యండమూరి కొత్త ప్రయోగం !

Sharing is Caring...

ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ ఆన్ లైన్ పెయిడ్ సీరియల్ పేరిట ఓ కొత్త ప్రయోగానికి నాంది పలికారు.ఇప్పటివరకు మనం ఆన్ లైన్ పెయిడ్ సినిమాలు చూసాం. కానీ యండమూరి తీస్తోంది సీరియల్. దాని పేరు “నిశ్శబ్ద విస్ఫోటనం “. యండమూరి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ …. తీసుకున్న సబ్జెక్టు ను బట్టి ఈ సీరియల్ నిజంగా విస్ఫోటనం సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయి .
తెలుగు నాట సీరియల్స్ కు ఆదరణ చాలా ఎక్కువ. అందుకే కొన్ని వందల సీరియల్స్ రూపొందుతున్నాయి. చాలా టీవీలు సీరియల్స్ పైనే ఆధారపడి దూసుకెళ్తున్నాయి. ఈ సీరియల్ అక్టోబర్ 1 నుంచి మొదలు కానుంది. వివరాలు దశల వారీగా తెలియ జేస్తారు.
సీరియల్ గురించి యండమూరి వీరేంద్రనాథ్ చేసిన పరిచయం ఇలా ఉంది.
కొందరు ఎందుకు ఆనందంగా జీవించ(లే)రో పాoడుచ్చేరి అరవిoదులవారు ఒక అద్భుతమైన కథ ద్వారా చెపుతారు.
అన్ని ప్రాణులనీ సృష్టించాక భగవంతుడు తన సృష్టి పట్ల అంతగా సంతృప్తి చెందక, కోతిని పిలిచి “మరింత బాగా రూప కల్పన చేసి, జీవితం ఇంత బాగుంటుందా అనే విధంగా నీకు గొప్ప సుఖాన్ని ప్రసాదించబోతున్నాను. అడవిలో చలికీ, ఎండకీ బాధ పడనవసరం లేదు సాటి జంతువుల భయం లేకుండా బ్రతకవచ్చు. కేవలం ఆకులు పళ్ళూ కాకుండా రకరకాల రుచులు ఆస్వాదించవచ్చు” అని చెప్పాడు. అంతా విని, కోతి “ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు స్వామీ. నీకు మతి పోయింది. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకు గెంతుతూ వెళ్ళే మమ్మల్ని నేల మీద నడిచేలా చేస్తావా? నాలుగు కాళ్ళ మీద కంఫర్టబుల్‌గా నడిచే నన్ను రెండు కాళ్ళ మీద నడిపిస్తావా? పడితే నడుము విరుగుతుంది. సిగ్గు లేకుండా పైగా ఛాతి చూపించుకుంటూ తిరగమంటావా?” అంటూ నిరాకరించింది.
అప్పుడు దేవుడికి కోపం వచ్చి చిలక నుంచి పలుకులనీ, లేడి నుంచి చురుకునీ, కుందేలు నుంచి మెరిసే కళ్ళనీ, నక్క నుంచి తెలివినీ, సింహం నుంచి బలాన్నీ, నెమలి నుంచి అందాన్నీ, డేగ నుంచి దృష్టినీ కలిపి ఒక అద్భుతమైన ఒక కొత్త జీవికి రూపకల్పన చేశాడు. పక్క నుంచి చూస్తున్న సరస్వతి, “ఈ జీవికి మీరు ఏం పేరు పెడుతున్నారు స్వామీ?” అని అడిగింది.
“మనిషి”
“కానీ మీరు ఇతడికి ఇంత బలమూ వగైరా ఇస్తున్నారు కదా. గతంలో రాక్షసులకు కూడా ఇలాగే ఇచ్చి కొంప మీదకు తెచ్చుకున్నారు. వాళ్ళకు అన్ని తెలివితేటలు లేవు కాబట్టి మీరు మోహినీ వేషం వేసి అమృతం పంచినా, భస్మాసురుడిని చంపినా పని సులభంగా అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ మనిషికి ఇన్ని తెలివితేటలు ఇస్తే, రేప్పొద్దున్న అతడు మీ మీదకు దండెత్తితే కష్టం కదా.”
సహేతుకమైన ఈ ప్రశ్నకి భగవంతుడు ఆలోచనలో పడి, “నిజమే. తెలివితేటలు ఇస్తానని వాగ్దానం చేశాను. ఇవ్వాలి. కానీ సులభంగా అందకుండా చేయాలి. ఎక్కడ దాస్తే మంచిదంటావు?” అని అడిగాడు.
“సముద్ర గర్భంలోనో, అగ్నిపర్వతాల క్రిందో, ఆకాశంలోనో పెట్టండి.”
“లేదు దేవీ. ఎప్పటికైనా అది ప్రమాదమే. ఎవడైనా దుర్మార్గుడు వాటిని అందిపుచ్చుకుంటే నాశనకారకుడు అవుతాడు. అందాలి, అందకుండా ఉండాలి. శోధించినవాడే సర్వ సంపన్నుడవ్వాలి.”
భార్యాభర్తలిదరూ కలిసి చాలాసేపు ఆలోచించారు. ఇద్దరికీ ఒకేసారి ఒకే ఆలోచన వచ్చి ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు. మేధస్సునీ, ప్రజ్ఞనీ, తెలివితేటలనీ అన్నీ కలిపి ఒక చోట పెట్టారు. అది ఎక్కడుందో తెలియని వారు కోతిలా ఇప్పుడు బా…నే ఉన్నా కదా అంటూనే మరో పక్క బా…ధ పడుతూ ఉంటారు. కష్టాల్నీ, బాధల్నీ కొని తెచ్చుకుంటారు. శోధించినవారికీ, జీవితంలో బాగుపడదామనుకున్నవారికీ, సహేతుకమైన ఆలోచనా జ్ఞానం ఉన్నవారికి మాత్రమే అది తమ బుర్రలోనే ఉందని తెలుస్తుంది”.
From: నిశ్శబ్ద విస్ఫోటనం. (First PAID ONLINE SERIAL in Telugu. From October 1st. Await details. )
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!