Action thriller ………
లియో (Leo) ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 2023 నాటి సినిమా ఇది. దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి ప్రస్తుతం Netflix లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.విజయ్, త్రిష, సంజయ్ దత్,అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు.
కథేంటంటే?
హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో పార్థిబన్ (విజయ్) తన భార్య సత్య (త్రిష), పిల్లలతో కలిసి కేఫ్ నడుపుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఒకరోజు రౌడీల నుండి తన కుమార్తెను కాపాడుకునే క్రమంలో పార్థిబన్ చేసిన సాహసం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుంది.
ఆ వార్త చూసిన దాస్ అండ్ కో యజమాని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్), అతనే తమ పాత శత్రువు, తమ సొంత కొడుకు ‘లియో దాస్’ అని భావించి అతని కోసం వస్తాడు. అసలు పార్థిబన్, లియో దాస్ ఒక్కరేనా? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పార్థిబన్ ఏం చేశాడు? అనేదే ఈ యాక్షన్ థ్రిల్లర్ కథ.
పార్థిబన్, లియో దాస్ అనే రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో విజయ్ తన కెరీర్ బెస్ట్ నటనను కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్ ,యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆయన ఎనర్జీ అద్భుతం. త్రిష,ఇతర నటులు కూడా తమ పరిధిలో చక్కగా నటించారు.
సినిమా మొదటి సగం చాలా గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతుంది.సెకండాఫ్ కథ నెమ్మదించి ఫ్లాట్‌గా, ఊహకందేలా సాగుతుంది. సంజయ్ దత్, అర్జున్ వంటి పెద్ద నటులు ఉన్నప్పటికీ వారి విలన్ పాత్రలు బలహీనంగా ఉన్నాయి. లియో దాస్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అందులోని నరబలి పాయింట్ అంతగా పండలేదు.
హాలీవుడ్ చిత్రం ‘ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ ఆధారంగా తెరకెక్కిన ‘లియో’ ఒక పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్.
హైనా రెస్క్యూ ఎపిసోడ్ సినిమా ప్రారంభంలోనే వస్తుంది. ఊరి ప్రజలపై దాడి చేయడానికి వచ్చే ఒక క్రూరమైన హైనాను విజయ్ అత్యంత తెలివిగా, శ్రమించి పట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సీక్వెన్స్ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేస్తుంది.
ప్రథమార్ధంలో విజయ్ నడుపుకునే కేఫ్‌లోకి కొంతమంది రౌడీలు చొరబడి అతని కూతురిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వచ్చే యాక్షన్ బ్లాక్ సినిమాకే హైలైట్. అత్యంత రియలిస్టిక్‌గా, సింగిల్-షాట్ తరహాలో డిజైన్ చేసిన ఈ ఫైట్, దానికి అనిరుధ్ ఇచ్చిన బిజీఎం ఆకట్టుకుంటాయి.
కేఫ్ గొడవ తర్వాత విజయ్ మార్కెట్ కి వెళ్లడం, అక్కడ శత్రువులు అతనిపై దాడికి ప్లాన్ చేయడం, ఆ సమయంలో విజయ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడే ఎమోషనల్ అండ్ యాక్షన్ టెన్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో హీరో లియో దాస్ ని కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, సంజయ్ దత్ గ్యాంగ్‌తో రోడ్డుపై జరిగే భారీ కార్ చేజ్ సీక్వెన్స్, ఫ్యాక్టరీలో వచ్చే ఫైట్ సీన్స్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి.సినిమా ముగింపులో లియో దాస్ అసలు రూపాన్ని చూపిస్తూ విలన్లను అంతమొందించే సీన్ ను బాగా తీశారు.
విజయ్ , త్రిష ల మధ్య వచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ చిత్రానికి చాలా బలమైన ఎమోషనల్ ఫౌండేషన్‌ను ఇచ్చాయి. యాక్షన్ డ్రామా అయినప్పటికీ, వీరిద్దరి మధ్య ఉండే ఫ్యామిలీ బాండింగ్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది. పరిణతి గల భార్యాభర్తలుగా వీరి కెమిస్ట్రీ చాలా సహజంగా కుదిరింది.
కథలో గొడవలు జరిగి పార్థిబన్‌ను అందరూ ‘లియో దాస్’ అని అనుమానిస్తున్నప్పుడు, భార్యగా త్రిష ఎదుర్కొనే మానసిక సంఘర్షణను చాలా బాగా చూపించారు.తన గతం వల్ల తన భార్యాపిల్లల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పుడు, పార్థిబన్‌గా విజయ్ పడే వేదన, వారిని ఒక రక్షణ వలయంలో ఉంచడానికి ఆయన చేసే ప్రయత్నాలు సెంటిమెంట్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ద్వితీయార్థంలో యాక్షన్ డోస్ పెరుగుతుంది.
ఖైదీలోని నెపోలియన్ పోలీస్ పాత్రను ఇక్కడ ప్రవేశపెట్టారు. లోకేష్ స్టైల్ మేకింగ్ అడుగడుగునా కనిపిస్తుంది. అనిరుధ్ ఈ సినిమాను తన మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టేసారు. కేఫ్ ఫైట్ సీన్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ లో అనిరుధ్ ఇచ్చిన రీ-రికార్డింగ్ ప్రేక్షకుల హార్ట్ బీట్ పెంచేలా ఉంటుంది.
సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస విజువల్స్ పరంగా లోకేష్ కనగరాజ్ విజన్‌ను అద్భుతంగా స్క్రీన్‌పై ఆవిష్కరించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు కొండల అందాలను, పగటి వెలుతురును ఎంత అందంగా చూపించారో, రాత్రి వేళల్లో జరిగే క్రూరమైన యాక్షన్ సీన్లను అంతే గ్రిట్టీగా , ఇంటెన్స్‌గా క్యాప్చర్ చేశారు.
సినిమాలో వచ్చే హైనా చేజ్ ఎపిసోడ్, కేఫ్ ఫైట్‌లో ఉపయోగించిన క్లోజ్-అప్ వన్-షాట్ కెమెరా మూవ్మెంట్స్ ప్రేక్షకులను నేరుగా యాక్షన్ లోపల ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. సెకండాఫ్‌లోని ఫ్యాక్టరీ ఫైట్, కార్ చేజ్ సీక్వెన్స్‌లలో కెమెరా యాంగిల్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయి.
ఓవరాల్‌గా, అనిరుధ్, మనోజ్ పరమహంసల సాంకేతిక ప్రతిభ ప్రేక్షకుడికి ఒక హై-వోల్టేజ్ అనుభూతిని అందిస్తుంది.ఆసక్తి ఉన్నవారు సినిమా చూడవచ్చు.

