Real life events ……………
సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితంలో కేవలం గానమే కాదు, ఆమె అడుగుజాడల్లో ఎన్నో గొప్ప మానవీయ, సేవా సంఘటనలు దాగున్నాయి. ఆమెను సన్నిహితంగా చూసిన వారు రాసిన పుస్తకాలు, వ్యాసాలలో ఇలాంటి మనసును కదిలించే ఎన్నో నిజ జీవిత సంఘటనలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం.
రైలు ప్రయాణంలో సామాన్య మహిళతో కలిసి గానం …..
సుబ్బులక్ష్మి , ఆమె భర్త సదాశివం ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణించడానికి ఇష్టపడేవారు. అలా ఒకసారి ఒక ఆమె రైలు ప్రయాణంలో ఉండగా, ఒక సాధారణ మధ్యతరగతి మహిళ సుబ్బులక్ష్మి దగ్గరకు భయపడుతూ, సంకోచిస్తూ వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న ఆడియో క్యాసెట్ ఉంది. ఆ మహిళ వణుకుతున్న స్వరంతో.. “అమ్మా, మీ క్యాసెట్ విని నేను ఒక శ్లోకం నేర్చుకున్నాను” అని చెప్పింది.
సాధారణంగా పెద్ద సెలబ్రిటీ అయితే థాంక్స్ చెప్పి పంపించేస్తారు. కానీ సుబ్బులక్ష్మి వెంటనే చిరునవ్వుతో, “అవునా! అయితే ఆ శ్లోకాన్ని ఇప్పుడు ఇద్దరం కలిసి పాడుదాం, పాడమ్మా” అని ప్రోత్సహించారు. కదులుతున్న ఆ రైలు పెట్టెలోనే, ఆ సామాన్య మహిళతో కలిసి సుబ్బులక్ష్మి శ్లోకాన్ని ఆలపించారు.ఆ మహిళ కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. తన జన్మ ధన్యమైందని కృతజ్ఞతలు చెప్పి వెళ్లిందా పెద్దావిడ
ఒక వృద్ధురాలి కోసం ప్రత్యేక కచేరీ……
అది ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కచేరీ జరిగిన ఒక సందర్భం. కచేరీ ముగిసిన తర్వాత ఆమె అలసటతో తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో గేటు బయట ఒక వృద్ధురాలు, సుబ్బులక్ష్మి చూడాలని అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణ పడుతోంది. కానీ వారు ఆమెను లోపలికి అనుమతించడం లేదు.
బయట జరుగుతున్న ఈ హడావుడిని గమనించిన సుబ్బులక్ష్మి విషయం తెలుసుకుని ఆ ముసలావిడను లోపలికి రమ్మన్నారు.ఆ వృద్ధురాలు లోపలికి రాగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి, వచ్చిన కారణాన్ని అడిగారు. అప్పుడు ఆ ముసలావిడ కన్నీళ్లతో.. “అమ్మా! మీ కచేరీ వినాలని 10 మైళ్ళ దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను.
కానీ నా దురదృష్టం కొద్దీ నేను వచ్చేసరికే కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూసైనా వెళ్దామంటే వీరు లోపలికి రానివ్వలేదు” అని ఆవేదన వ్యక్తం చేసింది.ఆ మాటలకు సుబ్బులక్ష్మి గారు ఎంతో చలించిపోయారు. మొదట ఆ వృద్ధురాలికి ఆకలి తీర్చడానికి అల్పాహారం పెట్టించారు.
ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా, కేవలం ఆ ఒక్క ముసలావిడ కోసమే ఆమె మళ్లీ పాటలు పాడి వినిపించారు. అక్కడున్న వారందరూ సుబ్బులక్ష్మి మానవత్వానికి, జాలిగుండెకు ముగ్ధులయ్యారు.
ఎలక్ట్రీషియన్ కూతురి పెళ్లికి సహాయం……
ఈ సంఘటన ఆమె దాతృత్వానికి నిదర్శనం. ఒకసారి వారి ఇంట్లో ఫ్యాన్ పాడైపోతే రిపేర్ చేయడానికి తెల్సిన ఎలక్ట్రీషియన్ వచ్చాడు. అతను పని చేస్తూ చాలా దిగులుగా ఉండటం సుబ్బులక్ష్మి గమనించారు. ఎందుకు బాధపడుతున్నావని ఆరా తీయగా.. తన కూతురి పెళ్లి నిశ్చయమైందని, కానీ చేతిలో పైసా లేక ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు.
అంతే, ఆమె ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ ఎలక్ట్రీషియన్ కూతురి పెళ్లికి, అలాగే అతని కొడుకు చదువుకు కావలసిన పూర్తి ఆర్థిక సహాయాన్ని తానే స్వయంగా అందించారు. ఆ రోజు సాయంత్రమే ఆమె దేశ ప్రధాని ఇందిరా గాంధీ, మరికొంతమంది అంతర్జాతీయ ప్రతినిధుల ముందు కచేరీ చేయాల్సి ఉంది. అంత పెద్ద వేదికలపై పాడే ఆమె, తన ఇంట్లోకి వచ్చిన ఒక సామాన్య కార్మికుడి కష్టాన్ని అంతే గౌరవంతో చూశారు.

