Character oriented movie ……..
టెస్ట్’ (Test) సినిమా ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఆర్.మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఎస్. శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం
చెన్నైలో జరిగే ఇండియా-పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ఆ మ్యాచ్‌ను టార్గెట్ చేసిన బెట్టింగ్ సిండికేట్ వల్ల ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న జాతీయ స్థాయి క్రికెటర్ అర్జున్ (సిద్ధార్థ్), తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లో కూరుకుపోయిన శాస్త్రవేత్త శరవణన్ (మాధవన్), అలాగే ఐ వి ఎఫ్ ద్వారా సంతానం పొందాలని ఆశ పడే కుముద (నయనతార)లే ఆముగ్గురు.
వారి జీవితాలను టెస్ట్ మ్యాచ్ ఎలా ప్రభావితం చేసింది ?ఎవరెవరు ఏ ఇబ్బందులు పడ్డారు ?వాటి నుంచి ఎలా బయట పడ్డారు అనేది మిగతా కథ.
సిద్ధార్థ్, ఆర్. మాధవన్, నయనతార తమ పాత్రల్లో పరిణతితో కూడిన నటనను కనబరిచారు. ముఖ్యంగా క్రికెటర్ పాత్రలో సిద్ధార్థ్ పడిన ఆందోళన, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. క్రీడలు, మానవ సంబంధాలు, నైతిక విలువల మధ్య సంఘర్షణను ముడిపెడుతూ ఒక కొత్త ప్రయత్నంగా ఈ కథను తెరకెక్కించారు.
ఫామ్ కోల్పోయి, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న క్రికెటర్ అర్జున్ (సిద్ధార్థ్) మ్యాచ్ ఆడేటప్పుడు పడే మానసిక సంఘర్షణకు సంబంధించిన సీన్లు చాలా రియలిస్టిక్‌గా ఆకట్టుకుంటాయి. తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన శాస్త్రవేత్త శరవణన్ గా మాధవన్ ఆపాత్రలో జీవించారు.
తన ఆవిష్కరణను కాపాడుకోవడానికి పడే తపన, ఆయన నిస్సహాయతను చూపించే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అవసరం మనిషిని ఎలా దిగజారుస్తుంది…ఎలా రాజీ పడేలా చేస్తుందనే అంశాలను ఆయా పాత్రల ద్వారా చూపారు.
నయన తార కూడా కుముద పాత్రలో ఒదిగిపోయింది. మాధవన్ నయనతార కాంబినేషన్ సీన్స్ బాగా వచ్చేయి. ఇద్దరూ పోటీ పడి నటించారు. చాలాకాలం తర్వాత నయన తార కు మంచి క్యారెక్టర్ దొరికింది. ఇండియా-పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు వచ్చే కొద్దీ.. మైదానంలో జరిగే ఆటతో పాటు, బయట ఈ ముగ్గురి జీవితాలలో వచ్చే మలుపులను ఒకదానితో ఒకటి ముడిపెడుతూ చూపించిన క్లైమాక్స్ సీన్లు ఉత్కంఠ కలిగిస్తాయి.
కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని కీలక సన్నివేశాలు ఊహించేలా ఉండటం, ఆశించిన స్థాయిలో ఉత్కంఠను రేకెత్తించలేకపోవడం మైనస్‌గా మారింది.ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఉద్వేగం, మైదానంలో కనిపించే గెలుపోటముల టెన్షన్ ఈ సినిమాలో అంతగా పండలేదు. క్రికెట్ మ్యాచ్‌ను కేవలం ఒక బ్యాక్‌డ్రాప్‌గా మాత్రమే వాడుకున్నారు కానీ, ఆ మ్యాచ్ ద్వారా వచ్చే థ్రిల్‌ను సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.
ఒకవైపు క్రికెటర్ సమస్యలు, మరోవైపు శాస్త్రవేత్త ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు బెట్టింగ్ సిండికేట్.. ఇలా ఎక్కువ కథలను ఒకే సినిమాలో చూపించాలని ప్రయత్నించడం వల్ల ఏ ఒక్క పాత్ర ఎమోషన్ కూడా ప్రేక్షకుడికి బలంగా కనెక్ట్ అవ్వదు. నటీ నటులు అంతా బాగా చేశారు. మాధవన్ ,నయనతార ల నటన సినిమాకు హైలెట్. సిద్ధార్ద్ కుమారుడిగా చేసిన బాలనటుడు కూడా బాగా చేసాడు.
సినిమా మొత్తంలో కెమెరా వర్క్ అత్యంత పాజిటివ్ పాయింట్స్ లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా చెన్నైలోని స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ సీక్వెన్స్‌లను విరాజ్ సింగ్ తన ఫ్రేమింగ్స్ తో చాలా ప్రొఫెషనల్‌గా, రియలిస్టిక్‌గా చూపించారు. పాత్రల మధ్య ఉండే ఎమోషనల్, ఇంటెన్స్ మూమెంట్స్‌ను తన విజువల్స్ ద్వారా చక్కగా ఎలివేట్ చేశారు.
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ శక్తిశ్రీ గోపాలన్ ఈ చిత్రంతో సంగీత దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో వచ్చే మెలోడీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కథ మూడ్‌కి బాగా సెట్ అయింది.
క్యారెక్టర్ ఓరియెంటెడ్,ఎమోషనల్ డ్రామా సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఆసక్తి ఉన్నవారు సినిమా చూడ వచ్చు.కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అందులో సందేహమే లేదు.

