ఆకట్టుకునే మిస్టరీ, ఎమోషనల్ డ్రామా !!

Sharing is Caring...

Mystery drama……….

‘బాలన్: ది బాయ్’ (Balan: The Boy) ఇటీవలే విడుదలైన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో సంచలనం సృష్టించిన  చిదంబరం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.జితు మాధవన్ ఒక విభిన్నమైన మదర్-సన్ బాండింగ్ కథను అందిస్తే దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఇది.

కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ZEE5 లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.  

కథాంశం ఏమిటంటే ?

కథ అంతా తల్లీ కొడుకుల చుట్టూ తిరుగుతుంది. గతానికి సంబంధించిన కొన్ని భయంకరమైన చేదు జ్ఞాపకాలు, రహస్యాల నుండి తప్పించుకోవడానికి తల్లి (ఫర్జానా పలతింగల్) తన కొడుకుని తీసుకుని వేర్వేరు పేర్లతో, ప్రదేశాలు మారుస్తూ బతుకుతుంటుంది.సమాజానికి,తన కొడుకును దూరంగా ఉంచుతూ ఎంతో జాగ్రత్తగా పెంచుతుంది.

అయితే, వారు ఎంత ప్రయత్నించినా వారి గతం వారిని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఒకరోజు ఊహించని సమస్య ఎదురై పోలీసులు రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత ఆ తల్లి కొడుకులు దూరమై పోతారు..తర్వాత మరల ఎలా కలిశారు అనేదే ఈ చిత్ర కథ.

ప్రధాన పాత్రల్లో నటించిన ఫర్జానా పలతింగల్, చైల్డ్ ఆర్టిస్ట్ ఆదిశేషన్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఒక తల్లి ఆవేదనను, పసివాడి భయాన్ని వారు స్క్రీన్‌పై పండించిన విధానం ప్రేక్షకులను కదిలిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు టోవినో థామస్, కీలకమైన పాత్ర పోషించారు.బామ్మ పాత్ర ధారి కూడా బాగా చేశారు.

సినిమా క్లైమాక్స్ ఈ చిత్రానికి అతిపెద్ద బలం. ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ అది. హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్‌తో ముగింపు ఉంటుంది. దర్శకుడు చిదంబరం ఈ కథను కమర్షియల్ పంథాలో కాకుండా పూర్తిగా ఎమోషనల్, స్లో-మెలోడ్రామాగా నడిపించారు.

కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇది అందరికీ నచ్చే రెగ్యులర్ థ్రిల్లర్ చిత్రం కాదు. కేవలం ప్యూర్ ఆర్ట్, సైకలాజికల్, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి మాత్రమే బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా లో పాత్రలన్నీ ముఖ్యమైనవే. అందరూ బాగా నటించారు.  

సినిమా ప్రారంభంలో తల్లి తన చిన్న కొడుకును తీసుకుని,కొత్త ప్రదేశానికి వెళ్లే సీన్ ఒక రకమైన ఉత్కంఠను, మిస్టరీని క్రియేట్ చేస్తుంది. బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియని కొడుకు అమాయకపు ప్రశ్నలు, అతనికి సమాధానం చెప్పలేక, సమాజం నుండి అతన్ని కాపాడుకోవడానికి ఆ తల్లి వేదన పడే సీన్లు ఎంతో సహజంగా, ఆకట్టుకునేలా ఉంటాయి.

పోలీస్ స్టేషన్ లో ఆదిశేషన్ పోలీసులతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటూ ..అక్కడి నుంచి పారిపోవడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఆదిశేషన్ ను లారీ డ్రైవర్ అర్ధరాత్రి రోడ్డు మీదే వదిలివెళ్లిన దృశ్యం..టోవినో థామస్ వెంట వెళ్లి అతనితో ఉంటూ పగలు స్కూల్ కి వెళుతూ, రాత్రిళ్ళు బార్ లో పని చేస్తూ ,దొంగతనాలు చేస్తూ పెద్దయ్యే సీన్స్ బాగా వచ్చాయి.

చిన్న బాలన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఆదిశేషన్ భలే నటించాడు. ఏం మాట్లాడకుండా అమాయకంగా కనిపించాడు..  కొంత పెద్దయ్యాక బాలన్ గా మరో కుర్రాడు నటించాడు. కుర్రోడు ఆదిశేషన్ లాగా ఉండటం విశేషం. పోలీసుల్లో కూడా జాలి దయ ఉండేవాళ్ళను.. అవి లేని వాళ్ళను కూడా సినిమా లో చూపారు.  

ఈ సైకలాజికల్ మిస్టరీ డ్రామాను క్లాసిక్ లెవెల్‌కు తీసుకువెళ్లడంలో సాంకేతిక బృందం కీలక పాత్ర పోషించింది.ఈ చిత్రానికి ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ షైజు ఖాలిద్  కెమెరా బాధ్యతలను నిర్వహించారు.
సినిమాలోని మిస్టరీ, భయాందోళనలను చూపించడానికి ఆయన ఉపయోగించిన లైటింగ్, కలర్ ప్యాలెట్ అద్భుతంగా ఉన్నాయి.

పల్లెటూరి వాతావరణాన్ని, కేరళ తీర ప్రాంతాలను ఎంతో అందంగా, అదే సమయంలో ఒక విధమైన నిశ్శబ్ద భయాన్ని కలిగించేలా కెమెరాలో బంధించారు.తల్లి-కొడుకుల ముఖాల్లోని ఎమోషన్స్, భయం, ఆవేదనలను చూపించడానికి వాడిన క్లోజ్-అప్ షాట్స్ ప్రేక్షకులను కథకు బాగా కనెక్ట్ చేస్తాయి.

సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు గుండెకాయ లాంటిది. మొదటి భాగంలో వచ్చే మిస్టరీ, సస్పెన్స్ సీన్లలో వచ్చే థ్రిల్లింగ్ సౌండ్స్ ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి.సెకండ్ హాఫ్‌లో వచ్చే సెంటిమెంట్ సీన్లు, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌లో సుషిన్ శ్యామ్ అందించిన మెలోడీ సంగీతం బాగుంది.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!