నిజంగా అది దెయ్యాల ద్వీపమా ?

Sharing is Caring...

The most haunted place is the world…………………..

దెయ్యాల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నట్టే ఆ దీవి గురించి కూడా పలు కథలు ప్రచారం లో ఉన్నాయి. ఆ దీవి లో దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రచారం జోరుగా సాగడం తో దాని పేరు ‘దెయ్యాల దీవి’ గా స్థిరపడిపోయింది. ఈ దీవి పేరు ‘పోవెగ్లియా’ ఇటలీ లో ఉంది. పోవెగ్లియా ద్వీపం వెనిస్ సమీపంలో ఉత్తర ఇటలీ తీరంలో ఉంది.

అక్కడ అయిదారు శిధిల భవనాలు కూడా ఉన్నాయి. వేల ఏళ్ళ క్రితం కొన్ని తెగల వారు ఇక్కడ నివసించేవారు. తర్వాత ఆ తెగ అక్కడనుంచి తరలిపోయింది.1348 లో ఇటలీలో ప్లేగ్ వ్యాధి విజృంభించిన నేపథ్యంలో వ్యాధి జనానికి సోకకుండా ప్లేగ్ బాధితులను తీసుకెళ్లి పోవెగ్లియా దీవిలో వదిలేసేవారు.

అప్పటినుంచి ఆ దీవి ఒక డంప్ యార్డ్ లా మారిపోయింది. వ్యాధి బారిన పడి కొందరు అక్కడే చనిపోయారు. బతికిన కొద్దీ మంది కూడా అక్కడి నుంచి తప్పించుకు రాలేక అక్కడే కనుమూశారు. దిక్కుమొక్కు లేకుండా శవాల దిబ్బలా ఆ దీవి తయారైంది. ఎవరైనా ఎదురు తిరిగితే ఇటలీ సైనికులు వారిని మంటల్లోకి నెట్టి చంపేసేవారట.

1645 లో వెనిస్ ప్రభుత్వం ఇక్కడ  అయిదు అష్టభుజి కోటలను నిర్మించింది. అక్కడ  సిబ్బందిని నియమించి తీరప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేసింది. కొంత కాలం సరుకు రవాణా కేంద్రం గా వినియోగించింది. 1793  లో మరల ప్లేగ్ వ్యాధి రావడం తో ఇదొక క్వారంటైన్ కేంద్రంగా మారింది. అపుడు కూడా వేలల్లో బాధితులు మరణించారు. 

అలా చనిపోయిన వారంతా దెయ్యాలుగా మారి కోపంతో తిరుగుతున్నాయని వార్తలు ప్రచారంలో కొచ్చాయి. అది నిజమనుకునేలా కొందరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. అక్కడ అసలు ఏమి జరుగుతుందో తెలుసుకుందామని వెళ్లిన వారిలో చాలామంది  తిరిగి రాలేదు.

ఈ దీవిలో 1922 లో ఒక మెంటల్ ఆసుపత్రి ని పెట్టారు. మానసిక క్షోభకు గురైనవారిని అక్కడకి తరలించేవారు. అక్కడి ఆసుపత్రి లో పని చేసే వైద్యుడు దెయ్యాల గురించి పరిశోధనలు చేసేవారట. అతను కూడా దెయ్యాల ఆగ్రహానికి గురై , మతి చలించి మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 1968 వరకు ఆసుపత్రి పనిచేసింది..  తర్వాత మూత పడింది.

దెయ్యాల ఉనికి నిజమా ? లేక ఉత్తుత్తి ప్రచారమా అనుకునే రోజుల్లో ఒక అమెరికన్ టీవీ రిపోర్టర్ ఈ దీవికి వెళ్లి ఒక కార్యక్రమం చేశారు. అక్కడ దెయ్యాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఘోస్ట్ అడ్వెంచర్స్ టీమ్ కూడా ఇక్కడ కెళ్ళి పరిశోధన చేసింది.

ఎక్కడ పడితే అస్థిపంజరాలు … నిప్పుల్లో కాలిపోయిన వారి బూడిద ఆ మట్టిలో కల్సిపోయాయట.  కొన్ని చోట్ల వింత శబ్దాలు వినిపించేవట. ఎవరో తమ వెనుక తిరుగుతున్నట్టు ఫీలయ్యారట. మొత్తం మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని తేల్చారు.ఈ దీవి పై ఎన్నో పుస్తకాలు .. సినిమాలు కూడా వచ్చాయి.

ఆమధ్య ఈ దీవిని అమ్ముతామని ఇటలీ ప్రకటించింది. కొనటానికి  కొందరు ముందుకొచ్చారు కానీ డీల్ ఒకే కాలేదు. తర్వాత ఒక ఇటాలియన్ వ్యాపారవేత్త లుయిగి బ్రుగ్నారో ఈ దీవిని £400,000 మొత్తానికి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.. కానీ అక్కడ ఏమీ నిర్మించలేదు. 

ప్రస్తుతం ఇటలీలో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఇది ఒకటిగా మారింది. అధికారికంగా ఈ దీవిని దర్శించడం చట్ట విరుద్ధం. అక్కడికి వెళ్ళడానికి పడవలు కూడా ఉండవు.  థ్రిల్ కోరుకునే అన్వేషకులు ఇక్కడికి రహస్యంగా  వెళుతుంటారు. అది క్లుప్తంగా ఆ దెయ్యాల దీవి కథ.

———- KNMURTHY

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!