Story Behind the Popular Song………………….
ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ రాసి ప్రేక్షకులను,రాయక నిర్మాతలను ఏడిపిస్తారని అంటారు. ఇక్కడ ఏడిపించడం అంటే టైమ్ తీసుకుంటాడని అర్ధం. అలా ఎన్నోసార్లు జరిగింది.మనసులో ఎన్ని తిట్టుకున్నా, పాటలు హిట్ అయ్యాక మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరకే వచ్చేవారు.
“చిటపట చినుకులు పడుతూ ఉంటే ” పాట కూడా అలాంటి సందర్భంలో పుట్టుకొచ్చిందే. జగపతి రాజేంద్ర ప్రసాద్ (నటుడు జగపతిబాబు తండ్రి ) నిర్మాతగా మారి “ఆత్మబలం” తీస్తున్న రోజులవి.రాజేంద్ర ప్రసాద్ ఆత్రేయ ఇద్దరూ బెంగళూరు వచ్చి మకాం పెట్టారు. రెండు రోజులు అయినా ఆత్రేయ ఒక్క పాట రాయ లేదు. పేపర్ మీద పెన్నుపెట్టలేదు.
రెండు పెగ్గులు వేయడం .. హాయిగా తినడం .. కాదంటే బయట తిరగడం తోనే టైమ్ గడిచిపోతోంది. షూటింగ్ టైం దగ్గర పడుతోంది. సినిమాలో సుమారు 8 పాటలు అనుకున్నారు. దర్శకుడు మధుసూదన రావు పాటలు వచ్చే సందర్భాలన్నీ ఆత్రేయకు ముందే వివరించారు. ఈ సినిమాకు మాటలతో పాటు పాటలు కూడా ఆత్రేయ సమకూర్చారు. అప్పటికే మాటలు రాసిచ్చిన ఆత్రేయ పాటల విషయంలోనే కుస్తీ పడుతున్నాడు.
మూడో రోజు సాయంత్రం రాజేంద్ర ప్రసాద్ “ఇవాళ లాస్ట్ డే .. పాటల సంగతి తేలకపోతే మద్రాస్ వెళ్ళిపోదాం ” అన్నారట.ఆమాటలతో ఆత్రేయ కాస్త కంగారు పడ్డారు. నిద్ర రాకుండా డెక్సిడ్రిన్ టాబ్లెట్ వేసుకుని కూర్చున్నారు. ఆ రాత్రంతా మేలుకున్నా పాట పల్లవి తట్టలేదు. నాలుగైదు పల్లవులు రాసాడు కానీ అవి ఆయనకే నచ్చలేదట.
తెల్లవారుజామున డ్రైవర్ ను లేపి కారులో కబ్బన్ పార్కు కి వెళ్లారు. అప్పటికే జనాలు మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆత్రేయ కూడా ఆలోచిస్తూ కాసేపు అటు ఇటు తిరిగి బల్ల మీద కూర్చున్నారు. ఇంతలో సడన్ గా వర్షం మొదలైంది. జనాలు తిట్టుకుంటూ చెట్లకిందకు వెళ్లారు.
జంట గా వచ్చిన వాళ్ళు ఆ పక్కనే ఉన్న పొదల్లోకి దూరారు. కొన్ని జంటలు వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ తడుస్తున్నారు. ఆ దృశ్యం ఆత్రేయ కంట బడింది. బుర్రలో ఓ మెరుపు మెరిసింది. మరుక్షణమే పల్లవి తట్టింది. కాసేపట్లో చరణాలు కూడా ఆటోమాటిక్ గా వచ్చేసాయి.
ఆ పాటే “చిటపట చినుకులు పడుతూ ఉంటే .. చెలికాడే సరసన ఉంటే ” . సినిమాలో ఆ పాటను అక్కినేని, బి. సరోజాదేవిలపై చిత్రీకరించారు. పాట అద్భుతంగా వచ్చింది. మహదేవన్ చక్కని ట్యూన్ ఇచ్చారు. నేటికీ ఆ పాట సూపర్ హిట్ సాంగ్ గా నిలిచి పోయింది.
ఆత్మబలం లో “ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నా చూపుల్లో చిక్కుకున్నకుర్రవాడా . “గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళలో ఉన్నది భలే బడాయి “”నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి” “పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు” వంటి పాటలు బాగుంటాయి. జగపతి బ్యానర్ పై తీసిన సినిమాల్లో పాటలతో ఒక ఫిలిం తీసి రాజేంద్రప్రసాద్ దానికి “చిటపట చినుకులు” అని పేరు పెట్టారు.