత ప్రెసిడెంట్ భరత్ కి నేను పొలిటికల్ కంటెంట్ ఫెలిసిటేటర్ గా వర్క్ చేశాను.

భరత్ వయస్సులో చాలా చిన్నవాడు. అమెరికాలో చదువుకున్నాడు. తన తాత ఎంవిఎస్ మూర్తి చనిపోయాక వారి స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతని భుజాన వేసుకున్నాడు. ఆ క్రమంలో 2019 లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి చివరి నిముషంలో సీటు దక్కించుకున్నాడు. పోటీకి దిగాడు. ఉత్తరాంధ్ర రాజకీయాలపై అప్పటికి తనకి పెద్దగా ఏమీ తెలీదు.

స్థానిక రాజకీయ పరిస్థితుల్ని, పబ్లిక్ మీటింగ్స్ లో ఎలా మాట్లాడాలి వంటి అంశాల్లో తనకి సాయం చేసే పని నాది. (ఈ పని చేసేటప్పుడు పూర్తిగా జర్నలిస్టు పనికి దూరంగా ఉన్నాను. ఏ సంస్థలోనూ కొనసాగలేదు. నాపనికి తగ్గ డబ్బుల్ని తీసుకున్నాను. )ఎన్నికల సమయం చాలా దగ్గరగా ఉండడం, ఎన్నికలకు 10 రోజుల ముందు భరత్ కి టికెట్ ఓకే చెయ్యడంతో ప్రచారానికి పెద్ద సమయం లేదు.

అలాంటి పరిస్థితిలో బాలకృష్ణ సుడిగాలి పర్యటనను ఓకే చేశారు. హైదరాబాద్ నుంచి బాలకృష్ణ నేరుగా విశాఖకి చేరుకున్నారు. ఉదయం అయిందింటికి భరత్ ఇంటికి చేరుకున్నాను. అప్పటికే వాళ్ల ఇంటి ముందు పెద్ద కాన్వాయ్, భారీ జన సందోహం, ఓ పక్క అభిమానులు, మరోపక్క పార్టీ కార్యకర్తలతో హడావిడి వాతావరణం. అయితే నాకు పరిచయం అయిన స్థలం కాబట్టి..నేరుగా ఇంట్లోకి వెళ్లాను.

అప్పటికే తెల్లని పట్టు వస్త్రాలు ధరించి, నుదుటిన తిలకం దిద్ది కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు బాలకృష్ణ. కాసేపటికే అందరం కలసి సింహాచలం బయలు దేరాం. అప్పటికప్పుడు ప్లాన్ మారింది. నేను బాలయ్య కార్ లో కాకుండా, తన వెనుక వచ్చే వేరే కార్ లో కూర్చున్నాను. భరత్ మిత్రులతో పాటుగా. నేరుగా సింహాచలం గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం. వేదమంత్రాల నడుమ స్వామి వారి దర్శనం పూర్తయింది. ప్రసాదం, అల్పాహారం రెండూ ముగించుకున్నాం.

అభిమానులతో ఫొటోలు దిగారు. ఆ సమయంలో ముందు జాగ్రత్తగా నేను ఆయనకి దూరంగా ఉంటూ వచ్చాను. సడెన్ గా భరత్ నన్ను పరిచయం చేశాడు. వెంటనే బాలయ్య…” ఓహ్ మీరేనా. చాలా చిన్న వారే. నేను పెద్ద వారనుకున్నానే. రండి.” అంటూ తన కార్ లోకి ఆహ్వానించారు. ఎందుకో ఆ సమయంలో గుండె వేగం పెరిగింది. వెంటనే భరత్ వైపు చూశాను. “రండి సర్” అంటూ నవ్వుతూ పిలిచాడు.

ఫ్రంట్ సీట్ లో బాలకృష్ణ, వెనుక సీట్లో భరత్, నేనూ. చివర్లో ఒక్కరే కూర్చోవాలనేది బాలకృష్ణ కండిషన్. నెంబర్ విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉంటారట. హై వేకి చేరుకున్నాం. అక్కడ కార్ నుంచి ప్రచార రథంలోకి మారాం. ఆ వ్యాన్ లో బాలకృష్ణ, నేను మాత్రమే ఉన్నాం. ఎదురెదురుగా కూర్చున్నాం. “ఆ చెప్పండి” అంటూ నా వైపు చేయి చూపారు.

