Wonder Boy……
ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు ఆదిశేషన్ కె.ఆర్. 2026 జూన్‌లో విడుదలైన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘బాలన్: ది బాయ్’ (Balan: The Boy) లో చిన్నప్పటి బాలన్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఆదిశేషన్ కె. ఆర్. కేరళలోని ఆలప్పుళ జిల్లా, చేర్తల పట్టణానికి చెందినవాడు. 7 సంవత్సరాల వయసు లోనే ఈ బాలనటుడు బాలన్ సినిమాతో కేరళలోనే కాకుండా యావత్ సినిమా ప్రేక్షకుల్లో ఒక సెన్సేషన్‌గా మారాడు.
ఆదిశేషన్ ది ఒక సాధారణ కుటుంబం..ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. సినిమాల్లోకి రాకముందు ఆదిశేషన్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. సుగంధి అనే షార్ట్ ఫిలిం లో నటించాడు. అది చూసిన కాస్టింగ్ డైరెక్టర్ గణపతి ఆదిశేషన్ ప్రతిభను గుర్తించి దర్శకుడు చిదంబరం (మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్) కు పరిచయం చేశారు.
‘బాలన్’ సినిమాలో జైల్లో పుట్టి, నేరస్థుల మధ్య తిరుగుతూ, ఎలాంటి భావాలు బయటకు చూపించకుండా పెరిగే ఒక విలక్షణమైన పిల్లాడి పాత్రను ఆదిశేషన్ పోషించాడు. ఈ కఠినమైన పాత్ర కోసం ఆదిశేషన్ తన యాక్టింగ్ కోచ్ శివలాల్ పర్యవేక్షణలో 6 నెలల పాటు నటన లో శిక్షణ తీసుకున్నాడు.
సినిమాలో ఈ బాబుకు పెద్దగా డైలాగులు ఉండవు. కేవలం తన కళ్లు, ముఖ కవళికలతోనే భయం, అమాయకత్వం, ఒంటరితనం వంటి ఎమోషన్స్‌ను పండించి పెద్ద పెద్ద విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఆదిశేషన్ చేర్తల సమీపంలో ఉన్న ‘తన్నీర్ముక్కం ఎల్‌పీ స్కూల్’ ) లో 2వ తరగతి చదువుతున్నాడు.
‘బాలన్’ సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యాక అతను తిరిగి తన స్కూలుకు వెళ్లినప్పుడు.. స్కూల్ హెడ్‌మాస్టర్, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి అతనికి ఘనంగా స్వాగతం పలికారు.
ఆదిశేషన్ తండ్రి పేరు రతీష్ (Ratheesh), తల్లి పేరు కవిత (Kavitha). అందుకే అతని పేరు చివర K. R. అని ఉంటుంది. ఈ సినిమా కోసం ఆదిశేషన్ శిక్షణ తీసుకునే సమయంలో అతని తల్లి నిరంతరం అతనితోనే ఉండి ఎంతో సపోర్ట్ చేశారు.యాక్టింగ్ కోచ్ ఇచ్చిన చిన్న చిన్న హోంవర్క్‌లను, కంటిచూపుతో హావభావాలు పలికించే ఎక్సర్‌సైజులను ఆదిశేషన్ చేత ఆమె ఇంట్లో రోజూ ప్రాక్టీస్ చేయించేవారు.
షూటింగ్ సమయంలో కూడా చిన్న పిల్లాడైన ఆదిశేషన్‌కు ఎలాంటి మానసిక ఒత్తిడి కలగకుండా, హోమ్లీ వాతావరణం ఉండేలా ఆమె చూసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆదిశేషన్ తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వంటి నగరాలకు కూడా వెళ్లి వచ్చాడు.
బాలనటుడు ఆదిశేషన్‌కు అత్యంత ఇష్టమైన నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి,టోవినో థామస్ లు.
‘బాలన్’ సినిమా షూటింగ్ సమయంలో ఆదిశేషన్‌కు టోవినో థామస్‌తో మంచి స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి టోవినో ను టోవి అంకుల్’ అని పిలుస్తాడు.
టోవినో థామస్ నటించిన ‘2018’ సినిమాలో ఆయన పాత్ర చనిపోవడం చూసి, నిజంగానే చనిపోయారనుకుని ఆదిశేషన్ అప్పట్లో చాలా ఏడ్చాడట. ఆ తర్వాతే వాళ్ల అమ్మ అది కేవలం నటన అని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడట.


