చూడదగిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్!!

Sharing is Caring...

 Investigative crime thriller………..

‘ఉయిర్’రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.
‘ఉయిర్’ అంటే ప్రాణం అని అర్ధం .. చిత్రానికి ఎమ్. పద్మకుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే ??

కథ కన్నూర్‌ లోని ధర్మడం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్ అయిన అజిత్ (రోషన్ మాథ్యూ) కు ఒక పాడుబడిన బావిలో గుర్తుతెలియని మహిళ శవం లభ్యమైన కేసు అప్పగిస్తారు.మొదట ఆత్మహత్యగా భావించిన ఆ కేసు, విచారణ జరిపే కొద్దీ శోభ (శ్రుతి మేనన్) హత్య అని గుర్తిస్తారు

ఈ క్రమంలో కేసు అజిత్ వ్యక్తిగత జీవితానికి ఎలా కనెక్ట్ అయింది? అసలు హంతకుడు ఎవరు? అనేదే మిగిలిన కథ.

పోలీస్ అధికారి కథ సమకూర్చడం వలన పోలీస్ స్టేషన్ వాతావరణం, విచారణ పద్ధతులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వంటివి చాలా సహజంగా చూపించారు. యదార్థ సంఘటనల ఆధారంగా షాజీ మారడ్ అనే  పోలీస్ అధికారి అందించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. చైల్డ్ మిస్సింగ్,అక్రమ సంబంధాలు, తదనంతర పరిణామాల వంటి అంశాల చుట్టూ కథ అల్లుకున్నారు.

సిన్సియర్ SI గా  రోషన్ మాథ్యూ అద్భుతమైన నటనను కనబరిచాడు. అతనికి జోడీగా బైజు సంతోష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది.హంతకుడి పాత్రలో షాజు బాగా చేశారు.శోభ పాత్రలో శ్రుతి మేనన్  జీవించింది. ఆపాత్ర పరిధి చాలా తక్కువ. మిగతా నటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. 

సినిమా ప్రారంభంలో పాడుబడిన బావిలో కుళ్ళిపోయిన మహిళ శవం లభ్యమయ్యే ఓపెనింగ్ సీన్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆ శవం ఎవరిదో కనిపెట్టడానికి హీరో రోషన్ మాథ్యూ చేసే చిన్న చిన్న క్లూస్ ఆధారిత విచారణ చాలా సహజంగా, ఆకట్టుకునేలా ఉంటుంది ..విచారణ కోసం పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం, అక్కడ స్థానిక పోలీసుల సాయంతో నిందితుల కోసం వెతికే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి.

హీరో తన చిన్ననాటి వ్యక్తిగత బాధను (Trauma) ఈ కేసుతో ముడిపెట్టుకుని, ఎమోషనల్ అయ్యే సీన్లలో రోషన్ మాథ్యూ నటన ఆకట్టుకుంటుంది.  నేరగాళ్లు పోలీసులను ఎలా మోసగిస్తారో ..తప్పించుకోవడానికి  ఎలాంటి ఎత్తులు వేస్తారో  హంతకుడి పాత్ర ద్వారా బాగా చూపారు. సినిమా చివరి 30 నిమిషాలు,  క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. కేవలం క్రైమ్ థ్రిల్లర్‌గానే కాకుండా మంచి ఎమోషనల్ వెయిట్‌ను ఇస్తాయి.

సినిమాలో ఇన్వెస్టిగేషన్ సీన్లు చాలా నెమ్మదిగా సాగుతాయి. దర్శకుడు కొన్ని సీన్లను 90ల నాటి పాత పద్ధతిలో తెరకెక్కించడం వల్ల థ్రిల్ తక్కువగా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు సాగదీసినట్లుగా ఉండి, కథనాన్ని కాస్త పక్కదారి పట్టిస్తాయి. ఒక ఐటమ్ సాంగ్ ను కూడా పెట్టారు. సినిమా క్లయిమాక్స్ కు ముందు కథలో వచ్చే మలుపులు, హంతకుడిని పట్టుకునేఎపిసోడ్ ప్రేక్షకుడికి తృప్తిని ఇస్తుంది.

ఈ చిత్రం మిస్సింగ్ చిల్డ్రన్ విషయంలో వ్యవస్థ  నిస్సహాయతను ఎత్తిచూపుతుంది. ముంబయి లో ఒక చోట తప్పిపోయిన పిల్లలు బందీలుగా ఉన్న దృశ్యాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. బాలల అక్రమ రవాణా సమస్యను కూడా డైరెక్టర్ ప్రస్తావించడం విశేషం.

హీరో సొంత చెల్లెలు రైలు ప్రయాణంలో తప్పిపోతుంది. అందుకే క్లైమాక్స్‌లో ఈ పిల్లలను కాపాడే సన్నివేశం అతనికి ఒక వ్యక్తిగత ఉపశమనాన్ని, ప్రేక్షకులకు ఒక బలమైన సామాజిక సందేశాన్ని అందిస్తుంది. 

అజయ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది. పల్లెటూరి వాతావరణాన్ని బాగా క్యాప్చర్ చేసింది. అయితే మణికందన్ అయ్యప్ప అందించిన సంగీతం,బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేవు, కథకు పెద్దగా ప్లస్ అవ్వలేదు.
యదార్థ సంఘటనల ఆధారంగా సాగే రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి  ఈ సినిమా నచ్చుతుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!