కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనా ? కేసులు తగ్గి పోయి… ప్రజలు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇది మరో టెన్షన్. థర్డ్ వేవ్ బలహీనంగా ఉండటంతో … ఇక కరోనా మహమ్మారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.
కానీ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ జులై మధ్య కాలంలో దేశంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.. జనం అప్రమత్తంగా ఉండకపోతే… కోవిడ్ వ్యాపిస్తుందనే వార్తలు మళ్లీ అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
మరోవైపు, చైనాలో పెరుగుతున్న కేసులను చూస్తుంటే.. భారత్‌కు మరోసారి కరోనా ముప్పు తప్పేలా లేదు. ఈసారి కరోనా ఏకంగా 75 శాతం మందిపై విరుచుకుపడొచ్చని కొవిడ్-19 టాస్క్ గ్రూపుకు నేతృత్వం వహిస్తున్న వైద్య బృందం హెచ్చరిస్తున్నారు. ఇక, ఇప్పటికే కరోనా బీఏ.2 వేరియంట్ వల్ల దేశంలో మూడో వేవ్ వచ్చింది.
ఇప్పటికీ ఆ వేరియంట్ ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐఐటి ఖరగ్ పూర్ అధ్యయనాలు ఇదే విషయం వెల్లడిస్తున్నాయి. మొత్తానికి.. కరోనా ముగిసిపోయిందనుకునే లోపే..మరో ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.
కొవిడ్ దెబ్బకు నిలిచిపోయిన అన్ని వ్యవస్థలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. రెండేళ్ల తర్వాత భారత్ సహా పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలు పున:ప్రారంభిస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఆందోళన పెంచే వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన మహమ్మారి తీవ్రత గత కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ముప్పు పెరుగుతున్నది. ఈ సబ్ వేరియంట్‌పై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. చైనాతో పాటు పశ్చిమ యూరప్, బ్రిటన్, అమెరికాలో కేసులు కొత్త కేసులు పెరుగుతున్నాయి. వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ దేశాల్లో కూడా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఆయా దేశాల్లో రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
కర్ణాటకలో కూడా జూలైలో కొవిడ్ నాల్గవ వేవ్ వచ్చే సంకేతాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో అక్కడ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.కొవిడ్ నాల్గవ దశను ఎదుర్కొనేందుకు సైతం సన్నద్ధ మవుతున్నది.
ప్రపంచంలోని చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ తదితర 8 దేశాలలో కొవిడ్ కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో విదేశీ ప్రయాణికులపై కర్ణాటక సర్కార్ నిఘా పెట్టింది. ఆయా దేశాల నుంచి విచ్చేసే ప్రయాణికులకు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ మీడియాకు వివరించారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల 701 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 20 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 9 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో ఏడుగురు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు.ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య వేళ్ల మీద లెక్కించే స్థాయికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 3,509 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ గా తేలింది.
ఆ రెండు కేసులు విశాఖ జిల్లాలో నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి కోలుకున్నారు. వరుసగా మరో రోజు కూడా కరోనా మరణాలేవీ సంభవించలేదు.