వెంటనే ఆరోజు ఆయన ప్రచారం చేయనున్న నియోజకవర్గాల వివరాలను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఒకే రోజులో 4 నియోజక వర్గాలను కవర్ చేయాలి. ఆయన ప్రధానంగా ఏ పాయింట్లు మాట్లాడాలో నేను రాయాలి. అదే నా పని. నేను ఇచ్చిన సమాచారాన్ని ఆయన స్టైల్లో ప్రెజెంట్ చేస్తారు. ఆ క్షణం ఎందుకో తెలియదు కాస్త గర్వంగానూ, గౌరవంగానూ ఫీలయ్యాను.

ఎవరకి నచ్చినా నచ్చకపోయినా తను ఎన్టీఆర్ కొడుకు, తెలుగు సినీ పరిశ్రమ అగ్ర కథానాయకుల్లో ఒకడు. అలాంటి వ్యక్తికి నేను సమాచారాన్ని ఇవ్వడం గౌరవంగానే భావించాను. సరే మరోపక్క ఎక్కడ తను కొట్టిన వాళ్ల లిస్టులో చేరుతానేమోననే భయం ఉండనే ఉంది. నాకు చిన్న అక్షరాలు రాయడం అలవాటు. అలానే రాసిచ్చాను. కానీ… బాలయ్య “పెద్ద అక్షరాలు రాయండి “అని చెప్పారు.

ఆయన కోరిక మేర పెద్ద అక్షరాలతో పాయింట్ల వారిగా సమాచారాన్నిరాసేవాడిని. కానీ ఏ మాటకి ఆమాట… రాసిచ్చిన ప్రతి వాక్యాన్ని ఒక్కసారి అలా చదివి… “రెడీనా” అని అనే వాడు. వెంటనే తనదైన శైలిలో చెప్పేవాడు. “ఇక చూడండి.” అంటూ భలే హుషారుగా చెప్పేవారు. అలా చదువున్నప్పుడు తననే చూసేవాడిని. మెడలో రకరకాల చైన్లు. చేతికి తాయెత్తులు, వేరే వైపు దేవుడి పుస్తకాలు. ఏ మాత్రం ఖాళీ దొరికినా ఎన్టీఆర్ పాటలు, డైలాగులూ వినడం చాలా గమ్మత్తుగా అనిపించింది.

ఆ రోజంతా తను ఫోన్ కు దూరంగా ఉండడం కూడా చాలా విశేషం. ఊహించని సంఘటన.. బాలకృష్ణ ప్రచార రూట్ తెలుసుకున్న అభిమానులు వ్యాన్ వెంట పరుగులు తీశారు. మధురవాడ దగ్గర ఒక్కసారిగా వ్యాన్ టాప్ పైకి ఎక్కాడు బాలకృష్ణ. తన మెడలో ఉన్న పూల దండను అమాంతం అభిమానుల మీదకు విసిరాడు. పరుగెత్తొద్దని చెప్పాడు. ఎందుకొచ్చిన బాధ అని నేను వ్యాన్ లోనే కూర్చున్నాను.

భీమిలి, ఎస్.కోట, నియోజకవర్గాల్లో బాలయ్య ప్రచారానికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రచారం సాగింది. అన్ని గంటలూ ఒకే వ్యానులో, ఎదురెదురుగా తనతో కూర్చున్నాను.కలసి భోజనం చేశాం. నా కుటుంబం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుత మీడియా పై బాలకృష్ణ అనేక విషయాలు మాట్లాడారు. చివరగా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. దిగుతున్నప్పుడు బాలయ్య ఓ మాట చెప్పాడు. “మీరు చిన్నవారు. కానీ రాజకీయాలపై బాగా అవగాహన ఉందే. ఆశ్చర్యం. కానియ్యండి.” అంటూ నమస్తే చెప్పాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని మా ఇంటి దారిపట్టాను.

హ్యాపీ బర్త్ డే నందమూరి బాలకృష్ణ.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!