Thriller Movie….
భూమిక’ (Bhoomika) ఇది 2021 నాటి థ్రిల్లర్ సినిమా. ఐశ్వర్య రాజేష్, విధు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో, రతీంద్రన్ ఆర్. ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా Netflix ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.
కథాంశం
గౌతమ్ (విధు) ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్. ఊటీలోని ఒక నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో పెద్ద రిసార్ట్ లేదా విల్లా ప్రాజెక్ట్ కట్టాలని ప్లాన్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ పనుల కోసం అతను తన భార్య సంయుక్త (ఐశ్వర్య రాజేష్), వారి చిన్న బాబు, బంధువులైన ఇద్దరు అమ్మాయిలతో కలిసి అడవిలోని పాత బిల్డింగ్‌కు వెళ్తాడు.
అక్కడికి వెళ్ళిన మొదటి రాత్రి నుండే వారికి కొన్ని వింతైన, భయానక సంఘటనలు ఎదురవుతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు తమంతట తామే ఆన్ అవ్వడం, ఎదో అదృశ్య శక్తి తమను వెంటాడుతున్నట్లు అనిపించడం జరుగుతుంది.
అసలు ఆ బిల్డింగ్‌లో ఏముంది? ‘భూమిక’ అనే మానసిక వికలాంగురాలైన అమ్మాయి (అవంతిక వందనపు) గత background కి, ఈ పారానార్మల్ యాక్టివిటీకి ఉన్న సంబంధం ఏంటి? మనుషుల స్వార్థానికి ప్రకృతి ఎలా సమాధానం చెప్పింది? అనేదే మిగిలిన కథ.
ఎప్పటిలాగే ఐశ్వర్య రాజేష్ తన సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఐశ్వర్య రాజేష్ లాంటి నటిని ఒక సాధారణమైన సైకాలజిస్ట్ పాత్రకు పరిమితం చేయడం వల్ల ఆమె నటనకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది.
‘భూమిక’ పాత్రలో అవంతిక వందనపు కొద్దిసేపే కనిపించినా మెప్పిస్తుంది. మిగతా పాత్రధారులు కూడా బాగానే నటించారు. సినిమాను హారర్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేసినప్పటికీ, ఇందులో పెద్దగా భయపెట్టే సీన్లు (Jump Scares) లేవు.
కథను సస్పెన్స్ తో నడిపించారు. హారర్ లోపించడం హారర్ ప్రియులకు నిరాశ కలిగిస్తుంది. రెగ్యులర్ హారర్ చిత్రాల్లో ఉండే పాత పద్ధతులనే (లైట్లు ఆరిపోవడం, కార్లు ఆగిపోవడం) వాడటం వల్ల హారర్ లవర్స్‌ను ఇది మెప్పించలేకపోయింది.
సినిమా రన్‌టైమ్ తక్కువే అయినప్పటికీ (సుమారు 2 గంటలు), స్క్రీన్‌ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది. క్లైమాక్స్ వైపు వచ్చేసరికి సినిమా కథనం కాస్త గందరగోళంగా మారి, ప్రేక్షకుల కు డైరెక్ట్‌గా క్లాస్ పీకుతున్నట్లుగా ఉంటుంది. చాలా చోట్ల కథలో లాజికల్ లోపాలున్నాయి.
ప్రధాన పాత్రలు తప్ప మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ను సరిగా డిజైన్ చేయలేదు, వారి ప్రవర్తన చాలా సహజత్వానికి దూరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా గౌతమ్ సోదరి ‘అదితి’ పాత్ర లౌడ్‌గా ఉంటూ ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తుంది.
దెయ్యాలు అనగానే పాత పగలు, ప్రతీకారాలు చూపించే రొటీన్ కథలకు భిన్నంగా… “ప్రకృతిని నాశనం చేస్తే అది తిరిగి మనుషులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది” అనే పర్యావరణ సందేశాన్ని హారర్ బ్యాక్‌డ్రాప్‌లో చెప్పడం కొత్తగా ఉంది.దానిని తెరపై చూపించిన విధానం సరిగ్గా లేదు. క్లయిమాక్స్ సన్నివేశాలను బాగానే చిత్రీకరించారు.
ఊటీ అడవుల నేపథ్యంలో విజువల్స్ చాలా గ్రాండ్‌గా, అందంగా ఉన్నప్పటికీ.. నెమ్మదైన కథనం, ఆకట్టుకోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమా గ్రాఫ్‌ను తగ్గించేశాయి. రాబర్టో జాజారా కెమెరా పనితనం సినిమాకు పెద్ద హైలైట్. ఊటీ అడవుల అందాలను, అదే సమయంలో రాత్రి వేళల్లో వచ్చే భయానక వాతావరణాన్ని చాలా అద్భుతంగా, రిచ్‌గా విజువలైజ్ చేశారు.పృథ్వీ చంద్రశేఖర్ నేపధ్య సంగీతాన్ని అందించారు.

