A movie that wasn’t very entertaining……..
“పోలీస్ కంప్లైంట్” (Police Complaint). ‘రియాక్షన్ ఆఫ్ కర్మ’ కాన్సెప్ట్‌తో దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని రూపొందించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.
కథ ఏమిటంటే ?
ఒక గర్భిణి మహిళ క్షుద్రపూజల నేపథ్యంలో దారుణంగా హత్యకు గురవుతుంది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ మర్డర్ మిస్టరీ కేసు మూలనపడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో, ‘అద్వైత’ అనే ఒక చిన్నారి ఎవరినైతే ‘డాడీ’ అని పిలుస్తుందో, వారంతా వరుసగా విచిత్రమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతుంటారు.
ఈ వింత వరుస మరణాల కేసును ఛేదించడానికి డైనమిక్ పోలీస్ ఆఫీసర్ (వరలక్ష్మి శరత్‌కుమార్) రంగంలోకి దిగుతుంది. ఆమె దర్యాప్తు తీవ్రం చేసే కొద్దీ.. ఈ కేసుతో తన భర్త డాక్టర్ రామ్ (నవీన్ చంద్ర) కు ఉన్న సంబంధం, అతని అసలు స్వరూపం బయటపడతాయి.
అసలు ఆ చిన్నారి ఎవరు? వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? తన భర్త కూడా నిందితుడని తెలిశాక ఆ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనేదే మిగిలిన కథ.
పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి తన నటనతో సినిమాను వన్‌మ్యాన్ షోగా నడిపించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న డాక్టర్ రామ్ పాత్రలో నవీన్ చంద్ర తనదైన శైలిలో నటించారు. కృష్ణసాయి తన పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.కథను మలుపు తిప్పే ప్రధానమైన పాత్ర బేబీ అద్వైతది.
ఈ పాప ఎవరినైతే ‘డాడీ’ అని చూపిస్తుందో వారు మరుసటి రోజే శవమై కనిపిస్తుంటారు. ఈ మిస్టరీ ఎలిమెంట్ సినిమాలో సస్పెన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్తుంది. బేబీ అద్వైత గా నటించిన పాప బాగా చేసింది. సీరియస్ క్రైమ్ స్టోరీ మధ్యలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిల కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు కొంత రిలీఫ్‌ని ఇస్తుంది.కొన్నిచోట్ల అతి అనిపిస్తుంది.
సంజీవ్ మేగోటి ఎంచుకున్న ‘కర్మ ఫలితం’ అనే పాయింట్, హారర్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ కథలో కొంత కన్ఫ్యూషన్ కనిపిస్తుంది.వివిధ జానర్ల మిక్సింగ్ కుదరలేదు.కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. కథపై సరైన కసరత్తు జరగలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, హారర్ డ్రామా, క్షుద్రపూజలు, ఫ్యామిలీ సెంటిమెంట్‌ను కలపాలని దర్శకుడు చేసిన ప్రయత్నం వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి.
హారర్, థ్రిల్లింగ్ డోస్ మరికొంత పెంచి ఉంటే బాగుండేది.కొన్ని సీన్లు రెగ్యులర్ ప్రెడిక్టబుల్ టెంప్లేట్‌లో సాగుతాయి. ఫస్టాఫ్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో వేగంగా సాగినప్పటికీ,సెకండాఫ్‌లో అసలు నిజాలు రివీల్ అయ్యే సమయంలో కథనం కొంత నెమ్మదించి నాటకీయత ఎక్కువైంది.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలతో కూడిన సాంగ్ బాగుంది. కథలో చాలా చోట్ల లాజిక్ లోపించింది.కొన్నిఅనవసరపు సీన్లను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. ప్రారంభంలో ఉన్నంత థ్రిల్ తర్వాత ఉండదు. సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.
ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా నైట్ షాట్స్, హారర్ ఎపిసోడ్స్‌ను కెమెరాలో బాగా క్యాప్చర్ చేశారు. సుధీంద్ర అందించిన నేపథ్య సంగీతం కొన్ని సీన్లలో బాగుంది.సస్పెన్స్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వారికి ఓటీటీలో ఇది ఒక ‘వన్ టైమ్ వాచ్’ సినిమా అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

